నదీ జలాల్లో కాంగ్రెస్ దగా, బీఆర్ఎస్ దోపిడీ

కృష్ణ, గోదావరి నదుల నీటి పంపకం, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి ఇది కూడా ఒక ముఖ్యకారణం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రాజెక్టుల నిర్మాణంలోనూ, నీటి కేటాయింపుల్లోనూ తెలంగాణకు ఘోర అన్యాయం చేసింది. ఈ రెండు నదుల నీటి పంపకాల కోసం ఏర్పడ్డ ట్రిబ్యునళ్ల కాలంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపుల విషయంలో, ముఖ్యంగా 68 శాతం కృష్ణ నదీ పరివాహకం ఉన్న తెలంగాణకు 34 శాతం (299 టీఎంసీలు) నీటి కేటాయింపులు జరపడంలో ప్రధాన దోషి ముమ్మాటికి కాంగ్రెస్సే. స్వరాష్ట్రం సిద్ధించాకా అదే 34 శాతానికి కేసీఆర్ అంగీకరించడం కాంగ్రెస్ దోపిడీని బీఆర్ఎస్ కొనసాగించడమే. 

కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉన్న దక్షిణ తెలంగాణ చాలావరకు కరువు ప్రాంతం. గోదావరి మాదిరిగా కృష్ణలో ప్రతి సంవత్సరం పుష్కలంగా నీళ్లు లభించవు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల మధ్య నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం నీటి వినియోగంలో కూడా తెలంగాణకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేస్తే, బీఆర్ఎస్ అదే కొనసాగించింది. మద్రాసు నగరానికి 15 టీఎంసీల తాగునీటి సరఫరా పేరుతో వచ్చిన తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి పుట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 1100 క్యూసెక్కుల నుంచి 40వేల క్యూసెక్కులు దాటింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచే సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుత బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) భాగస్వామి. మిగులు జలాల పేరుతో నికర జలాలను దుర్మార్గంగా దోపిడీ చేసి కాంగ్రెస్ దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే, దానిని బీఆర్ఎస్ కొనసాగించింది. సంగమేశ్వరం వద్ద శ్రీశైలం జలాశయం నీటిని 800 అడుగుల వద్దే లిఫ్టు చేసేవిధంగా (RLIP) అప్పటి ఏపీ సీఎం జగన్ టెండర్లకు పిలిస్తే, అప్పటికే రోజాతో కలిసి రాయలసీమకు వెళ్లి, రాయలసీమను రతనాలసీమ చేస్తానన్న కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించారు. అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖతో స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమావేశం ఏర్పాటు చేస్తే, సాకులతో మీటింగును వాయిదా వేయించి, సంగమేశ్వర లిఫ్టు టెండర్లు ఆమోదం పొందిన తర్వాత సమావేశానికి వెళ్లిన కేసీఆర్ తెలంగాణకు కాంగ్రెస్ ను మించి దగా చేశాడు.

గత 7 ఏళ్లుగా వరుణ దేవుడి కృపతో దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణనది పరివాహక ప్రాంతం, తెలంగాణలో అధికంగా వర్షాలు సకాలంలో కురవడంతో సాగర్, శ్రీశైలం, SRSPతో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాయి. అంతకుముందెన్నడూ లేనివిధంగా ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ 500 టీఎంసీల నీళ్లు కృష్ణ నుంచి సముద్రంలో కలిశాయి. అర్హతలో సగం శాతం కేటాయించిన 299 టీఎంసీల నీటిని వినియోగించుకోలేని దౌర్భగ్య పరిస్థితికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను తీసుకొచ్చాయి. అటు ఏపీ ప్రభుత్వం 512 టీఎంసీలకు ప్రతి సంవత్సరం అదనంగా కనీసం 200 టీఎంసీలు వాడుకుంది. తెలంగాణ దుస్థితికి ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే కారణం.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీకి సంబంధించి, అదే పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రతో 10 సంవత్సరాలయినా ఒప్పందం చేసుకోలేకపోవడం నాటి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతుంది. ఒప్పందం కుదరకపోవడానికి ఆ సమయంలో కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్సే ఏకైక దోషి. గోదావరి (ప్రాణహిత) నీటిని లిఫ్టు చేయాల్సిన తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి పోయని కాంగ్రెస్ (148 మీటర్ల ఎత్తు) ఇటు 600 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న చేవెళ్ల దగ్గర కమిషన్ల కోసం టన్నెళ్లు తవ్వి భూగర్భ జలాలను హరించింది. కాంగ్రెస్ నాయకుల, వారి సంబంధీకుల కాంట్రాక్టుల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అమలు చేసినట్టు కనిపిస్తోంది. రూ.17500 కోట్ల అంచనా వ్యయాన్ని రూ.38వేల కోట్లకు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 ఏళ్లలో రూ.4వేల కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా, నత్తతో పోటీలా ప్రాజెక్టు పనులను చేపట్టింది. ఇది కాంగ్రెస్ తెలంగాణకు చేసిన మరో దగా.

రీడిజైన్ పేరుతో గోదావరి కాళేశ్వరం సంగమం దిగువన మేడిగడ్డ వద్ద ముఖ్య బ్యారేజీగా పథక రచన చేసిన కేసీఆర్ బ్యారేజీల రూపకల్పన, నిర్మాణం, తదనంతరం నిర్వహణలో భయంకర అవినీతి, అశ్రద్ధ వల్ల దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రాజెక్టు పూర్తి కాకముందే బ్యారేజీ కుంగిన ఘటన కాళేశ్వరంలో చోటుచేసుకుంది. ఇంజనీర్ల మాటలు వినకుండా, మిడిమిడి జ్ఞానంతో కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలతో డిజైన్ చేసిన బ్యారేజీలు లోపాల పుట్టలు. ఆ బ్యారేజీ డిజైన్, నిర్మాణ, నిర్వహణ లోపాలను ఎన్డీఎస్ఏ కళ్లకు కట్టినట్టు చూపించింది. బీఆర్ఎస్ ఓటమిలో కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం కూడా ప్రధాన కారణం.

రెండు సంవత్సరాల క్రితం అధికారదాహంతో ఇచ్చిన అడ్డగోలు హామీలకు తోడు కేసీఆర్ దోపిడీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు నీటి పంపకం, వినియోగం విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఈ రెండు పార్టీల ఘోర వైఫల్యాలకు మరో ఉదాహరణ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్. కాంగ్రెస్ కమిషన్ల దాహంతో 33 కి.మీ టన్నెల్ పొడవును 44 కి.మీలకు పెంచింది. అవినీతి సొమ్ము కోసం కేసీఆర్ సైతం ఆ టన్నెళ్లను నిర్లక్ష్యం చేశారు.

బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రంతో సఖ్యతతో మెలిగి, సకాలంలో అనుమతులు పొంది, ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తిచేసుకొని, ఎక్కువ నీటి వినియోగంతో అభివృద్ధి చెందుతుంటే, ధనదాహంతో కుట్రపూరిత రాజకీయాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకి తీరని ద్రోహం చేశాయి. బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే రాష్ట్ర సాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు ఎప్పటికీ అరిష్టాలే.