పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి
చుట్టూ ఎత్తైన కొండలు.. మధ్యలో పచ్చని బయళ్లు.. కనువిందు చేసే పచ్చని చెట్లు.. ఆహ్లాదకర వాతావరణం.. మినీ స్విట్జర్లాండ్‌గా ప్రసిద్ధి చెందిన జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ.. 2025 ఏప్రిల్ 22.. సమయం మధ్యాహ్నం 3 గంటలు.. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో.. శాంతి కుసుమాలు విరబూస్తున్న తరుణంలో.. ప్రగతి పవనాలు వీస్తున్న వేళ.. అక్కడ సేద తీరుతున్న పర్యాటకులు.. కేరింతలతో ఆనందంగా గడుపుతున్న సమయం.. ఎక్కడి నుంచి వచ్చారో ఏమో కానీ.. అక్కడికి నరరూప రాక్షసులైన ఇస్లామిక్ టెర్రరిస్టులు వచ్చారు.. ప్రాణాంతక రైఫిల్లు చేతబట్టుకొని భయబ్రాంతులకు గురిచేశారు.. భారత సైనికుల దుస్తుల్లో వచ్చిన సాయుధ ముష్కరులు కాల్పులతో బెంబేలెత్తించారు.. అనుకోని ఉపద్రవంతో బైసరన్ లోయలో ఒక్కసారిగా కలకలం.. అప్పటిదాకా ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరిన పర్యాటకుల్లో కలవరం.. ప్రాణాలరచేత పట్టుకొని టైంటుల్లో, డొంకల్లో, చేమల్లోకి పరుగులు పెట్టారు.. పర్యాటకులను చుట్టుముట్టిన ముష్కరులు.. ఒక్కొక్కరి పేర్లను అడిగి తలపై కాల్చి చంపారు…
హరియాణాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నౌకాదళంలో చేరాడు. కేరళలోని కోచిలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 16న వివాహమవగా.. 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకొని కశ్మీర్‌కు హనీమూన్‌కు వెళ్లారు. పహల్గాంలో ఉగ్ర దాడిలో కొత్త పెళ్లికొడుకును ఉగ్రవాదాలు పొట్టన బెట్టుకున్నారు. ఆయన మృతదేహం పక్కన భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శుభమ్ ద్వివేదికి ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహమైంది. వృత్తిరీత్యా బిజీగా ఉన్న ఆయన.. ఇటీవలే భార్యను తీసుకొని కశ్మీర్ వెకేషన్‌కు వెళ్లారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిండునూరేళ్లు కలిసి ఉండాలని వారు చేసుకున్న బాసలు.. కాళ్ల పారణి ఆరకముందే చెరిగిపోయాయి.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిటైన్ అధికారి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. టీసీఎస్‌లో పనిచేస్తున్న ఆయన ఏప్రిల్ 8న భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి స్వదేశానికి వచ్చారు. వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్లగా.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాకు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్ సత్పతీ, సూరత్‌కు చెందిన శైలేష్ కడతియా కూడా ఇదేవిధంగా తమ భార్య, పిల్లలతో కలిసి కశ్మీర్‌కు వెకేషన్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేందుకు పూణే నుంచి వచ్చిన ఓ కుటుంబం బిక్కుబిక్కుమంటూనే టెంటులో దాక్కుంది. అయినా అక్కడకు ఉగ్రవాదులు వచ్చి.. ఓ వ్యక్తిని బయటకు పిలిచారు. ఇస్లామిక్ ధర్మోక్తిని చదవమని బెదిరించారు. 54 ఏళ్ల ఆ పెద్దమనిషి అందుకు తిరస్కరించారు. కోపం పట్టలేక పచ్చి నెత్తురు తాగే ఆ ఉగ్రవాదులు కట్టుకున్న భార్య, కన్న కూతురు ముందే కాల్పులు జరిపారు. తొలుత తలలో, ఆ తరువాత చెవిలో, అనంతరం వెనుకవైపు.. మొత్తం మూడు సార్లు కాల్చారు. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలారు. అక్కడ చనిపోయిన వ్యక్తి సంతోష్ జగ్దా. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి వైపు తిరిగారు. ఆయనపైనా మూడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన బీహార్ వాసి మనీష్ రంజన్ కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మనీశ్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, ఇద్దరు పిల్లల ముందే ఉగ్రవాదులు ఆయన్ని కాల్చి చంపారు. ఇలా ఉగ్రవాదులు 26 మంది అన్నెంపున్నెం ఎరుగని పర్యాటకుల ఉసురు తీశారు.
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కశ్మీర్‌లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదానికి మతం లేదు అని అంటారు. కానీ ఈ ఉగ్రవాదులు మతాన్ని లక్ష్యంగా చేసుకునే దాడులు జరిపారు. పేరు, మతం అడిగి, రూఢీ చేసుకునేందుకు ప్యాంటు విప్పించి మరీ కాల్పులు జరిపారు.
ఈ ఘటన సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధంతరంగా తన పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనాస్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన ఏప్రిల్ 22 రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకే
మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తే జమ్ముకాశ్మీర్ భగ్గుమంటుంది, దేశం అల్లకల్లోలం అవుతుందని, దేశవ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగుతాయని, ముస్లింలు బిజెపికి, మోదీకి వ్యతిరేకంగా తిరగబడుతారని కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా కొందరు అర్బన్ నక్సల్స్ ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. యావత్ దేశం ఆర్టికల్ 370 రద్దును స్వాగతించింది. జమ్మూకశ్మీర్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆందోళనలేం జరగలేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు గణనీయంగా తగ్గాయి. 2018లో 228 ఉగ్రఘటనలు చోటుచేసుకుంటే, 2023కు వచ్చేసరికి అవి 46కు పడిపోయాయి. జమ్ము కశ్మీర్ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ.58,477 కోట్లు కేటాయించి అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. పారిశ్రామికంగానూ జమ్మూకశ్మీర్ ఎదగాలని కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పర్యాటకానికీ చేయూతనిస్తోంది. వీటి ఫలితంగానే గత ఏడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు జమ్ముకశ్మీర్ సందర్శించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పరిస్థితులు అనూహ్యంగా మారి, వ్యాపారం వృద్ధి చెంది అభివృద్ధి కనిపిస్తోంది. దాంతో ప్రజల ఆలోచనా ధోరణిలోనూ మార్పు వస్తోంది. అయితే ఉగ్రవాదులకు ప్రశాంతత అంటే గిట్టదు. దీన్ని భగ్నం చేసేందుకే పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మనదేశంలో, ప్రధాని మోదీ మిత్ర దేశమైన సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నప్పుడే ఈ దాడికి పాల్పడ్డారు. తద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చనేది వారి వ్యూహం. అయితే, కశ్మీర్ గతంలో ఇలాంటి గాయాలనెన్నో చూసింది. క్రమంగా కోలుకుంది. ఇప్పుడూ అలానే జరుగుతుంది.
దాడులపై కశ్మీర్‌లో నిరసనలు
పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడితో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో శ్రీనగర్ సహా స్థానికంగా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఉగ్ర చర్యలను ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీనగర్ సహా అనేక చోట్ల బంద్ పాటించారు. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీశారని ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇటీవలి కాలంలో దుకాణాలు మూతపడటం ఇదే తొలిసారి. ఆగస్టు 2019కు ముందు ఇక్కడ ఇటువంటివి సర్వసాధారణం కాగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, గత ఆరేళ్లలో కశ్మీర్‌లో బంద్ పాటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
‘‘ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకూడదు. కశ్మీర్ పేరుతో, ఏదైనా వర్గం పేరుతో ఇలాంటివి మరోసారి జరగకూడదు. అమాయకుల ప్రాణాలు తీయడం అంటే మొత్తం మానవాళినే చంపడంతో సమానం’’ అని హజీ బాషిర్ అహ్మద్ అనే శ్రీనగర్ వాసి పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా ఉగ్రవాద మూలాలను పెకిలివేసేలా చర్యలు చేపట్టాలని స్థానిక పండ్ల వ్యాపారి జీఎం బాండే పేర్కొన్నాడు. కశ్మీరీ ప్రజలు ఉగ్రవాదానికి ఎప్పుడూ వ్యతిరేకమేనన్నాడు. అయితే, కశ్మీరీ సమాజాన్ని కించపరచడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నా తాము మద్దుతు ఇస్తామన్నారు. కశ్మీరీలు ఉగ్రవాదంతో లేరనే సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకే ఈ నిరసనలు చేస్తున్నామని, పర్యటకులపై దాడిని ఖండిస్తున్నామని స్థానిక సామాజిక కార్యకర్త తౌసీఫ్ అహ్మద్ పేర్కొన్నారు. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో విలవిలలాడుతున్నప్పటికీ.. ఉగ్రదాడికి నిరసనగా రాంబన్ జిల్లాలోనూ బంద్ పాటించి శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. ఈ పట్టణ చరిత్రలో తొలిసారిగా హిందూ, ముస్లిం వర్గాలు కలిసి ఉగ్రచర్యకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. సాధారణంగా కశ్మీర్‌లో ఉగ్రవాదులు పిలుపు మేరకో, వారికి అనుకూలంగానో బంద్‌లు నిర్వహిస్తారు.. కానీ 35 ఏళ్ల తర్వాత తొలిసారి ఉగ్రదాడులకు వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్ బంద్ పాటించింది. దుకాణాలు, విద్యాసంస్థలు, వ్యాపారుల, పెట్రోల్ బంకులు.. అన్నీ స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. ఇదీ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు.
ప్రతీకార దాడులు తప్పవు
ఇప్పుడు యావత్ దేశం ప్రతీకారంతో రగిలిపోతుంది. పహల్గాం దాడికి పాల్పడిన వారికి, వారి వెనకున్న సూత్రధారులకు గట్టి బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులకు వారి భాషలోనే దీటు బదులివ్వడంతో పహల్గాం దాడికి ప్రతీకారం కూడా తప్పక ఉంటుందని భావిస్తున్నారు. 2016లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి పట్టణంలో పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు భారత సైనిక శిబిరంపై దాడి చేసి, మొత్తం 19 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్నారు. దీనికి బదులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టి భారత బలగాలు అనేకమంది ఉగ్రవాదులు, పాక్ సైనికులను మట్టుబెట్టారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జైష్-ఎ-మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో నిండి ఉన్న వాహనాన్ని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కాన్వాయ్‌లోని బస్సును ఢీకొట్టాడు. ఈ దాడిలో 40 మంది CRPF సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే పలువురు గాయపడ్డారు. ఈ దాడికి మోదీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించడంతో, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో వందల మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం ఎలా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నవారు.. కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇస్తున్నా. బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉంది. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారు’’ అని ప్రధాని గట్టిగా హెచ్చరించారు.
సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఏప్రిల్ 23న సాయంత్రం దిల్లీలోని లోక్‌నాయక్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో సమావేశమైంది. రెండున్నర గంటలకు పైగా కొనసాగిన భేటీలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీసీఎస్ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొనాల్సి ఉంది. ఉగ్రదాడి ఘటన తెలిసిన వెంటనే తన అమెరికా పర్యటనను అర్థంతరంగా ముగించుకుని ఆమె దిల్లీకి బయలుదేరారు. మార్గమధ్యంలోనే ఉండడంతో భేటీకి హాజరుకాలేకపోయారు. హోంమంత్రి అమిత్ షా పహల్గాం ఘటనను ప్రధాని మోదీకి వివరించారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అంతకుముందు…సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని దిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఆ భేటీలో పాల్గొన్నారు.
