అబ్‌కీ బార్ బిజెపి సర్కార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరోజు తెలంగాణ పర్యటన బిజెపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పశ్చిమ బెంగాల్ బిజెపి విజయాన్ని ప్రస్తావిస్తూ “తదుపరి లక్ష్యం తెలంగాణ” అని సంకేతాలు ఇవ్వడం కార్యకర్తల్లో జోష్ నింపింది. “అబ్‌కీ బార్ బిజెపి సర్కార్” అంటూ రాష్ట్రంలో అధికారమే లక్ష్యమని స్వయంగా మోదీ ప్రకటించడం తెలంగాణకు పార్టీ ఎంత ప్రాధాన్యతనిస్తుందో చెప్పకనే చెప్పారు. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సభకు హాజరైన భారీ జనసందోహం మధ్య మోదీ ప్రసంగిస్తూ.. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర, కుటుంబ రాజకీయాలపై విమర్శలు, కాంగ్రెస్–బీఆర్ఎస్‌లను ఒకే గాటన కట్టడం వంటి అంశాలతో రాష్ట్రంలో బిజెపినే ప్రత్యామ్నాయం అన్న సందేశం ఇచ్చారు.
ఈ పర్యటనలో మోదీ రూ.9,400 కోట్ల తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో వరంగల్ టెక్స్‌టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, కీలకమైన రైల్వే, జాతీయ రహదారి ప్రాజెక్టులున్నాయి. తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందనడానికి ఈ ప్రాజెక్టులు నిదర్శనంగా నిలుస్తాయి. బెంగాల్ విజయానంతరం తెలంగాణపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో మోదీ సభ విజయవంతం కావడం రాష్ట్రంలో కమలం వికాసానికి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి, బీఆర్ఎస్ బలహీనత, కేంద్ర పథకాలు, మోదీ వ్యక్తిగత ఇమేజ్ — ఇవన్నీ తెలంగాణలో బిజెపికి అనుకూల రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నాయి. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం పక్కా అన్న విశ్వాసం సర్వత్రా వ్యక్తమవుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో మార్పు అనివార్యమని, తెలంగాణలో కూడా “అబ్‌కీ బార్ బిజెపి సర్కార్” అనే నినాదం ఇప్పుడు ప్రజల సంకల్పంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి చారిత్రాత్మక విజయాన్ని సాధించినట్లే, తెలంగాణలో కూడా ప్రజలు కుటుంబ, అవినీతి రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశాయని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. మే 10న ప్రధాని ఒకరోజు తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బిజెపి బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చిన మోదీ తన కోసం కార్యకర్తలు, చిన్నారులు తీసుకొచ్చిన పెయింటింగ్స్ చూసి ముచ్చటపడ్డారు. ఆ చిత్రాలను సేకరించాలని ఎస్పీజీ అధికారులను ఆదేశించారు. ఆ పెయింటింగ్స్ పై చిత్రకారుల అడ్రస్ ఉంటే వారికి స్వయంగా లేఖలు రాస్తానని తెలిపారు.
“నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దపెట్టున నినాదాలు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడిందని, అక్కడి చారిత్రాత్మక విజయోత్సాహం ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ బిజెపి కార్యకర్తల్లో అపారమైన జోష్ కనిపిస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు బిజెపి అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. అసోంలో బిజెపి ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా “అబ్‌కీ బార్ బిజెపి సర్కార్” అని స్పష్టంగా చెబుతున్నారని అన్నారు.
బిజెపిపై పెరుగుతోన్న విశ్వాసం
పశ్చిమ బెంగాల్‌లో బిజెపి విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను సంవత్సరాల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబ వాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని విమర్శించారు. అదే మార్గంలో టీఎంసీ కూడా నడిచిందని, ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు దక్షిణాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బిజెపిని చిన్న పార్టీగా చూసేవారని, కానీ నేడు దేశవ్యాప్తంగా బిజెపిపై ప్రజల్లో అపారమైన విశ్వాసం పెరిగిందని చెప్పారు. అసోంలో కొద్దిమంది ఎమ్మెల్యేలతో ఉన్న బిజెపి ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. బెంగాల్‌లో మూడు ఎమ్మెల్యేల స్థాయి నుంచి బిజెపి 200కి పైగా స్థానాలకు చేరుకుందని గుర్తు చేశారు.
