భారత్ బలాన్ని గుర్తు చేసిన మోదీ
దసరా సమయంలో రిటైల్, ఆన్‌లైన్ వ్యాపార అమ్మకాలు రూ.3.7 లక్షల కోట్లు దాటి, ఈసారి మున్నెన్నడూ లేని అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 15 శాతం ఎక్కువ. రామాయణంలోని ఒక అద్భుతమైన దృశ్యం మన ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. హనుమంతుడు సముద్రపు ఒడ్డున నిలబడి తన శక్తి గురించి సంశయపడుతుంటాడు. అప్పుడు జాంబవంతుడు భుజం తట్టి ఆయన బలాన్ని గుర్తుచేస్తాడు. ఆ తర్వాత హనుమంతుడు వేసిన గంతు ఒక అద్భుతం కాదు; అది ఆత్మవిశ్వాసం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తన అంతర్గత శక్తితో వాటిని అధిగమించేలా తయారు చేశారు. ప్రపంచ దేశాలు వీసా సమస్యలు, సుంకాలతో (టారిఫ్‌లతో) తమలోకి తాము ముడుచుకుపోతున్న వేళ మోదీ నాయకత్వంలో భారతదేశం తన ఆత్మవిశ్వాసం ద్వారా కష్టాలను అభివృద్ధికి ప్రేరకాలుగా మారుస్తోంది.
పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు
ఇటీవల, అమెరికా కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు విధించింది. బ్రాండెడ్ ఔషధాలపై 100 శాతం సుంకం వేసింది. ఇవి వారి ఉద్యోగాలను కాపాడడం కోసమే అంటున్నా ఇది రక్షణవాదం, తరిగి పోతున్న జనాభా గురించి ఆందోళనను సూచిస్తోంది. దీనికి ప్రధాని మోదీ ఇచ్చిన జవాబు ఏమిటంటే ఏ సుంకం తాకలేని మూడు ప్రధాన మూలస్తంభాలను బలోపేతం చేయడం:
- స్థాయి: భారీగా ఉత్పత్తి చేయడం.
- నైపుణ్యం: ప్రజల్లో నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంచడం.
- ఆత్మనిర్భరత : సొంత కాళ్లపై నిలబడడం.
యువశక్తి, ఆర్థిక పురోగతి
భారత్‌కు, ప్రపంచానికి మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది, వారి సగటు వయస్సు ఇప్పుడు 40 దాటింది. కానీ భారతదేశ సగటు వయస్సు 29 ఏళ్ల లోపే ఉంది. మన ప్రజల్లో మూడింట రెండు వంతుల మంది 35 ఏళ్ల లోపు వారే. ఈ యువశక్తిని నైపుణ్య శిక్షణ, విద్య, వ్యాపారం ద్వారా ఉపయోగించుకోవడం వల్లే భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారింది. గత ఏడాది ప్రపంచ వృద్ధిలో భారతదేశం 16 శాతానికి పైగా వాటా కలిగి ఉందని ప్రపంచ ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. ఇవి కేవలం మాటలు కాదు, మోదీ నాయకత్వంలో పదేళ్ల సంస్కరణలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫలితం.
కొన్ని ముఖ్యమైన గణాంకాలు
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతానికి పెంచింది.
- సెప్టెంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.89 లక్షల కోట్లు దాటాయి. వరుసగా తొమ్మిదో నెల ఇవి 1.8 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. ఇది వినియోగం పెరగడాన్ని, పన్నుల పరిధి విస్తరించడాన్ని సూచిస్తుంది.
- విదేశీ మారక నిల్వలు 700 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
- తయారీ, సేవల రంగాల సూచీలు కూడా బలంగా ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది.
మోదీ అనుసరిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ విధానాన్ని కొందరు రాజకీయ దృష్టితో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆత్మనిర్భరత అంటే విడిగా ఉండడం కాదు. ఇది బలపడి బయటికి రావడం, అంటే, ప్రపంచంతో సమానంగా వ్యవహరించగలిగేంత బలం సాధించడం.
ఆత్మనిర్భర్ భారత్ అంటే:
- ప్రపంచం కోసం భారతదేశంలో తయారు చేయడం
- అవకాశాలను వికేంద్రీకరించి, ఆవిష్కర్తలకు విలువ దక్కేలా చేయడం.
- ప్రపంచ మార్కెట్లతో సమాన స్థాయి, హోదాతో వ్యవహరించడం.
మొబైల్ ఫోన్లు, రక్షణ పరికరాలు, వైద్య పరికరాలు వంటి వాటిలో ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకాలు పెట్టుబడులను, ఉద్యోగాలను, ఎగుమతులను పెంచాయి.
డిజిటల్ విప్లవం, నైపుణ్యం
మోదీ మార్గదర్శకత్వంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత సమ్మిళిత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను నిర్మించింది.
- యూపీఐ ఇప్పుడు ప్రతిరోజూ వీసా కన్నా ఎక్కువ లావాదేవీలను (65 కోట్లకు పైగా) నిర్వహిస్తోంది.
- ఆధార్, డిజిలాకర్, ఓఎన్‌డీసీ వంటివి పౌరులను, చిన్న వ్యాపారాలను, ఆవిష్కర్తలను అనుసంధానిస్తున్నాయి.
- సింగపూర్, యూఏఈ వంటి దేశాలతో యూపీఐ భాగస్వామ్యాలు, భారతీయ ఆవిష్కరణలు ప్రపంచ ప్రమాణాలకు గీటురాళ్ళుగా మారగలవని నిరూపిస్తున్నాయి.
ప్రవాస భారతీయులు 3.2 కోట్ల మంది ఉన్నారు. వారిలో 11 మంది 6 లక్షల కోట్ల డాలర్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. ఇది కొత్త భారతదేశ ఆకాంక్షలైన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, కార్యదక్షతలకు అద్దం పడుతోంది. 2024లో ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపిన 135 బిలియన్ డాలర్లు కేవలం సంపద బదిలీ కాదు, స్వదేశం పట్ల వారి నమ్మకానికి, విశ్వాసానికి సంకేతం. ప్రధాని మోదీ తరచూ చెప్పినట్లుగా విదేశాలలో ఉన్న భారతీయులు కేవలం ప్రవాసి మాత్రమే కాదు, దేశ విలువలు, వ్యాపారానికి రాయబారి కూడా. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్ట్-అప్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’ అనేవి ఒకదానితో ఒకటి అనుసంధానమైన కార్యక్రమాలు. అవకాశాలను గుర్తించడం, వ్యవస్థాపకతను, ప్రతిభను ప్రోత్సహించడం వీటి ఉమ్మడి లక్ష్యం. తదుపరి దశ సమగ్ర నైపుణ్య కార్యక్రమం. ఇది ఈ కార్యక్రమాలను ఒకే చట్రంలోకి తీసుకువస్తుంది. భారత భవిష్యత్తు ప్రజల శక్తిని మేల్కొలపడంలో ఉంది.
- ఇతరులు గోడలు కడుతుంటే, భారత్ సామర్థ్యాన్ని పెంచుతోంది.
- ఇతరులు వ్యాపారాన్ని తగ్గిస్తుంటే, భారత్ అవకాశాలను విస్తరిస్తోంది.
- ఇతరులు భవిష్యత్తుకు భయపడుతుంటే, భారత్ దానికి సిద్ధమవుతోంది.
హనుమంతుడి గంతు అతని శక్తిని గుర్తుచేసింది. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన కార్యం కూడా దేశానికి దాని సామర్థ్యాన్ని తిరిగి గుర్తు చేయడమే. ప్రపంచం కొత్త అడ్డంకులు సృష్టించినా నేటి భారతదేశానికి నాయకత్వం, బలం, లక్ష్యం ఉన్నాయి. మోదీ మార్గదర్శకత్వంలో ఈ దేశం ఒడ్డున ఆగిపోదు. అది తన బలాన్ని గుర్తుంచుకుని ముందుకు దూకుతుంది.
హర్దీప్ సింగ్ పూరి,
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి

