అసెంబ్లీ ఫలితాల్లో బిజెపి ప్రభంజనం
భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట.. మమతా బెనర్జీ అడ్డాగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడించింది. తృణమూల్ కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలించి బిజెపి పాగా వేసింది. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాంలో అధికారం నిలబెట్టుకుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ ప్రభుత్వానికే ప్రజలు జై కొట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గల ప్రజాదరణ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహాలు.. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మార్గనిర్దేశం.. సమర్థులైన స్థానిక నాయకత్వం.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల కృషి.. వెరసి బిజెపి విజయ దుందుభి మోగించింది. దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది.
కేంద్రంలో హ్యాట్రిక్ విజయాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజెపి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి, అందులో 15 రాష్ట్రాల్లో బిజెపి స్వతంత్రంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పాలన సాగిస్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో “సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్” నినాదంతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, అంతర్జాతీయ దౌత్య రంగాల్లో భారతదేశం అద్భుతమైన పురోగతితో దూసుకెళ్తోంది.
కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం నుంచి 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. మౌలికవసతుల రంగంలో ఎక్స్‌ప్రెస్ హైవేలు, వందే భారత్ రైళ్లు, కొత్త ఎయిర్‌పోర్టులు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకొచ్చాయి. అంతరిక్ష రంగంలో విజయాలు, జీ-20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించడం, ప్రపంచ వేదికలపై భారత ప్రభావం పెరగడం వంటి పరిణామాలు దేశ ప్రతిష్టను మరింత పెంచాయి. ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, బిజెపి పట్ల ప్రజల్లో ఆదరణకు దోహదం చేశాయి.
సంస్థాగతంగానూ బిజెపి విస్తరణను నిరంతరం కొనసాగుతోంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్యం అన్న తేడా లేకుండా దేశ నలుమూలలోకి పార్టీ చొచ్చుకుపోతుంది. ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ యువత, మహిళలు, మధ్యతరగతి, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల ఆదరణను చూరగొంటోంది. పార్టీ సిద్ధాంతాలు, జాతీయవాద భావజాలం, అభివృద్ధి కేంద్రిత రాజకీయాలు ప్రజల్లో బలమైన మద్దతు సంపాదిస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ బిజెపి ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగి తొలిసారి అధికారంలోకి వచ్చింది. అస్సాం, పుదుచ్చేరిలో అధికారాన్ని నిలబెట్టుకుంది. కేరళలో ఓట్లు, సీట్లు పెరిగాయి. ఈ ఫలితాలు రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందన్న ఆశలు మరింత పెరిగాయి. ఈ దిశగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో బిజెపి తెలంగాణ శాఖ ప్రజల్లో విశేష ఆదరణ చూరగొంటున్నాయి.
బెంగాల్‌లో తొలిసారి
పార్టీ | గెలిచిన స్థానాలు |
బిజెపి | 207 |
తృణమూల్ కాంగ్రెస్ | 80 |
కాంగ్రెస్ | 2 |
ఏజేయూపీ | 2 |
సీపీఐ(ఎం) | 1 |
ఏఐఎస్ఎఫ్ | 1 |
మొత్తం | 293 |
బెంగాల్ కోటను బిజెపి బద్దలు కొట్టింది. పశ్చిమ బెంగాల్‌లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ సుదీర్ఘ పాలనకు తెరదించి.. మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో రాష్ట్రంలో తొలిసారి సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
తనకు కంచుకోట లాంటి భవానీపుర్‌లో పోటీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తన ప్రత్యర్థి, ప్రతిపక్ష బిజెపి నేత సువేందు అధికారి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆమె 15,015 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమెతో పాటు దాదాపు 20 మంది మంత్రులు ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరి బహరంపుర్‌లో ఓడిపోయారు. సువేందు నందిగ్రామ్ లోనూ గెలిచి, ఆ నియోజకవర్గంపై తనకున్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. సువేందు అధికారి రెండు చోట్లా విజయం సాధించారు. బిజెపి సీనియర్ నేత దిలీప్ ఘోష్ ఈ ఎన్నికల్లో ఖరగ్ పూర్ సదర్ స్థానంలో 26 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. మాథాభంగా స్థానంలో కేంద్ర మంత్రి, బిజెపి నేత నిశిత్ ప్రమాణిక్ సునాయాస విజయం సాధించారు. పానీహాటీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా బరిలో దిగిన ఆర్జే కర్ ఆసుపత్రి హత్యాచార బాధితురాలి తల్లి రత్నా దేవ్‌నాథ్ విజయం సాధించారు.
