Bhubharathi

భూభారతి పనితీరుపై సందేహాలు

భూ క్రయవిక్రయాలతో పాటు భూముల వివరాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన వ్యవస్థ భూభారతి పనితీరు పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భూసమస్యలు ఉండబోవని, అవకతవకలకు అవకాశమే ఉండదని ప్రభుత్వ గొప్పలు చెప్పగా, జనగామలో మీసేవ నిర్వాహకుడు వెబ్ సైట్ హ్యాక్‌ చేయడమే కాకుండా, కోట్ల రూపాయల సర్కార్‌ సొమ్మును కాజేశాడని వెల్లడవడంతో భూభారతి సామర్థ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ వల్ల రైతుల భూములు అన్యాక్రాంతమయ్యాయని, భూ దస్తావేజులను తలకిందులు చేశారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, అందులో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయిన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ కమిటీ నివేదిక ఏమయిందో గాని ఎక్కడా భూముల నమోదులో అక్రమాలను సరిచేసిన సూచనలు కనిపించడం లేదు. పైగా, గత ప్రభుత్వంలో రికార్డులను తారుమారు చేసి ధరణి పోర్టల్ ద్వారా పెద్దఎత్తున భూముల అన్యాక్రాంతానికి పాల్పడిన వారితో ప్రభుత్వంలోని పెద్దలు లాలూచీపడి, బేరసారాలు కుదుర్చుకొని, వారందరికీ భూభారతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. భూముల రక్షణకు అసలుసిసలైన భద్రతతో కూడిన వ్యవస్థ అంటూ కొత్తగా భూభారతి తీసుకొస్తే దాని పనితీరు మరింత ఆందోళన కలిగిస్తున్నది.

భూభారతిని 2024 ఏప్రిల్‌ 14న హడావిడిగా అమల్లోకి తెచ్చారు. ధరణి లోపాలను సరిదిద్దుతామని చెప్పిన కాంగ్రెస్‌ సర్కార్‌ భూభారతితో సమస్యలను రెట్టింపు చేసింది. పోర్టల్‌లో రంగులతో రేవంత్‌ తదితరుల ఫొటోలు నింపారే తప్ప రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపించలేదనే విమర్శలున్నాయి. 33 మాడ్యూల్స్‌ను 6కు కుదించారే గానీ కొత్త అంశాలేమి చేర్చలేదు. భూభారతి పోర్టల్‌తో ఉపయోగం ఏంటి అంటే సమాధానం చెప్పలేని దుస్థితి. భూభారతి పోర్టల్‌ ఆవిష్కరణ సందర్భంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఈ పోర్టల్‌ తాత్కాలికమే. మరింత పకడ్బందీ పోర్టల్‌ను త్వరలోనే తీసుకొస్తాం..’ అని ప్రకటించారంటే, ఆవిష్కరణ సమయంలోనే ఇందులో లోపాలున్న విషయం తెలిసిందని స్పస్టమవుతోంది. అయినా, ఉదాసీనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన అవకతవకలు పోర్టల్‌లో నిక్షిప్తమైన భూముల భద్రత పట్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్‌కు చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ మెజారిటీ మొత్తాన్ని వారి ఖాతాలోకి మళ్లించారు. జనగామలో ఒక్క రోజులోనే రూ.85 లక్షలు కాజేయడంతో తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ దందా రాష్ట్రమంతా జరిగినట్టు రెవెన్యూ అధికారులు, పోలీసుల విచారణలో తేలింది. 

తమ భూములు ఉన్నాయో, ఇతరుల పేర్లపైకి మారాయో అంటూ రైతులు భయానికి గురవుతున్నారు. భూముల వివరాల కోసం మీసేవ సెంటర్లకు క్యూ కడుతున్నారు. కాగా, ఈ ఘటన కేవలం డబ్బు మళ్లింపు వరకే ఆగిందా, అంతకు మించి ఇంకేమైనా జరిగిందా? అనే ఆందోళనల్లో రెవెన్యూ అధికారులు ఉన్నారు. మొదటి నుండి ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం, పాలనా యంత్రాంగంపై సరైన విధంగా దృష్టి కేంద్రీకరించకపోవడం, ప్రభుత్వమే ఓ పెద్ద స్థిరాస్తి వ్యాపార సంస్థగా వ్యవహరిస్తూ ఉండడంతో భూముల భద్రతపై సహజంగానే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. భూభారతి పోర్టల్‌ రూపొందించే, నిర్వహించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(NIC)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇంత పెద్ద వ్యవస్థను నిర్వహించే సామర్థ్యం నిపుణుల కొరతతో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్న ఎన్‌ఐసీకి ఉన్నదా? అన్న అనుమానాలు రెవెన్యూ యంత్రాంగం నాడే వ్యక్తం చేసింది. లక్షలాది రైతులకు సంబంధించిన, కోట్లాది ఎకరాల వివరాలు ఒకేచోట పొందుపరుస్తున్నప్పుడు ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా, ప్రస్తుత డిజిటల్‌, సాంకేతికయుగంలో డిజిటల్ భద్రత ఓ పెను సవాల్ గా మారుతుంది. అందుకే పోర్టల్‌లోని వివరాలు బయటకు పొక్కకుండా సురక్షితమైన సాంకేతికత వినియోగించాలి. అందుకు అవసరమైన కట్టుదిట్టమైన పాలనా వ్యవస్థను రూపొందించాలి. అయితే, ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

కృష్ణ చైతన్య