ఉజ్వల భవితకు బలమైన పునాది
బడ్జెట్ చరిత్రాత్మకమైందనీ, దేశ మహిళల సాధికార భావనకు ఇది అద్దం పడుతోందనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ బడ్జెట్ భారత వర్తమాన కలల్ని నెరవేర్చడంతో పాటు, ఉజ్వల భవితకు బలమైన పునాదిని వేస్తుందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్‌కు ఈ బడ్జెట్ రెక్కలు తొడుగుతుందని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ తో భారత సంస్కరణల ఎక్స్‌ప్రెస్ ఒక కొత్త శక్తిని, కొత్త జోరును అందుకొంటుందని మోదీ వెల్లడించారు. విశ్వసనీయ పాలన, దేశ పౌరుల ప్రయోజనాలకు ప్రాముఖ్యత దృష్టి కోణాలను బడ్జెట్ ఆవిష్కృతం చేసిందని చెప్పారు. ద్రవ్యలోటును తగ్గించడం, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, అదే సమయంలో అధిక మూలధన వ్యయానికీ, అధిక అభివృద్ధికీ పూచీని ఇవ్వడం.. అద్వితీయమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. భారత్ ప్రపంచంలో పోషించాల్సిన సరికొత్త పాత్రకు ఈ బడ్జెట్ దన్నుగా నిలుస్తుందని అన్నారు. విశ్వసనీయ ప్రజాస్వామ్య భాగస్వామిగానూ, మంచి నాణ్యత కల వస్తుసేవల సరఫరాదారుగానూ భారత్ భూమిక అంతకంతకూ విస్తరిస్తోందని వెల్లడించారు. దేశ యువతకూ, చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థలకూ గరిష్ట ప్రయోజనాలను అందించాలన్న లక్ష్యంతోనే భారత్ ఇటీవల ప్రధాన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని వివరించారు.
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమాలకు మరింత జోరును అందించడానికి బడ్జెట్ రాజమార్గాన్ని పరిచిందని స్పష్టం చేశారు. చిన్న, కుటీర పరిశ్రమలు సహా ఎమ్ఎస్ఎమఈలకు అందిస్తున్న మద్దతుతో ఆయా సంస్థలు స్థానిక అవసరాలను తీర్చడమే కాక ప్రపంచ దేశాలతో పోటీ పడగల సామర్థ్యాన్ని సమకూరుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. సరుకుల రవాణాకే కేటాయించిన కారిడార్, దేశవ్యాప్తంగా జలమార్గాల విస్తరణ, హై-స్పీడ్ రైల్ కారిడార్, 2వ అంచె 3వ అంచె నగరాలకు బలమైన ఆర్థిక పునాదిని వేసే దృష్టితో మున్సిపల్ బాండ్లను ప్రోత్సహించడం వంటి చర్యలన్నీ వికసిత్ భారత్ దిశగా పయనాన్ని వేగవంతం చేసేవేనని ఆయన ఉద్ఘాటించారు.
వైద్య కూడళ్లు, ఆరోగ్య రంగ సంబంధిత వృత్తినిపుణులకు తోడ్పాటు, సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం, గేమింగ్, పర్యటన రంగాలతో పాటు ఖేలో ఇండియాకు దన్నుగా నిలవడం.. ఇవన్నీ యువతీయువకులకు కొత్త కొత్త అవకాశాల్ని అందిస్తాయని తెలిపారు. భారత్‌ను ప్రపంచానికి డేటా సెంటర్ కూడలిగా నిలబెట్టడానికి ఒక ప్రధానమైన పన్ను రాయితీని ప్రకటించిన సంగతిని ప్రధాని ప్రస్తావించారు. యువతకు విశేష అభినందనల్ని అందజేస్తూ, ఉపాధి కల్పనకు ఈ బడ్జెట్ గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. పర్యటన రంగాన్ని.. ముఖ్యంగా దేశ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటన అవకాశాల్ని ప్రోత్సహించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకున్నారనీ, వివిధ రాష్ట్రాలకు సాధికారతను కల్పిస్తూ సమతౌల్య అభివృద్ధి సాధన యత్నాలను బలపరుస్తుండడం హర్షణీయమనీ ప్రధానమంత్రి అన్నారు. ప్రతి జిల్లాలోనూ బాలికల కోసం కొత్త హాస్టళ్లను నిర్మించడం.. విద్యను మరింత మందికి అందుబాటులోకి తీసుకు వస్తుందని ఆయన వెల్లడించారు.
