Coal Bhatti revanth

తెలంగాణ కాంగ్రెస్‌లో సింగరేణి గనుల టెండర్ల దుమారం

సింగరేణి నైనీ బొగ్గు గని టెండర్ల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో పెను దుమారం రేపుతోంది. ఈ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరాటం బహిర్గతమైంది. అర్ధాంతరంగా టెండర్ పక్రియను రద్దు చేయడం వెనుక ఈ టెండర్‌ను కైవసం చేసుకొనేందుకు ఈ ముగ్గురు కుమ్ములాటకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతానని భట్టి విక్రమార్క చెప్పడం చూస్తుంటే ఈ విషయంలో వారి మధ్య విబేధాలు రచ్చకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే దినపత్రికలో ఈ టెండర్ల మాయాజాలం బహిర్గతం కావడం ఈ వివాదానికి మరింతగా ఆజ్యం పోస్తోంది. ఈ వ్యవహారం దిల్లీలోని పార్టీ పెద్దల వరకూ వెళ్లినట్లు చెబుతున్నారు.

టెండర్ల విషయంలో మంత్రుల మధ్య కుమ్ములాటలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. మీడియాలో పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, ఆ తర్వాత అందరూ మౌనంగా ఉండటం గమనిస్తుంటే వాటాల మధ్య సయోధ్య కోసమే ఆ విధంగా రభస చేస్తున్నట్లు వెల్లడవుతుంది. మధ్యలో ఈ కథనాలను ప్రచురించిన మీడియా, ఆయా వ్యవహారాలు చూస్తున్న ఐఏఎస్ అధికారులు నలిగి పోతున్నట్లు కనిపిస్తున్నది. మేడారం టెండర్లలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ మధ్య జరిగిన పంచాయితీ గతంలో రేవంత్ ప్రభుత్వాన్ని రచ్చకు ఈడ్చడాన్ని చూసాము. చివరకు పొంగులేటి కంపెనీ పట్టుబట్టి ఆ టెండర్లను దక్కించుకున్నది. మద్య హోలోగ్రామ్ టెండర్లలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ మధ్య వివాదాలు చెలరేగాయి. అగ్రనటులు నటించిన సినిమాల ప్రివ్యూ షోలకు రేట్ల పెంపులో మంత్రి కోమటిరెడ్డి, సీఎం రేవంత్ మధ్య పంచాయితీ తాజాగా నడిచింది. కొద్దీ రోజుల ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు ఓ ప్రముఖ నాయకుడి ప్రమేయంతోనే ఆయనకు సన్నిహితంగా ఉండే టీవీ ఛానల్ లో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను కించపరుస్తూ వార్తాకథనాన్ని ప్రసారం చేస్తూ పెద్ద కలకలం సృష్టించారు. ఈ విషయమై మొదటిసారిగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎంఎఫ్ అధికారుల సంఘాలు మూకుమ్మడిగా ఆందోళన వ్యక్తం చేయడం, తగు చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో ప్రభుత్వం దిక్కుతోచక ఆత్మరక్షణలో పడింది. దానితో అర్ధరాత్రి ముగ్గురు జర్నలిస్టులను అర్ధాంతరంగా అరెస్ట్ చేయడం ద్వారా నష్టనివారణ చర్యలు చేపట్టే ప్రయత్నం చేయగా, వారిని రిమాండ్ కు పంపేందుకు మెజిస్ట్రేట్ నిరాకరించడంతో దిమ్మతిరిగినట్లయింది. అసలు ఆ ఛానల్ యజమానిని కనీసం ప్రశ్నించే సాహసం చేయకుండా, జర్నలిస్టులకు నోటీసులు కూడా ఇవ్వకుండా, ఎటువంటి విచారణ జరపకుండా అర్ధరాత్రి అరెస్టులు చేయడం అధికార అహంకారాన్ని మాత్రమే వెల్లడిస్తుంది.

పరిపాలన గాడి తప్పినప్పుడు అహంకారంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించే తీరు ఆ పార్టీని గతంలో ఎటువంటి దుస్థితికి నెట్టివేసిందో మరచిపోతున్నట్లున్నారు. రాజీవ్ గాంధీ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారని, ఆ అవమానంతోనే టీడీపీ ఆవిర్భవించి, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులను కదిలించడాన్ని గుర్తుంచుకోవడం లేదు. ఏది ఏమైనా మొత్తం సింగరేణి టెండర్ల వ్యవహారంలో రేవంత్ రెడ్డి, పొంగులేటి ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణులతో భట్టి విక్రమార్కని బలి చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకే రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో హైదరాబాద్ మీడియా సమావేశంలో ఈ టెండర్ వివాదం గురించి భట్టి కఠినంగా మాట్లాడారు. పరోక్షంగా వాస్తవాలు బయటపెడతాను అంటూ ముఖ్యమంత్రికే హెచ్చరికే హెచ్చరికలు పంపారు. గతంలో ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టి, చివరకు ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న లొసుగులను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి చేరవేస్తున్నారనే ఆగ్రహంతో తనను రాజకీయంగా అణగదొక్కేందుకు ఈ టెండర్ల వివాదాన్ని తెరపైకి స్వయంగా ముఖ్యమంత్రి తీసుకొచ్చారని ఆగ్రహంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

సింగరేణికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఫైల్‌లోని కొన్ని పత్రాల ప్రతులు ఓ మంత్రి ద్వారా మీడియా హౌస్‌కు చేరడంతోనే ఈ కథనం ప్రచురితమైందన్న ఆధారాలు సేకరించినట్లు చెప్పుకుంటున్నారు. తన అసంతృప్తిని నేరుగా ముఖ్యమంత్రి ముందే మేడారంలో భట్టి విక్రమార్క వ్యక్తం చేశారని తెలుస్తోంది. తామంతా ఈ పార్టీని నమ్ముకొని బతికాం, తరతరాలుగా పార్టీకి సేవలు చేస్తున్నాం, అలాంటి తమను పనికిరానివాళ్లుగా, పరాయివాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మీడియాకు లీకులు ఇస్తూ కథనాలు రాయించడం, దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని ఓ విధంగా హెచ్చరించారని, దానితో ఖంగుతిన్న ముఖ్యమంత్రి మేడారం పర్యటన తర్వాత తాను దావోస్‌ వెళ్తున్నానని, వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ సింగరేణి టెండర్ల వివాదం తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికే కలకలం సృష్టిస్తున్న పంచాయతీలు మరింత తీవ్రమయ్యేందుకు దారితీసినట్లు స్పష్టం అవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ దర్యాప్తు పరిశీలిస్తాం

”ఎన్ని రకాలుగా విధ్వంసం చేయవచ్చో బీఆర్ఎస్ అన్ని రకాలుగా సింగరేణిలో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది. తమ అవినీతి అక్రమాలకు సింగరేణిని బంగారు బాతుగా వాడుకుంటున్నాయి. సింగరేణి కార్మికుల చెమట కష్టాన్ని దోచుకుంటున్నాయి. ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణిని ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రూ.684 కోట్ల అప్పుపై మారిటోరియం విధించి సింగరేణిని కాపాడారు. తద్వారా సింగరేణి లాభాల బాటలో పడింది. కానీ 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చింది. అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారిపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో కొనసాగుతోంది.

బొగ్గు వెలికి తీయడం, బొగ్గు రవాణాకు సంబంధించి.. టెండర్లో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధనను సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేర్చింది. అనేక చోట్ల సైట్ విజిట్ చేయాలనే నిబంధన ఉంది. కానీ అది సెల్ఫ్ డిక్లరేషన్. బ్లాక్‌కు సంబంధించి సరైన వివరాలు తెలియకుండా టెండర్‌కు వస్తే ఇబ్బందులుంటాయని అవగాహన కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చాం. సైట్ విజిట్ చేసిన తర్వాతే సదరు కాంట్రాక్టర్‌కు మినరల్ నిల్వలపై, అక్కడి భౌగోళిక స్థితిపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుందనేది ఆ నిబంధనకు అర్థం. కానీ సింగరేణి ప్రభుత్వం దీన్ని తప్పనిసరి నిబంధనగా మార్చి అవినీతికి బాటలు వేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా చోట్ల టెండర్ల ప్రక్రియలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. పారదర్శకంగా పనిచేస్తున్నాం. కానీ సింగరేణిలో ‘సైట్ విజిట్’ నిబంధనను తప్పనిసరి చేసి బొగ్గు వెలికితీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. 

సింగరేణిలో జీ11 గ్రేడ్ బొగ్గం అమ్మకం ధర టన్నుకు రూ.4,088. ఇదే కోలిండియాలో జీ11 గ్రేడ్ బొగ్గు ధర రూ.1,605. దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నాయి కాబట్టే సంస్థను నడిపేందుకు ధరలను పెంచడం తప్ప వారికి వేరే ప్రత్యామ్నాయం లేదు. సింగరేణి బొగ్గు కొంటున్న జెన్కో కూడా ప్రభుత్వ సంస్థనే కాబట్టి సంస్థ ధరలు పెంచుకుంటూ పోతోంది. సింగరేణి బొగ్గు నాణ్యత58 శాతం ఉండగా, కోలిండియాలో బొగ్గు నాణ్యత 86 శాతం. సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి నాణ్యత విషయంలో, ధర విషయంలో తప్పటడుగులు వేస్తోంది. అందుకే ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సింగరేణి బొగ్గు వద్దని అంటున్నాయి. అవినీతి, అక్రమాల కారణంగా సింగరేణి భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి నెలకొంది. సింగరేణి భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. అనేక పత్రికలు, చానళ్లలో సింగరేణి అక్రమాలపై చాలా కథనాలు వచ్చాయి. దీనిపైనా, కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు లేవనెత్తిన అంశాలపైనా బోర్డు సమావేశాల్లో చర్చించడం లేదు. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం దీన్ని పరిశీలిస్తుంది.”

-జి. కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

ప్రవీణ్