ఉత్తర బెంగాల్ నుంచి జంగల్ మహల్ వరకు.. సరిహద్దు జిల్లాల నుంచి పారి శ్రామిక బెల్టుల వరకు అంతటా కమలం హవా సాగింది. అక్కడా ఇక్కడా అని కాకుండా సరిహద్దుల్లో, గిరిజన ప్రాంతాల్లో, పారిశ్రామిక కారిడార్లలో బిజెపి హవా కొనసాగింది. తృణమూల్‌కు ఇన్నాళ్లూ పెట్టని కోటల్లా ఉన్న ప్రాంతాల్లోనూ కాషాయ పార్టీ సత్తా చాటింది. కోల్‌కతాతోపాటు కొన్ని గ్రామీణ ప్రాంతాలకే తృణమూల్ పరిమితమైంది. బెంగాల్‌లో మెజారిటీ మార్కు 147 కాగా.. బిజెపి 207 సీట్లు సాధించింది. తృణమూల్ 80 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 2 స్థానాలు (ఫరక్కా, రాణీనగర్) గెల్చుకుంది. సీపీఎంకు ఒక స్థానం దక్కింది.
ముస్లిం మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లోనూ బిజెపి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. సంప్రదాయంగా తృణమూల్‌కు అండగా నిలిచే ఈ ప్రాంతాల్లో బిజెపి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. దశాబ్ద కాలంగా ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పుర్ జిల్లాల్లో ముస్లిం మైనారిటీలు ఏకపక్షంగా తృణమూల్‌కు మద్దతిస్తూ వస్తున్నారు. ఈ జిల్లాల్లో 50 శాతం ఓట్లు వారివే ఉంటాయి. 2021లోనూ ఈ ఓట్లన్నీ తృణమూల్‌కే పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో ఈ 3 జిల్లాల్లోని 43 సీట్లలో 19 చోట్ల బిజెపి జెండా ఎగిరింది. మాల్దాలో 6, ముర్షీదాబాద్ లో 9, ఉత్తర దినాజ్‌పుర్ లో 4 సీట్లు గెలిచింది. 2021లో ఈ ప్రాంతాల్లో కేవలం 8 సీట్లనే బిజెపి గెలుచుకుంది. అప్పట్లో 35 సీట్లలో తృణమూల్ ఆధిపత్యం కొనసాగింది. తాజా ఎన్నికల్లో తృణమూల్‌కు 22 సీట్లే దక్కాయి. మిగిలిన సీట్లను కాంగ్రెస్, ఏజేయూపీ గెలుచుకున్నాయి. మైనారిటీలు అధికంగా ఉన్న దక్షిణ 24 పరగణాలు, బీర్‌భూమ్ జిల్లాల్లోనూ బిజెపి గణనీయంగా సీట్లు సాధించింది. ఇక్కడ మైనారిటీ ఓట్లు చీలగా హిందువుల ఓట్లు ఏకపక్షంగా బిజెపికి దక్కాయి.
