India EU

బంగారు భవిష్యత్తుకు బాట

భారత్, యూరోపియన్ యూనియన్ (EU) ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక దౌత్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది, భారత్‌లోని యువతకు, రైతులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగింట ఒక వంతు వాటా కలిగిన దాదాపు 200 కోట్ల మంది ప్రజల సంపద సృష్టికి దోహదపడుతుంది. ప్రపంచంలోని రెండవ, నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగిన ఈ ఒప్పందం, ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలలో ఒకటి. నిజానికి ఇది కేవలం వాణిజ్యానికే పరిమితం కాలేదు. కృత్రిమ మేధ (AI), రక్షణ, సెమీకండక్టర్ల వంటి కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించే సమగ్ర భాగస్వామ్యానికి ఇది ప్రతీక. ఈ FTA వల్ల భారతదేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి పౌరుడు ప్రయోజనం పొందుతారు.

ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడులు

ఈ ఒప్పందం నిబంధనల ఆధారిత వాణిజ్యానికి, ఆర్థిక విధానాలలో స్థిరత్వానికి హామీ ఇస్తుంది. దీనివల్ల దేశీయ, విదేశీ పెట్టుబడులకు భారతదేశం మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతుంది. ఇది చిన్న వ్యాపారాలకు, స్టార్టప్‌లకు, కార్మికులకు అనేక అవకాశాలను సృష్టిస్తుంది. భారత్, EU ల స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ‘అన్ని ఒప్పందాలకు తల్లి’ గా అభివర్ణిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ప్రపంచం హర్షించింది. ప్రపంచ వాణిజ్యం, సరఫరా గొలుసులలో అనిశ్చితి నెలకొన్న సమయంలో ఈ ఒప్పందం ఒక కొత్త ఆశను చిగురింపజేస్తోంది. భారత్, ఈయూలు ఒకరికొకరు నమ్మకమైన భాగస్వాములుగా, పారదర్శకమైన మార్కెట్లు, సమగ్ర వృద్ధికి కట్టుబడి ఉన్నాయని ఇది నిరూపిస్తోంది.

‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతం

భారతదేశం తన ఎగుమతులలో 99 శాతానికి పైగా ఈయూ మార్కెట్‌లో ఇంతకుముందెన్నడూ లేని ప్రవేశాన్ని పొందింది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి గొప్ప బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా జౌళి, దుస్తులు, తోలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్స్ వంటి కార్మికులు ఎక్కువగా ఉండే రంగాలకు ఈ ఒప్పందం గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. దాదాపు 33 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై 10 శాతం వరకు ఉన్న సుంకాలను ఈ ఒప్పందం తొలగిస్తుంది. అలాగే కార్మికులు, కళాకారులు, మహిళలు, యువత, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రలకు (MSME) సాధికారత కల్పిస్తూ భారతీయ వ్యాపారాలను ప్రపంచ విలువ గొలుసులో మరింత లోతుగా అనుసంధానిస్తుంది. రెండు ప్రాంతాల మధ్య వ్యాపారవేత్తలు, నిపుణుల రాకపోకలను ఈ ఒప్పందం సులభతరం చేస్తుంది. విద్య, ఐటీ, ఆర్థిక సేవలు, కంప్యూటర్ల వంటి సేవా రంగాలలో కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ఈ చర్యలు అధిక వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, ప్రతిభకు, ఆవిష్కరణలకు, స్థిరమైన ఆర్థిక వృద్ధికి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మారుస్తాయి.

దూరదృష్టితో కూడిన వ్యూహం

ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల జీవితాలను మెరుగుపరిచేందుకు అనుసరిస్తున్న విస్తృత వ్యూహంలో వాణిజ్య ఒప్పందాలు ఒక భాగం. ముందుగా సంస్కరణలు, సమర్థమైన ఆర్థిక నిర్వహణ ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఆపై అభివృద్ధి చెందిన దేశాలతో పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలను చేసుకోవడం ఈ వ్యూహం ఉద్దేశం. వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి సున్నితమైన రంగాలను రక్షిస్తూనే ఇతర రంగాలలో కొత్త మార్కెట్లలో ప్రవేశాన్ని పెంచుకోవడానికి ఇది భారత్‌కు సహాయపడుతుంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాల మాదిరిగా కాకుండా మోదీ ప్రభుత్వం సుంకాల తగ్గింపును క్రమంగా అమలు చేస్తోంది. దీనివల్ల భారతీయ పరిశ్రమలు తమ నాణ్యతను, పోటీతత్వాన్ని మెరుగుపరుచుకొని విదేశీ ఉత్పత్తుల పోటీని తట్టుకోడానికి తగిన సమయం దొరుకుతుంది.

లక్ష్యం వికసిత్ భారత్ 2047 

తక్కువ ధరలకే అధిక నాణ్యత గల ఉత్పత్తులను సరఫరా చేయడం ప్రధాని ‘వికసిత్ భారత్ 2047’ దార్శనికతలో ప్రధానాంశం. “ఈ ఏడాది నాణ్యతకు మనం ప్రాధాన్యం ఇద్దాం. నాణ్యతే మన మంత్రం కావాలి,” అని ప్రధాని ఇటీవల పిలుపునిచ్చారు. భారత్-ఈయూ FTA ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉంది. ఇది భారత్‌ను ప్రపంచ వేదికపై ఒక శక్తిమంతమైన, నమ్మకమైన, భవిష్యత్తు వైపు చూసే భాగస్వామిగా నిలబెడుతుంది. గత ప్రభుత్వాలు వాణిజ్య ఒప్పందాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, దేశ ప్రయోజనాలను పణంగా పెట్టగా, మోదీ ప్రభుత్వం సంబంధిత పక్షాలతో సంప్రదింపులు జరిపి, దేశ ప్రయోజనాలను కాపాడుతూ ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చివరగా, భారత్-ఈయూ FTA కేవలం మార్కెట్ల విస్తరణ మాత్రమే కాదు, ఇది బలమైన నాయకత్వం, స్పష్టమైన వ్యూహంతో దేశాన్ని సంక్షేమ పథంలో నడిపించే ఒక గొప్ప ప్రయాణం.

పీయూష్ గోయల్,
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి