కాంగ్రెస్ ప్రాణహిత-చేవెళ్ల దగా.. కేసీఆర్ కూళేశ్వరం దోపిడీ

మ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో అనుమతి పొందిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, ఆ తర్వాత 6 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ముఖ్యబ్యారేజీ కోసం పొరుగున ఉన్న మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలం కావడం తెలంగాణకు కాంగ్రెస్ చేసిన మరొక దగా. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ (2004-2014), మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం (1999 నుంచి 2014), ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ 148-152 మీటర్ల ఎత్తు విషయంలో ఒప్పందం కుదరకపోవడం తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రాజెక్టు తల భాగమైన తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా పోయక, తోక భాగమైన చేవెళ్లలో 650 మీటర్ల ఎత్తులో టన్నెల్లు తవ్వడం రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన దగాకు ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాదు, తొలుత రూ.17వేల కోట్లుగా అంచనా కట్టిన ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38వేల కోట్లకు పైగా తీసుకెళ్లిన కాంగ్రెస్ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుంది.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో సీడబ్ల్యూసీకి చెందిన వ్యాప్కోస్ మొదట తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత 80 టీఎంసీలు అని నివేదిక ఇచ్చి, తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒత్తిడితో 160 టీఎంసీలకు పెంచిన విధానంలో తెలంగాణకు జరిగిన వెన్నుపోటు స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నుంచి 2014 వరకు ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టుల వల్ల సీమాంధ్ర ప్రాంతానికి గత 20 సంవత్సరాల్లో 10వేల టీఎంసీలకు పైగా కృష్ణానీరు తరలివెళ్తే, అదే సమయంలో తెలంగాణ ప్రాంతానికి 500 టీఎంసీల నీరు కూడా రాలేదన్నది వాస్తవం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన మరో అన్యాయం ఇది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఎన్నో ఉద్యమాలు జరిగిన విషయం వాస్తవం. దానిని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ చేసిన విఫల యత్నం తెలంగాణ ప్రజలకు తెలిసినదే.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, ఇతరులు చేపట్టిన పనిని పూర్తి చేయడం ఇష్టం లేక కంతాలపల్లి ప్రాజెక్టును పదిలేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కాంగ్రెస్ దగా ఉన్న చేత కూడా మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వంతో కేసీఆర్ చర్చలు జరిపి, సీడబ్ల్యూసీ కొత్త నివేదికతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం దిగువన మేడిగడ్డకు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి మద్దతుగా మంత్రివర్గ ఉపసంఘం, తెలంగాణ సాగునీటి రంగ నిపుణుల అభిప్రాయాలను చూపించారు. పెన్ గంగా, వార్ధ, వైన గంగా నదుల సంగమంతో ఏర్పడ్డ ప్రాణహిత నది 120 కిలోమీటర్లు ప్రయాణించి కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో కలుస్తుంది. అక్కడ నీటి లభ్యత విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. కానీ కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది నీటిని తెలంగాణకు మళ్లించడం కన్నా కూడా కల్వకుంట్ల కుటుంబం దోపిడీ కోసమే చేపట్టినట్టు కొద్దికాలంలోనే రాజకీయ పండితులు, సాగునీటి రంగ నిపుణులకు అర్థమైంది. 2 మే 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేసీఆర్ శంకుస్థాపన చేసినప్పటికీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సీడబ్ల్యూసీ జూన్ 2018లో టెక్నికల్ కమిటీ నివేదిక, ఇతర నివేదిక వల్ల అనుమతి ఇచ్చింది. కేంద్ర జల సంఘం అనుమతులు రాకముందే కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేషన్‌ల ద్వారా తీసుకున్న అప్పులతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. ఈ విషయాన్ని కాగ్ ముఖ్య తప్పిదంగా పేర్కొంది. రూ.80వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా పూర్తవుతుందన్న నమ్మకం లేని పరిస్థితి. అసలు డ్యాం అయిన మేడిగడ్డ కుంగిపోయింది, నీళ్లు అందించాల్సిన కాలువలు తవ్వలేదు, కానీ కేసీఆర్, హరీష్ రావు ఫాంహౌజ్ పక్కన రిజర్వాయర్లు మాత్రం పూర్తయ్యాయి. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ డిజైన్ ఇంజనీర్ల ఆలోచనల ప్రకారం కాకుండా, ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ చేసి 80వేల పుస్తకాలు చదివానని చెప్పుకొనే సెల్ఫ్ స్టైల్ ఇంజనీర్ అయిన కేసీఆర్ ఆలోచనలతో రూపొందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తన మానస పుత్రికగా పేర్కొంటూ కేసీఆర్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారు. కానీ, 2023 నవంబర్‌లో కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో ఇంజనీర్లు ప్రాజెక్టు డిజైన్ చేశారని, నేను చేయలేదని చెప్పడం ప్రారంభించారు.

కేసీఆర్ పాలనలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంత దయనీయంగా మారిందంటే సిద్దిపేట కలెక్టరుగా పని చేసిన వెంకట్రామి రెడ్డి లాంటి తాబేదార్లకు మాత్రమే స్వేచ్ఛనిస్తూ, నిజాయితీతో పని చేయాలనుకున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను భయంకర ఒత్తిడితో లొంగదీసుకుంటూ, లొంగని పక్షంలో వారి అధికారాలను వంచిస్తూ పాలన సాగించడంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఈ విధంగానే జరిగింది. అందుకే కాళేశ్వరం కాస్తా కూలేశ్వరంగా మారింది.

గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరంభించిన ధనయజ్ఞం స్ఫూర్తితోనే కేసీఆర్ నామినేషన్ విధానంలో దాదాపు 20 శాతం అదనంగా కాంట్రాక్టర్లకు ఇస్తూ కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల మెగా దోపిడీకి తెరతీశారు. మెగా దోపిడీతో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారడమే కాకుండా, పిల్లర్లు కుంగిపోయి కూలేశ్వరం అయింది. ఇప్పుడు ఏం చేయాలని అడిగితే, రాష్ట్ర సాగునీటి రంగ నిపుణులు, రాజకీయ మేధావులకు కూడా సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ దగా కారణంగా ప్రాణహిత-చేవెళ్లకు పురిటిలోనే బొందపెట్టారు. కల్వకుంట్ల దోపిడీ ఎజెండా కారణంగా తెలంగాణ భయంకరమైన అప్పుల పాలైంది. అటు గోదావరి నీళ్లు రాక, చేసిన అప్పులకు కుస్తీలు కట్టలేక రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితుల్లో కూరుకుపోయింది. అధికార దాహంతో 6 గ్యారంటీలు, 420 బూటకపు హామీలిచ్చి సీఎం సీటుపై కూర్చొన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నన్ను కోసినా పైసా దొరకదని, దిల్లీ వెళ్తే చెప్పుల దొంగల్లా చూస్తున్నారంటూనే కొత్త అప్పులతో తెలంగాణను మరింత అప్పుల ఊబిలోకి లాగుతున్నారు. దగాకోరు కాంగ్రెస్, దోపిడీ బీఆర్ఎస్ ను బొంద పెట్టి బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తేనే తెలంగాణకు భవిష్యత్తు.