అస్సాంలో హ్యాట్రిక్
పార్టీ | గెలిచిన స్థానాలు |
ఎన్డీఏ | 102 |
బిజెపి | 82 |
బీఓపీఎఫ్ | 10 |
ఏజీపీ | 10 |
కాంగ్రెస్ | 19 |
ఏఐయూడీఎఫ్ | 2 |
ఆర్జెఆర్డీ | 2 |
ఏఐటీసీ | 1 |
మొత్తం | 126 |
ఈశాన్యంలో పెద్దన్నలాంటి రాష్ట్రం అస్సాంలో వరుసగా మూడోసారి కమలం వికసించింది. మోదీ చరిష్మాతో పాటు హిమంత బిశ్వ శర్మ కరిష్మా పార్టీకి విశేషంగా పనిచేసింది. రాష్ట్రంలో మెజారిటీ మార్కు 64కాగా బిజెపి కూటమి 102 సీట్లలో విజయం సాధించింది. బిజెపి సొంతంగా మెజారిటీ (82) సాధించడం విశేషం. జలూక్‌బరీలో వరుసగా ఆరోసారి హిమంత గెలిచారు. ఆయనకు లక్షకుపైగా మెజారిటీ వచ్చింది.
అస్సాం గెలిపించే బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి హిమంత అంతా తానై ప్రచారం చేయడంతోపాటు వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని విజయ పథంలో నడిపారు. 100 సీట్ల లక్ష్యంతో 3 ఇంజిన్లను నమ్ముకున్నారు. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ఆయన ఓరునోడొయ్ నగదు బదిలీ పథకం కింద 40 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.9,000 చొప్పున వేశారు. ఇది మొత్తంగా రూ.3,600 కోట్లు. మళ్లీ అధికారంలోకి వచ్చాక నెలకు రూ,3,000 ఇస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఏటా బిహు, దుర్గాపూజ సమయాల్లో రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. జాతి-మాటీ-భేటీ (సంఘం-గుర్తింపు, భూమి, మాతృభూమి-మూలాలు) పేరుతో అస్సాం గుర్తింపును కాపాడతామని హిమంత హామీ ఇచ్చారు. ఈ హామీలు సత్ఫలితాలిచ్చాయి. అక్రమ వలసలపై వ్యతిరేకత స్థానిక అస్సామీల అస్థిత్వ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశీ ముస్లింల వలసలకు వ్యతిరేక ఉద్యమంగా ఇది రూపుదాల్చింది. రాష్ట్రంలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత 29శాతం మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న వారిని ఆకర్షించడంలో హిమంత సఫలమయ్యారు. మన ఉద్యోగాలు, భూములు మనకే అంటూ ఆయన ఇచ్చిన హామీ బాగా పని చేసింది. 126 స్థానాలున్న అస్సాంలో 82 సీట్లలో బిజెపి సొంతంగా విజయం సాధించింది. ఎన్డీఏ కూటమిలోని అస్సాం గణ పరిషద్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ చెరీ 10 సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 19 స్థానాలకే పరిమితమైంది.
ఎన్డీయేదే పుదుచ్చేరి
పార్టీ | గెలిచిన స్థానాలు |
ఏఐఎన్ఆర్సీ | 12 |
బిజెపి | 4 |
డీఎంకే | 5 |
టీవీకే | 2 |
ఇతరులు | 7 |
మొత్తం | 30 |
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి మరోసారి రంగసామికే పట్టం కట్టింది. ఎన్డీయే కూటమిలో ఉన్న ఆయన రెండోసారి వరుసగా అధికారం చేపట్టనున్నారు. ఈ కూటమి 18 చోట్ల విజయం సాధించింది. 30 స్థానాలున్న పుదుచ్చేరిలో ఎన్డీఏ భాగస్వామి అయిన ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్(ఏఐఎన్‌ఆర్‌సీ) 12 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. బిజెపి 4 సీట్లలో గెలిచింది. అన్నాడీఎంకే, ఎల్‌జేకే చెరొక సీటు గెలుచుకున్నాయి. ఎన్డీయే కూటమిలోని ఏఐఎన్‌ఆర్‌సీ, బిజెపి, అన్నాడీఎంకే, ఎల్‌జేకే పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంతో జరిగిన సీట్ల పంపిణీ విజయాన్ని మరింత సులభతరం చేసింది. నీటి ఏటీఎంలు, అటల్ క్యాంటీన్లు, మహిళలకు 2 ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు, బాలికలకు