ఎన్నడూ లేనంతగా క్షీణించిన తెలంగాణ రాబడి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గడిచిన నాలుగేండ్లలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సొంత రాబడి క్షీణించింది. వార్షిక బడ్జెట్ అంచనా లక్ష్యంలో ఎనిమిది నెలలు దాటినా సగానికి కూడా చేరలేదు. ప్రతి ఏడాది బడ్జెట్ అంచనాలు పెరుగుతున్నా, వాస్తవ రూపంలో ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతున్నది. అప్పుల భారం మాత్రం గుట్టలా పెరిగిపోతున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా విడుదల చేసిన నవంబర్ నెల రాష్ట్ర ఆదాయ, వ్యయాల నివేదికను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ వ్యయాలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉండటం, వాటిని పూడ్చడానికి అప్పులపై ఆధారపడటం ఈ నివేదికలో ప్రధానంగా కనిపిస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.54,009.74 కోట్ల వరకు అప్పులు చేయవచ్చని బడ్జెట్‌లో అంచనా వేసుకున్నారు. కానీ నవంబర్ నాటికే రూ.58,068.90 కోట్ల అప్పు చేశారు. కేవలం (ఏప్రిల్-నవంబర్) తొలి 8నెలల్లోనే బడ్జెట్ అంచనా కంటే 107.52% అప్పులు చేయడం ప్రభుత్వ ఆర్థిక వైఫల్యానికి అద్దం పడుతున్నది. అదుపు లేకుండా అప్పులు చేస్తున్న ప్రభుత్వంగా అపఖ్యాతి పొందుతున్నది. సొంత రాబడులను పెంచుకోవడంలో మాత్రం చతికిల పడుతుంది. 2022-23లో నవంబర్ నాటికి బడ్జెట్ అంచనాలో 49.7% అప్పులు చేశారు. 2024-25కు ఇది 76.84 శాతానికి చేరింది. 2025-26 (ప్రస్తుత ఏడాది) నవంబర్ ముగిసే సమయానికే ప్రభుత్వం 107.52% అప్పులు చేసింది. అంటే, ఏడాది మొత్తానికి అనుకున్న అప్పును ఎనిమిది నెలల్లోనే దాటేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రమాదకర స్థాయికి సంకేతంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల గ్యారెంటీలు, పబ్లిక్ అకౌంట్ నుంచి తీసుకున్న అప్పుల వివరాలను ప్రభుత్వం కాగ్‌కు సమర్పించలేదు. ఇది రాష్ట్ర అసలు అప్పుల లెక్కలపై అనుమానాలను కలిగిస్తున్నది. మరోవంక, హైడ్రా ప్రభావంతో పాటు నిర్మాణరంగంపై ప్రభుత్వ విధానం ప్రకటించకపోవడంతో కీలకమైన రియల్‌ఎస్టేట్, నిర్మాణరంగం తీవ్రంగా ప్రభావితమైంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి క్రమంగా పెరిగిన రియల్ రాబడి రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రివర్స్ అయింది. గ్రామాల్లో వ్యవసాయ భూములు అమ్ముదామన్నా కొనే దిక్కు లేకుండా పోయింది. ఫలితంగా రాష్ర్టానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయ అంచనాలు తలకిందులవుతున్నాయి.
తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గత ఐదేండ్లలో స్థిరత్వం కోల్పోయి, తిరోగమన దిశలో పయనిస్తోంది. ప్రభుత్వ ఆదాయం బడ్జెట్ అంచనాల్లో సగానికి మించి రాకపోవడం రియల్ రంగానికి ముంచుకొస్తున్న గండానికి నిదర్శనమని స్థిరాస్తి వ్యాపార నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగ్ తాజా గణాంకాల ప్రకారం కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న 2020-21లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 52 శాతం నమోదైంది. కరోనా రెండోదశ 2021-22లో కూడా రిజస్ట్రేషన్ ద్వారా 98 శాతం రాబడి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఆదాయం 46 శాతానికి పడిపోయింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19,087.26 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, నవంబర్ 2025 నాటికి వచ్చింది రూ.9,911.26 కోట్లే (అంటే 51.93%) రాబడి నమోదైంది. 2025-26 బడ్జెట్‌లో ల్యాండ్ రెవెన్యూ కింద రూ.11.20 కోట్లు వస్తాయని ఆశించగా, నవంబర్ వరకు వచ్చింది రూ.47 లక్షలు (4.21%) మాత్రమే. 2024-25లో కూడా నవంబర్ నాటికి కేవలం రూ.73 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. బడ్జెట్ అంచనాలను భారీగా పెంచుతున్నప్పటికీ, వాస్తవ ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరుగడం లేదు.
కాగ్ నివేదికల ప్రకారం.. ప్రతి సంవత్సరం నవంబర్ నాటికి సాధిస్తున్న లక్ష్యం క్రమంగా తగ్గుతున్నది. 2022లో గరిష్ఠంగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఆదాయం 60.31 శాతం వచ్చింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గత ఐదేండ్లలో స్థిరత్వం కోల్పోయి, తిరోగమన దిశలో పయనిస్తోంది. ప్రభుత్వ ఆదాయం బడ్జెట్ అంచనాల్లో సగానికి మించి రాకపోవడం రియల్ రంగానికి ముంచుకొస్తున్న గండానికి నిదర్శనమని స్థిరాస్తి వ్యాపార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ చైతన్య

