స్వదేశీని ప్రోత్సహిద్దాం..!
‘‘మనం మన దేశంలో తయారయ్యే వస్తువులనే వినియోగించాలి. స్వదేశీని ప్రోత్సహించాలి. మనకు అవసరమైన వస్తువులను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లక్షలాది, కోట్లాది రూపాయలు బయటకు వెళ్లిపోతాయి. అదే మనమే ఉత్పత్తి చేసి, వినియోగించుకుంటే ఆ సంపద దేశంలోనే ఉంటుంది.’’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. నవంబర్ 21న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియన్ రాష్ట్రస్థాయి కార్యశాల విజయవంతంగా జరిగింది. ఈ కార్యశాలలో రాంచందర్ రావుతో పాటు బిజెపి జాతీయ నాయకులు హెచ్. రాజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతం రావు, వేముల అశోక్, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కమిటీ సభ్యులు విక్రం రెడ్డి, మహిపాల్ రెడ్డి, సుధా పటేల్, సుధాకర్ శర్మ, నాగ పరిమళ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యశాలలో ఎన్.రాంచందర్ రావు ప్రసంగిస్తూ.. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ 55 సంవత్సరాలు మన దేశాన్ని పాలించింది. కానీ ఆ 55 సంవత్సరాల్లో భారత్ ఎప్పుడూ స్వతహాగా నిలబడలేదు. ఎప్పుడూ ఏదో ఒక దేశం సహకారంతోనే ముందుకు వెళ్లాల్సి వచ్చేది. గతంలో మన దేశం భిక్ష పెట్టుకుని విదేశాలకి వెళ్లేదని చెప్పేవారు. మన దేశంలో పౌష్టికాహారం లేక పిల్లలు చనిపోతున్నారు, కరువులు వస్తున్నాయి అనే ఘటనలు, మాటలు వింటుండేవాళ్లం. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. నేడు భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇప్పుడు మన విదేశీ మారక ద్రవ్యం భారీగా పెరిగింది. మనం 56 దేశాలకు అప్పు ఇస్తున్నాం. కరోనా ఆపత్కాలంలో కూడా భారతదేశం ఎవరి మీద ఆధారపడలేదు. ప్రపంచంలో మొదటి కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన దేశం భారత్. మన దేశంలోని 140 కోట్ల జనాభాకే కాదు, అనేక దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపాం. అది భారతదేశం శక్తి. గతంలో మనం లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆయుధాలు కొనేవాళ్ళం. కానీ ఇప్పుడు బ్రహ్మోస్ , తేజస్ .. ఇలా మన దేశంలోనే తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాం. ‘ఆపరేషన్ సిందూర్’లో మన దేశంలోనే తయారు చేసిన ఆయుధాలు, విమానాలు అద్భుతంగా పనిచేశాయి. భారతదేశం ఇంత పెద్ద ఎత్తున స్వదేశీ రక్షణ సామగ్రి తయారు చేస్తుందనే విషయం తెలుసుకుని ప్రపంచం ఆశ్చర్యపోయింది.
మన ఆలోచన స్వదేశీ ఉండాలి. మన వాడకంలో కూడా స్వదేశీ ఉండాలి. మన దగ్గర ఎంతోమంది చేనేత కళాకారులు, చేతివృత్తుల వారు, నైపుణ్యం ఉన్న కార్మికులు ఉన్నారు. మన గ్రామాల్లో అనేక వస్తువులు తయారవుతున్నాయి. అవన్నీ మనం కొనాలి, ప్రోత్సహించాలి. మన దినచర్యలో వాడే వస్తువులు కూడా స్వదేశీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ యాంటీ-ఇండియా స్లోగన్స్ ఇచ్చే వాళ్లకు అవార్డు ఇచ్చింది. కానీ మన ఆలోచన ఎల్లప్పుడూ ప్రో-ఇండియా ఉండాలి. మన మనసు ప్రో-ఇండియా. మన చర్యలు ప్రో-ఇండియా. మనం వాడే వస్తువులు కూడా ఇండియన్ కావాలి. స్వదేశీ వస్తువులు వాడితేనే రేపు ఈ దేశాన్ని బలమైన దేశంగా మార్చగలుగుతాం. ‘వికసిత భారత్’ లక్ష్యంతో పనిచేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మలచాలి. ఆ దిశలో మనం నరేంద్ర మోదీ నాయకత్వంలో వేగంగా ముందుకు సాగుతున్నాం.’’ అని అన్నారు.

