Telangana Debt

అసమర్థ పాలనలో అప్పుల కుప్పగా రాష్ట్రం

త బీఆర్ఎస్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పులకుప్పగా మారుస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20న రాష్ట్ర అసెంబ్లీలో రూ.3,24,267 కోట్ల రెవెన్యూ వ్యయంతో ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్ వెల్లడి చేస్తుంది. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతమని ప్రకటించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,29,720 కోట్ల రెవెన్యూ సంపాదిస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించి కేవలం రూ.2,03,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. వాస్తవానికి కాగ్‌ నివేదిక ప్రకారం జనవరి 2026 వరకు ప్రభుత్వం రెవెన్యూ ఆదాయం కేవలం రూ.1,38,371 కోట్లు మాత్రమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2,03,000 కోట్లు సాధించాలంటే, జనవరి 2026 నుండి ఇప్పటివరకు అంటే 50 రోజుల్లో రూ.65 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని మంత్రి ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో రూ.లక్ష కోట్ల అదనపు అప్పు భారం ప్రజలపై మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి. 

ప్రస్తుత బడ్జెట్ లో మొత్తం మూలధన ఆదాయం రూ.82,870 కోట్లు మాత్రమే ఉండడంతో రుణాలుగా దాదాపు అంత మొత్తం సేకరించేందుకు ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్‌ రుణాలు – రూ.73,383 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలు – రూ.5,500 కోట్లు, ఇతర రుణాలు – రూ.వెయ్యి కోట్లు, రుణాలు, అడ్వాన్సులు – రూ.1,486 కోట్లు అని చూపారు. అయితే, వాస్తవానికి ఆదాయం గణనీయంగా తగ్గి, రుణాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలకు చేరువవుతుంది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం కొత్తగా భారీగా అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించింది. దీనివల్ల వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పు భారం రూ.5.62 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే సుమారు రూ.3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని గ్రహించాలి. ప్రస్తుత బడ్జెట్ లెక్కల ప్రకారం తెలంగాణలోని ప్రతి వ్యక్తిపై సుమారు రూ. 2.16 లక్షల అప్పు భారం పడుతోందని గణాంకాలు తెలుపుతున్నాయి. సంక్షేమ పథకాల కంటే అప్పులు తీసుకురావడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడంతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. తలసరి ఆదాయం అంతకుముందు 15.34 శాతం వృద్ధిరేటు నమోదైతే, కాంగ్రెస్‌ పాలనలో ఇది కేవలం 10.2 శాతానికే పరిమితమైంది. అదేవిధంగా జీఎస్డీపీ వృద్ధిరేటు గతంలో సగటున 12.5 శాతంగా నమోదవగా, 2024-25లో 10.7 శాతానికి పరిమితమైంది. జీఎస్డీపీలో వ్యవసాయరంగ వాటా నిరుడు 17.3 శాతంగా ఉంటే ఈ ఏడాది 15.1 శాతానికి పడిపోయింది. పరిశ్రమలు, మైనింగ్‌, తయారీరంగ వాటా నిరుడు 16.4 శాతంగా ఉండగా ఇప్పుడు 16.3 శాతానికి పరిమితమైంది. రేవంత్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు రంగాన్ని 4.64 శాతం మంది విడిచిపెట్టారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న, గత ఎన్నికలలో అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారంటీలకు గత బడ్జెట్‌లో రూ.56 వేల కోట్లు కేటాయింపులను ప్రతిపాదించి, ఇప్పుడు దాన్ని రూ.50 వేల కోట్లకు తగ్గించారు. ఇప్పటికీ పలు హామీల ప్రస్తావనే ప్రభుత్వం చేయడం లేదు. విద్యా రంగానికి గత ఏడాది కంటే రూ. 1000 కోట్లు పెంచినట్లు చూపిస్తున్నా, బడ్జెట్‌లో దీని వాటా కేవలం 8 శాతం మాత్రమేనని కావడం గమనార్హం. విద్యకు 16 శాతం నిధులు కేటాయించాలని విద్యాశాఖ కమిషన్ ప్రతిపాదించినా 8 శాతానికే పరిమితం చేయడం విస్మయం కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (13%), బీహార్ (21%) తమ బడ్జెట్‌లో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతలో సగం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ హయాంలో 3లక్షల పింఛన్లు కత్తిరించి, ఇప్పుడు కొత్తగా 2లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని చెబుతున్నారు. దేవాదాయ శాఖకు గత బడ్జెట్‌లో రూ.190 కోట్లు కేటాయించినా ఈసారి ఆ ప్రస్తావనే లేదు.

అధికారంలోకి రాగానే తొలి ఏడాదే రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండేళ్లలో కేవలం 60,000 మందికి మాత్రమే ఇచ్చినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే ఏడాది ఉద్యోగాల కల్పన గురించి ఆయన ప్రస్తావించలేదు. బడ్జెట్‌లో జర్నలిస్టులకు మొండిచేయి చూపించారని జర్నలిస్ట్ సంఘాలు పేర్కొంటున్నాయి. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో అదనంగా రూ.100 కోట్లు సంక్షేమ నిధిని కేటాయిస్తానని చెప్పి ప్రస్తుత బడ్జెట్‌లో కూడా చిల్లి గవ్వ కేటాయించలేదు.

అంకెల గారడీ – ఒక ఫెయిల్డ్, ఫాల్స్, ఫ్యాన్సీ బడ్జెట్!

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పొరపాటున గత ఏడాది బడ్జెట్ నే చదివారేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎందుకంటే పోయినసారి బడ్జెట్‌తో పోలిస్తే ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా, ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకపోవడం బాధాకరమన్నారు.

ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా చెల్లించలేని రేవంత్ ప్రభుత్వం, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను కూడా ఆరోగ్యశ్రీ విభాగానికే అప్పగించడం అంటే ఆ సంస్థను కూడా దివాళా తీయించడమేనని హెచ్చరించారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా ‘ఫ్యూచర్ సిటీ’ అని ఫ్యాన్సీ పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అన్నీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ పథకాల వల్ల వచ్చినవేనని స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్ (RRR), దాని పక్కన వచ్చే రీజనల్ రింగ్ రైల్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ అని, కేవలం భూసేకరణ తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని ఎండగట్టారు.

రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని రాంచందర్ రావు మండిపడ్డారు. ఐదు దఫాలుగా రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా, సరిగ్గా ఇవ్వలేదన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ. 45,000 చొప్పున ఎగ్గొట్టారని విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4000 నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఆర్థిక సాయం గురించి కానీ ఈ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించడం లేదన్నారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయం రెండు రోజుల్లోనే రూ.5000 కోట్ల నుండి రూ.7000 కోట్లకు ఎలా పెరిగిందని రాంచందర్ రావు నిలదీశారు. ఇదంతా ఒక ప్లానింగ్ లేని విధానమని, కేవలం దోచుకోవడానికేనని ఆరోపించారు.

అర్చకుల వేతనాలు పెంచాలని, ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్ పెంచాలన్న డిమాండ్లను పట్టించుకోకుండా, కేవలం మైనారిటీ బడ్జెట్‌ను రూ. 700 కోట్లు పెంచడం ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగమేనన్నారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి, వాటికి తగిన కేటాయింపులు జరపకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఓవరాల్‌గా ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, పేదలకు దూరంగా ఉన్న ఈ ‘ఫెయిల్డ్ బడ్జెట్’ను బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.