సీసీఎస్ నిర్ణయాలు
- సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్‌తో సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత.
- ఇరుదేశల మధ్యనున్న అటారీ సరిహద్దు మూసివేత.
- భారత్, పాకిస్థాన్‌లలోని ఇరుదేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.
- భారత్‌లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తోన్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం. దేశం వీడి వెళ్లేందుకు వారం గడువు విధింపు.
- సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్థాన్ జాతీయులకు అనుమతుల రద్దు. మే ఒకటో తేదీలోగా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశం.
- ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను చట్టం ముందు నిలిపి వారికి అండగా నిలిచిన సూత్రధారులను ఆ నేరానికి బాధ్యత వహించేలా చేయడం.
- పాకిస్థాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన.
మృతుల వివరాలు
- దిలీప్ దెసాలే – ముంబయి, మహారాష్ట్ర
- హేమంత్ జోషి సుహాస్ – ముంబయి, మహారాష్ట్ర
- అతుల్ శ్రీకాంత్ మోని – ఠాణె, మహారాష్ట్ర
- సంజయ్ లక్ష్మణ్ లెలె – ఠాణె, మహారాష్ట్ర
- సంతోష్ జగ్గాలే – పుణె, మహారాష్ట్ర
- కస్టోబే గనోవోటే – పుణె, మహారాష్ట్ర
- బిటైన్ అధికారి – కోల్కతా, పశ్చిమ బెంగాల్
- సమీర్ గుహ – కోల్కతా, పశ్చిమ బెంగాల్
- మనీశ్ రంజన్ (ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్) – బిహార్
- మధుసూదన్ రావు సోమిశెట్టి – బెంగళూరు, కర్ణాటక (ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి వాస్తవ్యుడు)
- భరత్ భూషణ్ – బెంగళూరు, కర్ణాటక
- మంజునాథరావు – శివమొగ్గ, కర్ణాటక
- యతీశ్ పర్మార్ – భావ్ నగర్, గుజరాత్
- సుమిత్ పర్మార్ (యతీశ్ కుమారుడు) – భావ్ నగర్, గుజరాత్
- శైలేష్ భాయ్ కలథియా – సూరత్, గుజరాత్
- వినయ్ నర్వాల్ (నేవీ అధికారి) – కర్నాల్, హరియాణా
- ఎన్.రామచంద్రన్ – కొచ్చిన్, కేరళ
- దినేశ్ అగర్వాల్ – చండీగఢ్
- సయ్యద్ ఆదిల్ హుసేన్ షా – పహల్గాం, జమ్మూకశ్మీర్
- నీరజ్ ఉద్వానీ – యూఏఈ (స్వస్థలం రాజస్థాన్)
- జె.ఎస్.చంద్రమౌళి – విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- సుశీల్ నాథ్యాల్ – ఇందౌర్, మధ్యప్రదేశ్
- ప్రశాంత్ శత్పతి – బాలేశ్వర్, ఒడిశా
- టేజ్ హాల్వింగ్ (వాయుసేన కార్పొరల్) – జిరో, అరుణాచల్ ప్రదేశ్
- శుభం ద్వివేది – కాన్పుర్, ఉత్తరప్రదేశ్
- సుదీప్ సోయిపాని – రూపం దేహి, నేపాల్
సిగ్గుమాలిన చర్య
పహల్గాం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందని, ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్టగా పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ నిప్పులు పోస్తోందని దుయ్యబట్టారు. భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనని హెచ్చరించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
పిరికిపంద చర్య
ఉగ్రవాదుల దుశ్చర్యలో పర్యాటకుల మరణంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు పిరికిపంద చర్య అని అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాద చర్యలు తమ సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, హోంమంత్రి అమిత్ షా దృఢమైన మార్గదర్శనంలో కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనిస్తూ ఉందన్నారు. ఈ దాడికి పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు.

