విలువలకు తిలోదకాలిస్తున్న నాయకులు వాజ్‌పేయిని స్ఫూర్తిగా తీసుకోవాలి
తెలంగాణ రాజకీయాల్లో కొందరు నాయకులు విలువలకు తిలోదకాలిస్తూ వాడుతున్న భాషకు హద్దూ అదుపూ లేకుండా పోయిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష నాయకులు ఉపయోగిస్తున్న దిగజారుడు భాష తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉందన్నారు. ఫిరాయింపుదారులు రాజకీయ విలువలను తుంగలో తొక్కుతున్నారని వాపోయారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని స్ఫూర్తిగా తీసుకొని విలువలతో కూడిన మార్గంలో ముందుకు సాగాలని హితువు పలికారు. డిసెంబర్ 25న భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా తెలంగాణలోనూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బిజెపి శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితర నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి, పార్టీకి అటల్ జీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ముందురోజు డిసెంబర్ 24న నిర్వహించిన దీపోత్సవంలో భాగంగా రాష్ట్ర కార్యాలయంలో, కూడళ్లలోని వాజ్‌పేయి విగ్రహాల వద్ద దీపాలు వెలిగించారు. 2024 డిసెంబర్ 25 నుంచి 2025 డిసెంబర్ 25 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, బిజెపి, అనేక సామాజిక సంస్థల ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”పాలనలో అటల్ బిహారీ వాజ్‌పేయి తీసుకువచ్చిన గొప్ప మార్పులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. మొబైల్ ఫోన్ విప్లవం నుంచి ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు అందే దాకా, స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అటల్ జీ పాలన బాటలు వేసింది. విలువలతో కూడిన రాజకీయాలకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రతీక. వాజ్‌పేయి పార్లమెంటులో గానీ, బయట గానీ ఎప్పుడూ నోరు జారి మాట్లాడలేదు. ఎవరినీ అవమానించలేదు. సిద్ధాంతపరమైన విమర్శలతోనే రాజకీయాలను నడిపిన గొప్ప నాయకుడు. అందుకే అటల్ బిహారీ వాజ్‌పేయి నేటి యువతకు స్ఫూర్తిగా, ప్రేరణగా నిలుస్తున్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన జీవితం ఒక పాఠం. కవిగా, సమర్థుడైన పరిపాలకుడిగా, గొప్ప రాజకీయ నాయకుడిగా అటల్ జీ ఆదర్శప్రాయం.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన భాష మాదిరిగానే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతీకార భావంతో మాట్లాడటం బాధాకరం. బూతులు, దిగజారుడు రాజకీయాలు, అర్థంపర్థం లేని విమర్శలు తెలంగాణకు ఏమాత్రం మేలు చేయవు. ప్రస్తుత కాలంలో రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ఖజానాను ఖాళీ చేశాయి. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భిక్షాందేహి అనే మాదిరిగా అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితికి తీసుకువెళ్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో గొప్ప ప్రచారాలు చేయడం తప్ప, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ‘తెలంగాణ రైజింగ్’ అని ప్రచారం చేస్తున్నప్పటికీ, రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు, కంపెనీలు ఎక్కడున్నాయో కనిపించడం లేదు. ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ మంత్రులు పెట్టుబడులు తెస్తామని దావోస్‌కు వెళ్లినా, వాస్తవంగా ఒక్క పెద్ద కంపెనీ గాని, పెట్టుబడులు గాని ఏమీ తీసుకురాలేకపోయారు.
రైతులకు ఎరువులపై సబ్సిడీతో పాటు అనేక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమలవుతున్నాయి. పేదలకు ప్రతి ఒక్కరికీ నెల నెలా 5 కిలోల ఉచిత బియ్యం అందిస్తున్నది కూడా మోదీ ప్రభుత్వమే. అదేవిధంగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి, ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి పాలనను స్ఫూర్తిగా తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, పరిశ్రమలు, ఏరోస్పేస్ సహా అనేక రంగాల్లో భారత్ అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతోంది.” అని అన్నారు.
దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ”అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యక్తిత్వం రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. ఆయన గొప్ప మేధావి, కవి, సమర్థుడైన పరిపాలనదక్షుడు. ఐక్యరాజ్యసమితిలో మొదటిసారిగా హిందీలో ప్రసంగించిన గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ కుట్రల కారణంగా కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కోల్పోయినప్పటికీ, నైతిక విలువలకు కట్టుబడి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించి, అధికారాన్ని వదులుకున్న గొప్ప నాయకత్వం అటల్ జీదే. భారతదేశాన్ని అణుశక్తి సామర్థ్యం కలిగిన దేశంగా తీర్చిదిద్దిన మహానుభావుడు. అమెరికా వంటి అగ్రదేశాలు అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడ్డప్పటికీ, వాటికి భయపడకుండా దేశ భద్రత, దేశ గౌరవం కోసం అణు పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అంతకుముందు అనేక ప్రధానమంత్రులు చేసిన ప్రయత్నాలను అగ్రదేశాలు అడ్డుకున్నప్పటికీ, వాజ్‌పేయి ఆ బెదిరింపులను లెక్కచేయకుండా భారతదేశాన్ని అణుశక్తి సామర్థ్య దేశంగా నిలబెట్టారు. స్వర్ణచతుర్భుజి పథకం ద్వారా దేశవ్యాప్తంగా అద్భుతమైన జాతీయ రహదారులను నిర్మించారు. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేని గ్రామాలకు రహదారి కనెక్టివిటీ కల్పించారు. సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచారు. పేదల కోసం అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే హౌసింగ్ స్కీమ్)ను తీసుకువచ్చి కోట్లాది మందికి సొంత ఇళ్లు కల్పించారు. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్‌కు స్నేహహస్తం అందిస్తూ దిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణం చేశారు. పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిన సందర్భంలో భారత సైన్యానికి స్ఫూర్తినిచ్చి, యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించి దేశ భద్రతను కాపాడారు. వాజ్‌పేయి జీవితం దేశానికి అంకితం. గొప్ప మేధావిగా, కవిగా ఆయన రచించిన కవిత్వాలు సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై ప్రజలను చైతన్యపరిచేలా ఉన్నాయి.” అని అన్నారు.
దిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో వాజ్‌పేయి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలు, సమాచారంతో రూపొందించిన ఎగ్జిబిషన్ ను బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ప్రారంభించారు. హైదరాబాద్ లో ఖైరతాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా)లోనూ వాజ్‌పేయి జీవితంపై ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.

