DDU Birth

సేవ, సమాజ నిర్మాణం కోసం రాజకీయాలు

DDU NRRనేటి రాజకీయాల్లో హంగామా, ఆర్భాటాలు పెచ్చుమీరుతున్న తరుణంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితం ప్రతి రాజకీయ నాయకుడికి ప్రేరణగా ఉండాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటే ఆడంబరం, ప్రదర్శన కాదని, సేవ కోసం రాజకీయాల్లో ఉండాలని దీన్‌దయాళ్ తన జీవితంలో ఆచరించి చూపించారని తెలిపారు. నేటి రాజకీయాల్లో విద్వేషాలు, అసభ్య భాష, కుట్రలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు సేవ కోసం ఉండాలి, సమాజ నిర్మాణం కోసం ఉండాలి అనే విలువలను ఉపాధ్యాయ మనకు నేర్పించారన్నారు. అలాంటి ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం దేశానికి అవసరమని అన్నారు. ‘ఏకాత్మ మానవ దర్శనం’ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 11న బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

సమాజంలోని చిట్టచివరి వ్యక్తిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ స్ఫూర్తికి నిదర్శనమని రాంచందర్ రావు అన్నారు. ఏకాత్మ మానవవాదం ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ”భారతీయ జనసంఘ్ స్థాపకుల్లో ఒకరిగా, పార్టీ సిద్ధాంతకర్తగా దీన్‌దయాళ్ చూపిన మార్గం మాకు దిక్సూచి వంటిది. భారతీయ జనసంఘ్‌గా ప్రారంభమైన ఆ ఉద్యమం 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి, ఈరోజు దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడం ఆయన లాంటి మహనీయుల త్యాగ ఫలితమే. పార్టీగా మనం ఈ విజయానికి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అత్యంత సాధారణమైన, నిరాడంబరమైన జీవితం గడిపారు. ఆయన ఎప్పుడూ థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించేవారు. 

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవ దర్శనం’ (ఇంటిగ్రల్ హ్యూమనిజం) భారతీయ జనతా పార్టీకి ప్రాణాధారం. భారతదేశ అభివృద్ధికి భారతీయ సంస్కృతి, స్వదేశీ భావనలతో ముడిపడిన ఆర్థిక విధానం అవసరమని ఆయన స్పష్టం చేశారు. 1965లో విజయవాడలో నిర్వహించిన భారతీయ జనసంఘ్ మహాసభల్లో ఆయన ‘ఏకాత్మ మానవ దర్శనం’ను దేశానికి పరిచయం చేశారు. ఈ సిద్ధాంతం ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారిక తత్వంగా మారింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మరణం అత్యంత విషాదకరం. ఆయన మరణంపై వాస్తవాలు ఇప్పటికీ వెలుగులోకి రాకపోవడం బాధాకరం. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒక్కటే – దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ‘అంత్యోదయ’, ‘ఏకాత్మ మానవ దర్శనం’ మార్గంలోనే దేశాభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తూ మనం ముందుకు సాగాలి.” అని రాంచందర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ గారు, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.