Gandhi Bhawan

తెలంగాణ కాంగ్రెస్‌లో పరాకాష్టకు బీసీ చిచ్చు

బీసీల సాధికారికత పేరుతో అధికారంలోకి వచ్చి, స్థానిక సంస్థలలో వారికి 42 శాతం వరకూ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఆ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలనే కొంతకాలం వాయిదా వేసిన అధికార కాంగ్రెస్ పార్టీలో తాజాగా మరోసారి బీసీల ఉనికిపై చిచ్చు రేగుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చిచ్చుకు, చర్చకు దారితీసాయి. పీసీసీ అధ్యక్షునిగా మహేష్‌ కుమార్‌ గౌడ్ స్థానంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ వంద సీట్లు గెలుచుకుంటుందని మంత్రి వెంకట రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా చిట్‌చాట్‌లో చేసిన వాఖ్యలు రాజకీయంగా బీసీ వర్గాలలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కీలక పదవులు బీసీలకు దక్కకుండా చేసి, ‘నామమాత్రపు’ పీసీసీ అధ్యక్ష పదవి ఉండటాన్ని సైతం ఆ వర్గాలు సహించలేక పోతున్నాయనే వాదనలు చెలరేగుతున్నాయి. 

వెంకట రెడ్డి బయటపడి బీసీ వర్గాల పట్ల తన అక్కసు వెళ్లగక్కినప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ వర్గాలకు హోదాలు తప్ప, అధికారంలో చెప్పుకోదగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్‌లో రెడ్డి వర్సెస్ బీసీ పోరుకు ఆజ్యం పోసినట్టయింది. ఇటు పార్టీ వర్గాలలో, అటు అసెంబ్లీ లాబీలలోనూ ఈ అంశంపైనే చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లోనూ బీసీల పట్ల చిన్నచూపు ప్రదర్శితమైందనే అసంతృప్తి ఈ వర్గాలలో వ్యక్తం అవుతున్నది. 56 శాతం బీసీ జనాభాకు కేవలం 4 శాతం మాత్రమే కేటాయింపులు చేసారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీ సంక్షేమం కోసం కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శలు చెలరేగుతున్నాయి. కనీసం రూ.20,000 కోట్లు అయినా కేటాయించి ఉండాల్సిందని బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. 

స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లడమే కాకుండా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పార్టీపరంగా 56 శాతం అవకాశం కల్పించామని చెప్పుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు సారథ్యం వహిస్తోన్న బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్ నాయకత్వాన్ని తక్కువ చేయడాన్ని బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు మండిపడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్నా కైలాష్ నియామకాన్ని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఒక కార్యక్రమంలో బహిరంగంగా అవమానించిన ఉదంతాన్ని తాజా వ్యాఖ్యల నేపథ్యంలో గుర్తు చేస్తున్నారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలవలేని జగ్గారెడ్డి రాష్ట్రంలో వంద సీట్లు ఎలా గెలిపిస్తారని బీసీ నాయకులు మంత్రి వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షునిగా నియామకం అయిన బీసీ నేత, పొన్నాల లక్ష్మయ్యను నల్లగొండ జిల్లా ప్రచారానికి రావద్దని అప్పట్లో కోమటిరెడ్డి వెంకట రెడ్డితో పాటు ఆ జిల్లాకు చెందిన రెడ్డి నాయకులు సహాయ నిరాకరణ చేశారని పార్టీలో బీసీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

పీసీసీ అధ్యక్షునిగా మహేశ్‌ కుమార్‌ గౌడ్, సీఎం రేవంత్‌ రెడ్డి వీరిద్దరూ సమన్వయంతో పని చేస్తూ ప్రతి ఎన్నికలలోనూ వరుస విజయాలు సాధించినప్పటికీ, కొత్త పీసీసీ అధ్యక్షునిగా జగ్గారెడ్డిని నియమించాలని బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలలోకి, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. బీసీలకు అలంకారప్రాయంగా పదవులు మాత్రం ఇస్తూ కీలకమైన పదవులు, నియామకాల విషయంలో వారిని దూరంగా ఉంచుతున్నారని ఇప్పటికే ఆ పార్టీలో బీసీ వర్గాలు ఆగ్రహం చెందుతున్నాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలలో తెలంగాణ నుండి రెండు సీట్లకు ఎన్నికలు జరిగితే రెండింటిని కూడా అగ్రవర్ణాల అభ్యర్థులను ఎంపిక చేసి బీసీలను అసలు పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చిన్నప్పటికీ గెలిచిన చోట్ల వారిని అలంకారప్రాయంగా ఉంచుతూ, అసలు పెత్తనం స్థానిక ఎమ్మెల్యే లేదా ఇతర నాయకులు చేస్తున్నారనే విమర్శలు ఈ సందర్భంగా చెలరేగుతున్నాయి.

కృష్ణ చైతన్య