కొబ్బరి, జీడిపప్పు, కోకో, చందనం సాగు రైతుల కోసం ఈ బడ్జెట్ లో కీలక చర్యలు తీసుకున్నారని తెలిపారు. మత్స్య రంగంలోనూ, పశు సంవర్ధక రంగంలోనూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండదండలను అందించడం వల్ల గ్రామాల్లో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ బడ్జెట్ అభివృద్ధి కోసం తపిస్తున్న బడ్జెట్ అని, ఇది దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుందని నరేంద్ర మోదీ అన్నారు.
అంత్యోదయ నుంచి అభ్యుదయానికి
”బడ్జెట్ ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని వాస్తవంగా మార్చే దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. హైదరాబాద్‌కు హైస్పీడ్ రైల్ కారిడార్లతో రాష్ట్రం జాతీయ వృద్ధి యంత్రంగా మరింత బలపడనుంది. ఆర్థిక బలం నుంచి జాతీయ సామర్థ్యానికి, అంత్యోదయ నుంచి అభ్యుదయానికి దేశాన్ని నడిపించే స్వర్ణయాత్రకు ఈ బడ్జెట్ పునాది వేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ దృష్టితో రూపొందిన ఈ బడ్జెట్ దేశీయ తయారీ రంగానికి ఊతమిస్తుంది, ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. ఉపాధి సృష్టి, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, కొనుగోలు శక్తి వృద్ధి, నాణ్యమైన విద్యా–వైద్య సేవల విస్తరణకు ఈ బడ్జెట్ బలమైన పునాదిని వేస్తుంది. పేదల సంక్షేమం, రైతుల సౌభాగ్యం, మహిళల సాధికారత, యువత ఆశయాలకు అంకితమైన ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు.”
-ఎన్. రాంచందర్ రావు, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు
‘హబ్ ఆఫ్ హబ్స్’గా హైదరాబాద్
”ఉచితాలు, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బడ్జెట్ ప్రవేశ పెడతారనే ఆలోచనకు భిన్నంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టాం. దేశంలో సుస్థిరమైన అభివృద్ధి కావాలనే ఆకాంక్షకు రెక్కలు తొడిగే బడ్జెట్ ఇది. ఐటీ హబ్… ఎడ్యుకేషనల్ హబ్.. డిజిటల్ హబ్…. హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్.. సెమీ కండక్టర్ హబ్… డేటా సెంటర్ హబ్… మెడికల్ హబ్.. ఇలా హైదరాబాద్.. ‘హబ్ ఆఫ్ హబ్స్’గా అవతరించింది. రూ.10వేల కోట్లతో ప్రకటించిన బయోఫార్మా SHAKTI (స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్‌మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్) కార్యక్రమం ద్వారా ఫార్మా రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరానికి చాలా మేలు జరగనుంది. NIPER-హైదరాబాద్‌ను మరింతగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. క్లినికల్ ట్రయల్స్ రంగంలో కూడా NIPER ద్వారా పరిశోధనలు పెరుగుతాయి.”
-జి. కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి
అన్ని వర్గాలకు అభివృద్ధి
”2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధానమంత్రి కలను సాకారం చేసే దిశగా ఈ బడ్జెట్ ఒక కీలక అడుగు. ఇది యువతకు ప్రాధాన్యతనిస్తూ, తయారీ రంగం ద్వారా కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. సెమీకండక్టర్ రంగానికి రూ.400 కోట్లు, బయో-ఫార్మా రంగానికి రూ.10,000 కోట్లు కేటాయించడం కొత్త ఉపాధి మార్గాలకు దోహదం చేస్తుంది. చేనేత కార్మికులు, కుటీర పరిశ్రమలకు మద్దతు మహాత్మా గాంధీ ‘గ్రామ స్వరాజ్’ కలను ప్రతిబింబిస్తోంది. దేశంలో 20 కొత్త జలమార్గాలను నిర్మించడం ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు బీజం పడుతుంది. రక్షణ రంగానికి రూ.7.8 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా దేశ భద్రత విషయంలో రాజీ లేదనే స్పష్టమైన సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ బడ్జెట్ యువత, మహిళలు, మధ్యతరగతి, రైతులు ఇలా సమాజంలోని ప్రతి వర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుంది.”
-నితిన్ నబీన్, బిజెపి జాతీయ అధ్యక్షుడు

