BSK Donation

ఉదారత చాటుతున్న కేంద్రమంత్రులు

విద్యార్థుల చదువు, వారికి కనీస సదుపాయాలు కల్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి విద్యార్థుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ఫైనల్ పరీక్ష ఫీజు భారం పడకుండా తానే ఆ ఫీజును చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు కేంద్రమంత్రి లేఖ రాశారు. ‘ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనేది నా అభిమతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి పిల్లలకు నా వంతుగా సహాయం చేయాలని అనుకుంటున్నాను. అందుకే, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ తెలంగాణ SSC బోర్డు పరీక్ష ఫీజు మొత్తాన్ని నా జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించాను. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కిషన్ రెడ్డి గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, మెకనైజ్‌డ్ టాయిలెట్ క్లీనింగ్ మెషీన్స్ అందజేస్తున్నారు. దీంతోపాటుగా డబుల్ డెస్క్ బెంచీలను కూడా సమయానుగుణంగా అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నారు. పలు పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ కు కూడా సహకారం అందించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు అందిస్తున్న సహకారంలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల ఫైనల్ ఎగ్జామ్ ఫీజును పార్లమెంటు సభ్యుడిగా అందుకుంటున్న వేతనం నుంచి చెల్లించాలని నిర్ణయించారు.

BSK Donationప్రభుత్వాసుపత్రులకు ఆధునిక పరికరాలు

మరోవైపు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులకు రూ.5 కోట్ల విలువ గల అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అందజేశారు. ఇందులో ఈసీజీ మిషన్లు, అల్ట్రాసౌండ్ మిషన్, ఈఎన్టీ సర్జికల్ మైక్రోస్కోప్, మల్టిపుల్ మానిటర్ మార్చురీ కేబినెట్ సహా మొత్తం 15 రకాల వైద్య పరికరాలు (మెడికల్ ఎక్విప్ మెంట్స్) ఉన్నాయి. NMDC సహకారంతో దాదాపు రూ.5 కోట్ల CSR నిధులతో ఈ పరికరాలు కొనుగోలు చేశారు. పరికరాలు లేవనో, వసతులు లేవనో పేదలు ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లే పరిస్థితి ఉండకూడదని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను వాకబు చేశారు. అక్కడ కనీసం కుక్క కాటుకు కూడా మందు అందుబాటులో లేని దుస్థితి చూసి ఆవేదన చెందారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలు, మధ్య తరగతి వాళ్లను టెస్టుల్లేవనో, సూది మందు లేదనో ప్రైవేట్ ఆసుపత్రికి పంపి, వారిపై భారం మోపొద్దని సంబంధిత అధికారులు, వైద్య సిబ్బందికి తెలిపారు. అవసరమైన పరికరాలను, సాయాన్ని అందిస్తానని వారికి బండి సంజయ్ హామీ ఇచ్చారు.