nm nn as

విజయం వెనుక ఆయన

Dilhi Celebsటీఎంసీకి కంచుకోటగా ఉన్న దక్షిణ బెంగాల్, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో పట్టు సాధించడం బిజెపికి ఎప్పుడూ సవాలే. ఇక్కడ నితిన్ నబీన్ తన నిర్వహణా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మమతా ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయని ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి కేంద్ర పథకాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ‘రాజకీయ ఘర్షణలే’ అడ్డంకి అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బెంగాల్‌లో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ నినాదానికి ఆయన కొత్త రూపునిచ్చారు. స్థానిక నేతలకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ‘బిజెపి బయటి పార్టీ కాదు, బెంగాల్ మట్టి నుంచి వచ్చిన పార్టీయే ‘ అనే నమ్మకాన్ని ఓటర్లలో కలిగించారు. 

‌‌కలిసివచ్చిన ఛత్తీస్‌గఢ్ అనుభవం 

ఇంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో బిజెపిని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో నబీన్ తన సంస్థాగత సామర్థ్యాన్ని చాటుకున్నారు. అక్కడ కాంగ్రెస్ కోటను కూల్చిన అనుభవాన్ని బెంగాల్‌లో ప్రయోగించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చడంలో ఆయన సఫలమయ్యారు. ఎన్నికల సమయంలో దిల్లీలో కూర్చోకుండా, బెంగాల్ జిల్లాల్లోనే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని రోజువారీ నివేదికలను స్వయంగా పర్యవేక్షించారు.

‌‌నబీన్: బిజెపి భవిష్యత్తు ముఖచిత్రం

‌ఈ అద్భుత విజయంతో నితిన్ నబీన్ కేవలం ఒక యువ నాయకుడు మాత్రమే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ల నమ్మకాన్ని నిలబెట్టిన సమర్థుడైన వ్యూహకర్త అని నిరూపించుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఆయన సాధించిన ఈ తొలి విజయం పార్టీలో ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సాంకేతికత, సమాచార విశ్లేషణతో పాటు సంప్రదాయ సంస్థాగత నిర్మాణాన్ని మేళవించి ఆయన ముందుకు సాగుతున్నారు. లక్నో నుండి కోల్‌కతా వరకు బిజెపి కార్యాలయాల్లో కనిపిస్తున్న ఈ సంబరాల వెనుక నితిన్ నబీన్ నెలల తరబడి చేసిన నిశ్శబ్ద కృషి, అనుసరించిన కచ్చితమైన వ్యూహం దాగి ఉన్నాయి.

‌‌సరికొత్త ఆరంభం

బెంగాల్ విజయం నితిన్ నబీన్ కు కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు, కొత్త బాధ్యతలకు ఆరంభం. క్రమశిక్షణ కలిగిన సంస్థ, స్పష్టమైన దార్శనికత ఉన్న నాయకత్వం ఉంటే ఏ ‘కంచుకోట’నైనా జయించవచ్చని ఆయన నిరూపించారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికల కోసం నబీన్ ఎలాంటి వ్యూహాలను రచిస్తారో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం బెంగాల్ ప్రజలు ‘నబీన్ నీతి’కి జై కొట్టారు.

‌‌పార్టీ అధ్యక్షుడిని సత్కరించిన మోదీ!

దేశానికి ప్రధానినైనా తానూ బిజెపి కార్యకర్తనే అనే సందేశాన్ని నరేంద్ర మోదీ అనేకసార్లు పంపారు. మోదీ మాటల కంటే ఆయన చేసే పనులే దేశవ్యాప్తంగా వేగంగా ప్రభావం చూపుతాయని ప్రతీతి. మే 4 సాయంత్రం పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించిన అనంతరం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ ఈ విషయాన్ని మరోసారి నొక్కిచెప్పారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ హృదయపూర్వకంగా అభినందించిన తీరు బిజెపి కార్యకర్తల నుంచే కాకుండా రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

దిల్లీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ప్రారంభమైన తరుణంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తన తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న నితిన్ నబీన్ ప్రధాని మోదీని సత్కరించేందుకు పూల మాలతో ముందుకు వచ్చారు. అయితే ఆ మాలను స్వీకరించేందుకు నిరాకరించిన ప్రధాని, తన చేతులతో స్వయంగా నితిన్ నబీన్ మెడలో ఆ మాలను వేశారు. ఒక్కసారిగా సభామందిరం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. పార్టీ వ్యవస్థలో అధ్యక్షుడికే తొలి గౌరవం దక్కాలనే బలమైన సందేశాన్ని ప్రధాని ఇచ్చారని అక్కడి కార్యకర్తలు తక్షణమే గుర్తించారు.

సత్కార క్రమాన్ని మార్చడం ద్వారా బిజెపి ‘సంస్థే ముందు’ అనే సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ మరోసారి చాటిచెప్పారు. వ్యక్తిగత ప్రాముఖ్యత కంటే సంస్థాగత క్రమశిక్షణ, సామూహిక నాయకత్వమే ముఖ్యమని ఆయన నిరూపించారు. ఎన్నికల విజయాలు అనేవి ‘కార్యకర్తలు’ నిర్మించిన పునాదికి, అధ్యక్షుడి నాయకత్వానికి దక్కిన గౌరవమని ఆ ఒక్క దృశ్యం ద్వారా స్పష్టమైంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు ముగిసిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ప్రధాని వచ్చారు. నితిన్ నబీన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి పరీక్షలోనే బెంగాల్‌లో నిర్ణయాత్మక విజయాన్ని, అస్సాంలో వరుసగా మూడోసారి అధికారాన్ని పార్టీకి అందించారు. ఈ సందర్భంగా ప్రధానిని గౌరవించాలనుకున్న అధ్యక్షుడికే తిరిగి గౌరవం ఇచ్చి, మోదీ ఒక రాజకీయ పాఠాన్ని నేర్పారు. “కాంగ్రెస్ కాలం నాటి వ్యక్తి-కేంద్రిత రాజకీయ సంస్కృతి స్థానంలో, సంస్థకే అగ్రతాంబూలం ఇచ్చే నూతన రాజకీయ ఒరవడికి ఇది నిదర్శనం” అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.