మోదీ సంకల్పం, అమిత్ షా సామర్థ్యంతో సాకారమైన నక్సల్ రహిత భారత్ లక్ష్యం!
గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ అంతర్గత భద్రతకు, అభివృద్ధికి నక్సలిజం ప్రధాన అడ్డంకిగా మారింది. భౌగోళికంగా దుర్గమంగా ఉన్న, వెనకబడిన, ప్రభుత్వం-ప్రజల మధ్య విశ్వాసం సన్నగిల్లిన ప్రాంతాలలో ఈ సమస్య వేళ్లూనుకుంది. దశాబ్దాల నాటి ఈ మహమ్మారి ఇప్పుడు అంతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధృడ సంకల్పం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహ చతురత ఇందుకు కారణం. మోదీ ప్రభుత్వ చారిత్రాత్మక విజయాల్లో నక్సల్స్ రహిత భారతదేశం మరో కలికితురాయి.
నక్సలిజం అనేది కేవలం స్థానిక శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదు, ఇది మావోయిస్టు భావజాలంతో ప్రేరేపితమైన ఒక ఉద్యమం. హింస ద్వారా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేయాలనేది దీని లక్ష్యం. ప్రారంభ దశలో చారు మజుందార్, కానూ సన్యాల్, జంగల్ సంతాల్ వంటి నేతలు భూమి, అసమానత, సామాజిక న్యాయం వంటి అంశాలను లేవనెత్తుతూ అణగారిన వర్గాలను సమీకరించారు. కాలక్రమేణా ఈ ఉద్యమం హింసాత్మక తిరుగుబాటుగా మారి, అమాయక గిరిజన ప్రజలను దోపిడీ చేస్తూ, అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారారు.
ఛత్తీస్‌గఢ్, ముఖ్యంగా బస్తర్ ప్రాంతం, ఈ సమస్య వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలలో ఒకటి. అటవీ సంపద, ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ, అభివృద్ధి లేమి కారణంగా హింసాత్మక వామపక్షవాదం విస్తరణకు అనువైన వేదికగా మారింది. వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించడంలో గత ప్రభుత్వాల వైఫల్యాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి. తద్వారా నక్సల్ ప్రభావం విస్తరించేందుకు కారణమయ్యాయి. ఛత్తీస్‌గఢ్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పరిస్థితులు మారడం మొదలైంది. నక్సలిజంపై పోరాటాన్ని కేవలం బలప్రయోగానికే పరిమితం అవకుండా, ‘అభివృద్ధి, భద్రత’ అనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. మౌలిక సదుపాయాలను విస్తరించడం, జిల్లాల సంఖ్యను పెంచడం, ఆరోగ్య, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడం, గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా సంక్షేమ పథకాలను అమలు చేయడం వంటి చర్యలు చేపట్టింది. అటవీ హక్కుల బదిలీ, చౌక ధరల ఆహార పథకాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ మద్దతు వంటి కార్యక్రమాలు ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి దోహదపడ్డాయి. ఈ ప్రయత్నాలు జరిగినప్పటికీ సమన్వయంతో కూడిన బలమైన జాతీయ వ్యూహం లేకపోవడం లోటుగా మారింది. 2014 తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక సమగ్రమైన విధానాన్ని అవలంబించినప్పుడు అసలైన మార్పు మొదలైంది. అభివృద్ధిని చివరి మైలు వరకు చేరుకుంది, పరిపాలన సమ్మిళితంగా మారింది, వ్యవస్థల్లో జవాబుదారీతనం వేళ్లూనుకుంది. అదే సమయంలో అమిత్ షా పకడ్బందీ భద్రతా విధానాలు, చర్యలు నక్సలైట్లపై పోరాటానికి కొత్త దిశను తీసుకొచ్చాయి. నక్సలిజంపై ఆయన అవలంబించిన ‘జీరో టాలరెన్స్’ (సహించేది లేదనే) విధానం, మెరుగైన నిఘా వ్యవస్థ, భద్రతా దళాల ఆధునికీకరణ, కేంద్రం-రాష్ట్రాల మధ్య పటిష్టమైన సమన్వయం ఈ పోరాట గతిని సమూలంగా మార్చేశాయి.
భద్రతా దళాల కార్యకలాపాలు మరింత కచ్చితత్వంతో, సమర్థంగా సాగాయి. ముఖ్యంగా నక్సలైట్ల నాయకత్వాన్ని, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ‘ఆపరేషన్ కగార్’ వంటి కార్యక్రమాలు వారి నాయకత్వ వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీశాయి. వందల మంది తీవ్రవాదులు హతమయ్యారు, వేలమందిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి, మరెంతో మంది లొంగిపోయారు. ఒకప్పుడు ఎవరూ వెళ్లలేని ప్రాంతాలుగా పరిగణించిన చోట ఇప్పుడు పరిపాలన, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో మోదీ ప్రభుత్వం సఫలీకృతమైంది. నక్సలిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజా విశ్వాసమే అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా మారింది. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవడంతో వామపక్ష తీవ్రవాదం పునాదులు కదిలాయి. స్థానిక యువతకు సాధికారత కల్పించడం, వారికి తగిన శిక్షణ ఇవ్వడం, వారిని భద్రతా దళాలలో చేర్చుకోవడం ఈ సామాజిక పరివర్తనలో కీలక పాత్ర పోషించాయి. ఫలితంగా హింస గణనీయంగా తగ్గింది, అభివృద్ధి వేగవంతమైంది. ఒకప్పుడు భయంతో గడిపిన ప్రాంతాల్లో ఆశలు చిగురించాయి. ‘ఎర్రలోగిలి’ లేదా ‘రెడ్ కారిడార్’ అని పిలిచే ప్రాంతం క్రమంగా కుంచించుకుపోయింది. ‘నక్సల్ రహిత భారతదేశం’ అనే కల సాకారమైంది.
ఎంతటి కఠినమైన సవాళ్లనైనా దృఢ సంకల్పం, తిరుగులేని వ్యూహం, స్పష్టమైన దార్శనికతతో అధిగమించవచ్చని నరేంద్ర మోదీ, అమిత్ షాల నాయకత్వం నిరూపించింది. వారి కృషితో అంతర్గత భద్రత బలోపేతం కావడమే కాకుండా, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగింది. మనం ముందుకు సాగుతున్న కొద్దీ సాధించిన ఈ విజయాలను సుస్థిరం చేసుకోవడం అవసరం. అభివృద్ధి నిరంతరం కొనసాగాలి, పాలన మరింత లోతుగా ప్రజలకు చేరాలి, అన్ని ప్రయత్నాలలో ప్రజల విశ్వాసమే కేంద్రంగా ఉండాలి. అప్పుడే నక్సలిజం నీడ మనమీద మళ్ళీ ఎప్పటికీ పడకుండా చూడగలం. ఒకప్పుడు అంతులేనిదిగా అనిపించిన ఈ యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చేరింది. నిరంతర నిబద్ధత, సామూహిక సంకల్పంతో శాంతియుతమైన, సంపన్నమైన, నక్సల్ రహిత భారతదేశం కల సాకారమైంది.

