Health

ప్రపంచ ఆరోగ్య శక్తిగా ఎదిగిన భారత్

దీర్ఘకాలిక ప్రజారోగ్య సవాళ్లను అధిగమించడమే కాకుండా సరసమైన ధరలకు మందులు, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందించడంలో భారత్ నేడు అగ్రగామిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం దూరదృష్టి, పటిష్టమైన సంస్థలు, 2047 నాటికి ‘వికసిత భారత్’ను నిర్మించాలనే సంకల్పం ఈ మార్పునకు కారణం. అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలు, విస్తృతమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు దేశాన్ని ఆరోగ్యవంతమైన, ఉత్పాదక సమాజంగా మారుస్తున్నాయి. భారత వైద్య విద్యా వ్యవస్థ ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో గణనీయంగా వృద్ధి చెందింది. పరిమాణం పరంగా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఔషధ రంగం మనది. కోవిడ్-19 సమయంలో వ్యాక్సిన్ల తయారీలో భారత్ చూపిన తెగువ దీనికి నిదర్శనం. అలాగే, వైద్య పర్యాటకం కూడా పుంజుకుంది; చికిత్స కోసం భారత్ ను సందర్శించే వారి సంఖ్య 2009లో 1.12 లక్షలు కాగా 2024 నాటికి 6 లక్షలు దాటింది. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రభుత్వం ప్రకటించిన ఐదు సమీకృత మెడికల్ హబ్‌లు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

అందరికీ ఆరోగ్యం: ఆయుష్మాన్ భారత్

సమాజంలోని సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన చికిత్స అందించడమే ఆయుష్మాన్ భారత్ లక్ష్యం. దీనిలోని నాలుగు ప్రధాన భాగాలు:

  1. AB-PMJAY: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం.
  2. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణ.
  3. PM-ABHIM: దేశవ్యాప్త ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే కార్యక్రమం.
  4. ABDM : డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థకు వెన్నెముక వంటిది.

‌‌ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) 

అందరికీ ఆరోగ్య రక్షణే ధ్యేయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సెప్టెంబర్ 23, 2018న ‘ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ పథకాన్ని ప్రారంభించింది. కోట్లాది నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ పథకం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య రక్షణ పథకంగా గుర్తింపు పొందింది. ఈ పథకం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ద్వితీయ, తృతీయ స్థాయి (ఖరీదైన) వైద్య సేవలు, ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తారు. ఇది పేద ప్రజలను అధిక వైద్య ఖర్చుల ఊబి నుంచి కాపాడుతుంది. జాబితాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో నగదు రహిత చికిత్సను ఈ పథకం అందిస్తుంది. భారత జనాభాలో అట్టడుగున ఉన్న 40 శాతం ప్రజల కోసం రూపొందించిన ఈ పథకంలో ఇప్పటివరకు 12 కోట్ల మంది నమోదు కాగా, 4.34 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులను జారీ చేశారు.

ఆరోగ్య బీమాపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా ఈ పథకం కుటుంబాల సొంత వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గించింది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో దీనివల్ల ప్రజలకు దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఆదా అయ్యింది. ప్రస్తుత 2026-27 బడ్జెట్ అంచనాలలో ఈ పథకం కోసం కేటాయింపులను రూ.9,500 కోట్లకు పెంచారు. ఇది గత 2025-26 సవరించిన అంచనాల కంటే రూ.500 కోట్లు(5.56 శాతం) ఎక్కువ. లబ్ధిదారుల సంఖ్యను పెంచడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఈ కేటాయింపుల ప్రధాన ఉద్దేశ్యం. AM-PMJAY ప్రధానంగా ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవలకు మద్దతు ఇస్తుండగా, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉన్న ఇతర విభాగాలు నాణ్యమైన ప్రాథమిక వైద్యాన్ని, అందరికీ అందుబాటులో ఉండేలా పటిష్టమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కృషి చేస్తున్నాయి.

‌‌ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (AAM) 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు చేరువగా ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి 1,84,235 ఆరోగ్య మందిరాలు పని చేస్తున్నాయి. వీటిలో టెలి కన్సల్టేషన్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. 2025 అక్టోబర్ 31 వరకు ఈ కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షల వివరాలు:

  • రక్తపోటు: 40.1 కోట్లు
  • మధుమేహం : 39.8 కోట్లు
  • నోటి క్యాన్సర్: 33.8 కోట్లు
  • రొమ్ము క్యాన్సర్: 15.8 కోట్లు

మౌలిక సదుపాయాలు, డిజిటల్ కార్యక్రమాలు‌‌

PM-ABHIM ద్వారా 2021-26 కాలానికి రూ.32,928 కోట్లు కేటాయించి, జిల్లా స్థాయిలో అత్యవసర వైద్య సేవల (క్రిటికల్ కేర్) బ్లాక్ లు, ల్యాబొరేటరీలను నిర్మిస్తున్నారు.