ఈ-స్కూటర్లు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్ల వంటి ఈ కూటమి హామీలు సైతం ఓటర్లను ఆకట్టుకున్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందని గృహిణులకు ఇచ్చే ఆర్థికసాయం రూ.1,000 నుంచి రూ.2,500కు పెంచుతామని చెప్పడం, మత్స్యకారుల చిరకాల డిమాండుకు అనుగుణంగా వెనుకబడిన జాబితాలో చేరుస్తామని ప్రకటించడం ఓటర్లను ఆకర్షించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ఆదరణకు తోడుగా సీఎం రంగసామి నాయకత్వం, ఆయనకున్న క్లీన్ ఇమేజి కూడా కీలకపాత్ర పోషించాయి. ఈ విజయంతో ఆయన ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్, డీఎంకే కూటమి రెండో స్థానానికే పరిమితమైంది. ఇండీ కూటమిలోని విభేదాలు కాంగ్రెస్ – డీఎంకేలకు ప్రతికూలంగా మారి మరోసారి నిరాశ తప్పలేదు. డీఎంకే 5, కాంగ్రెస్ 1 స్థానానికి పరిమితమయ్యాయి. టీవీకే 2 సీట్లు గెలుచుకుంది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి, ఆలిండియా ఎన్నార్ కాంగ్రెస్ అధినేత ఎన్.రంగసామి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయఢంకా మోగించారు. తట్టంచావడిలో 4,441 ఓట్ల మెజారిటీతో రంగస్వామి గెలవగా.. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వి.వెద్యలింగం 4వ స్థానంలో నిలిచారు. మంగళం నియోజకవర్గంలో 7,050 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తమిళనాడులో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీవీకే 108 సీట్లను సాధించింది. తమిళనాడులో మెజారిటీ మార్కు 118. అయితే, మెజారిటీ మార్కుకు 10 సీట్లు తక్కువ వచ్చాయి. అధికారంలో ఉన్న డీఎంకే 59 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఏఐడీఎంకే 47 స్థానాల్లో గెలిచింది. తమిళనాడులో ఈసారి బిజెపి 1 సీటు గెలిచింది. విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలిచారు. కొళత్తూరులో పోటీ చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘోరంగా ఓడిపోయారు. ఎడప్పాడిలో తలపడిన ఏఐఏడీఎంకే అధినేత పళనిసామి 98 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు.
ఇక కేరళలో ఆనవాయితీని పునరుద్ధరిస్తూ అధికార మార్పిడి జరిగింది. ఈసారి యూడీఎఫ్ విజయం సాధించింది. 140 స్థానాలున్న కేరళలో యూడీఎఫ్ 102, ఎల్డీఎఫ్ 35 స్థానాలు దక్కించుకున్నాయి. ఈ సారి బిజెపి 3 సీట్లు గెలిచి కేరళలో మూడవ ప్రత్యామ్నాయంగా అడుగులు వేస్తోంది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే.. ఎన్డీయేతర పార్టీలున్న రాష్ట్రాల్లో మాత్రం అధికార మార్పిడి కోరుకున్నారు. ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ తాము పోటీ చేసిన స్థానాల్లో ఘోర పరాజయం పాలవడం ఇండీ కూటమి పార్టీల పట్ల ప్రజల్లో ఎంతటి అసంతృప్తి ఉందో అర్థమవుతుంది. ఆయా రాష్ట్రాల్లో పలువురు మంత్రులు కూడా మట్టికరిచారు.
21కి చేరిన ఎన్డీయే పాలిత రాష్ట్రాలు
పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించడంతో దేశంలో ఎన్డీయే పాలనలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 21కి పెరిగింది. బెంగాల్ విజయంతో బిజెపి స్వతంత్రంగా పాలించే రాష్ట్రాలు 15కు చేరనున్నాయి. అదనంగా బిహార్‌లో జేడీయూ, ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ తదితరాలతో కలిపి బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 21కి చేరింది. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