డిజిటల్ విప్లవం: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద 86.3 కోట్లకు పైగా ‘ఆభా’ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) హెల్త్ ఐడీలు సృష్టించారు. ఇది రోగుల వైద్య రికార్డులను డిజిటల్‌గా భద్రపరుస్తుంది. మానసిక ఆరోగ్య సేవల కోసం ‘టెలి మానస్’ 20 భాషల్లో 24×7 కౌన్సెలింగ్ అందిస్తోంది.

‌‌డ్రోన్ ద్వారా వైద్య సేవలు

పర్వత ప్రాంతాలు, మారుమూల గ్రామాల కోసం ICMR ఐ-డ్రోన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మణిపూర్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల పంపిణీకి, తెలంగాణలో టీబీ శాంపిల్స్ రవాణాకు, దిల్లీలో రక్తం సరఫరాకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

‌‌జాతీయ ఆరోగ్య మిషన్ 

దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కార్యక్రమం మాతా శిశు మరణాల తగ్గింపులో కీలక పాత్ర పోషించింది.

  • సార్వత్రిక టీకా కార్యక్రమం: ఏటా 2.67 కోట్ల శిశువులకు, 2.9 కోట్ల మంది గర్భిణులకు 11 రకాల టీకాలను ఉచితంగా అందిస్తోంది.
  • కీలక విజయాలు:
    • మాతృ మరణాల రేటు (MMR) 83 శాతం తగ్గింది.
    • ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 75 శాతం తగ్గింది.
    • కోవిడ్ సమయంలో 220 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ.

HPV వ్యాక్సిన్: గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఫిబ్రవరి 28, 2026న 14 ఏళ్ల బాలికల కోసం ‘గార్డాసిల్-4’ టీకా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ఆరోగ్యరంగంలో AI ‌‌

ఫిబ్రవరి 2026లో ‘సాహి’ (స్ట్రాటజీ ఫర్ ఏఐ ఇన్ హెల్త్‌కేర్) విధానాన్ని భారత్ ఆవిష్కరించింది.

  • ఇ కెఏ డాక్: లక్షల మంది రోగుల రికార్డులను విశ్లేషిస్తోంది.
  • మధునేత్ర్ AI: మధుమేహం వల్ల వచ్చే కంటి సమస్యలను AI ద్వారా గుర్తిస్తుంది.
  • టీబీ నియంత్రణ: చికిత్సలో వైఫల్యాలను ముందుగానే పసిగట్టే AI టూల్స్ వినియోగంలో ఉన్నాయి.

‌‌చవకైన మందులు: జనఔషధి కేంద్రాలు

ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన కింద 17,990 కేంద్రాల్లో 2,000 పైగా మందులు 50-90 శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీనివల్ల గత పదేళ్ళలో ప్రజలకు రూ.30,000 కోట్లు ఆదా అయ్యాయి. అలాగే అమృత్ ఫార్మసీల ద్వారా క్యాన్సర్, గుండె జబ్బుల మందులు సబ్సిడీ ధరపై లభిస్తున్నాయి.

బయో‌‌ఫార్మా ‘శక్తి’ 

2026-27 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ కార్యక్రమంతో భారత్ బయో-మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా మారనుంది. స్వదేశీ ఎమ్మారై స్కానర్లు, తక్కువ ధరకే డయాబెటిస్ మందులు, ప్రపంచంలోనే మొదటి డీఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. వ్యాధులతో పోరాడే దశ నుంచి ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా భారత్ ఎదిగిన తీరు అసాధారణం. 1.8 లక్షల ఆరోగ్య మందిరాలు, 86 కోట్ల డిజిటల్ హెల్త్ ఐడీలతో నిర్మించిన ఈ పునాది 2047 నాటికి ‘వికసిత భారత్’ కల సాకారం కావడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

  • సార్వత్రిక ఆరోగ్య రక్షణ: ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వందల కోట్ల మందికి ఉచిత/సబ్సిడీ వైద్యం అందుతోంది. 1.84 లక్షలకు పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 86.3 కోట్ల డిజిటల్ హెల్త్ ఐడీలతో వ్యవస్థ పటిష్టమైంది.
  • ప్రపంచ ఔషధశాల: ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే జనరిక్ మందులలో 20 శాతం, యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి) వ్యాక్సిన్లలో 55–60 శాతం భారత్ నుంచే వెళ్తున్నాయి. 2030 నాటికి మన బయో-ఆర్థిక వ్యవస్థ 300 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంటుంది.
  • సాంకేతికత & ఆవిష్కరణలు: ఏఐ రోగనిర్ధారణ, డ్రోన్ల ద్వారా మందుల సరఫరా, స్వదేశీ వ్యాక్సిన్‌లు మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యాన్ని చేరువ చేస్తున్నాయి.