తెలంగాణకు ప్రత్యేక స్థానం
తెలంగాణకు బిజెపి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని అన్నారు. దేశంలో బిజెపికి కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో తెలంగాణ నుంచే ఒక ఎంపీ గెలిచారని గుర్తుచేశారు. మిగతా దేశంలో అంతగా మద్దతు లేకపోయినా తెలంగాణ ప్రజలు బిజెపికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి దాదాపు సగం మంది ఎంపీలు బిజెపి తరఫున గెలిచారని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బిజెపి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మోసపూరిత వాగ్దానాలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ప్రధాని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. “రాష్ట్ర అభివృద్ధే దేశ అభివృద్ధి” అనే సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో తెలంగాణ, హైదరాబాద్ కీలక పాత్ర పోషించాలని కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
తెలంగాణ పర్యటన సందర్భంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని మోదీ ప్రజలకు గుర్తుచేశారు. అందులో దేశవ్యాప్తంగా 14 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయని, వాటిలో ఒకటి తెలంగాణలో ఏర్పాటు అవుతోందన్నారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో వాహన తయారీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు ఆధునిక పరిశ్రమల ఎకోసిస్టమ్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ఇది లక్షలాది యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రైతులు, మధ్యతరగతికి వరంగా మారుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆమోదించిన ఏడు పీఎం మిత్ర టెక్స్‌టైల్స్ పార్కుల్లో ఒకటి వరంగల్‌లో ఏర్పాటు అవుతోందని ప్రధాని వెల్లడించారు. ఇది తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త ఊపునిస్తుందని, ముఖ్యంగా పత్తి రైతుల భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తి, నాణ్యత పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల మిషన్‌ను ఆమోదించిందని, దీని ద్వారా తెలంగాణలోని లక్షలాది పత్తి రైతులకు లాభం చేకూరుతుందని చెప్పారు.
కాంగ్రెస్ విభజన రాజకీయాలు
బిజెపి అభివృద్ధి, ఉపాధి సృష్టిపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారని, ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ మోడల్ ఒకటేనని — ముందుగా ఆకాశంలోని చుక్కులు తీసుకొస్తామంటూ అలవికాని హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని మర్చిపోవడమే అని ఆరోపించారు. హిమాచల్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు దేశాన్ని విభజించే రాజకీయాలకు కేంద్రంగా మారిందని మోదీ మండిపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కట్టర్ ముస్లిం లీగ్ గా ముందుకెళ్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను “ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్”గా అభివర్ణిస్తున్నారని అన్నారు. మావోయిజం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందన్నారు. తెలంగాణ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలా కాలం క్రితమే అంతం చేసేవారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు.
దేశహితం కోసం పని చేద్దాం
ప్రస్తుతం భారత్ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఉక్రెయిన్ యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని చెప్పారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా రైతులకు భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తోందన్నారు. ప్రపంచ మార్కెట్లో రూ.3000 ఉన్న ఎరువుల సంచిని భారత రైతులకు రూ.300 లోపే అందిస్తున్నామని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలు కొన్ని సంకల్పాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించాలని, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రైల్వే సరుకు రవాణాను వినియోగించాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కోరారు. కరోనా కాలంలో అలవాటు అయిన వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ సమావేశాలను మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మరోవైపు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని ప్రధాని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలు, విదేశీ వస్తువుల కొనుగోళ్లు తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. “వోకల్ ఫర్ లోకల్”ను మరింత బలంగా అమలు చేయాలని, రోజువారీ జీవితంలో విదేశీ ఉత్పత్తుల స్థానంలో స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి నాశనం అవుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువుల వినియోగాన్ని 25% నుంచి 50% వరకు తగ్గించి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు సూచించారు. డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి పంపులను ఉపయోగించాలని కూడా కోరారు. ప్రపంచ సంక్షోభాల సమయంలో ప్రతి పౌరుడు దేశహితం కోసం కట్టుబడి పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇది ఒక్క ప్రభుత్వానికి, ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించిన బాధ్యత అని అన్నారు. ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ దేశ ప్రయోజనాల కోసం ఏకమై పని చేస్తే భారత్ ప్రతి సంక్షోభాన్ని జయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా సభకు భారీగా తరలివచ్చిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయ మార్పునకు నాంది
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజల ఉత్సాహం తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది పలుకుతోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో ఈ భారీ జనసంద్రం రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అన్న స్పష్టమైన సంకేతమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన నుంచి భారతదేశంలో విలీనమైన చారిత్రాత్మకమైన సెప్టెంబర్ 17 తేదీనే మోదీ జన్మదినం కూడా కావడం తెలంగాణ ప్రజలకు మరింత గొప్ప భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తోందన్నారు. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధికి దోహదపడే రూ.9,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయడం పట్ల బిజెపి తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం జాతిని విభజించే శక్తులపై పోరాటమని స్పష్టం చేశారు. ఒకప్పుడు దేశాన్ని నక్సలిజం, వామపక్ష తీవ్రవాదం వంటి శక్తులు భయపెట్టాయని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం “నక్సలైట్ ముక్త్ భారత్”, “లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం ముక్త్ భారత్” దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దక్షిణాది-ఉత్తరాది పేరుతో దేశాన్ని విభజించే రాజకీయ శక్తులతో పాటు కుటుంబ పాలన పేరుతో దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ వంటి పార్టీలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
11 ఏళ్లలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లు
అలవికాని హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ అవినీతిపరుల చేతికి వెళ్లింది. రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ముస్లింల సమావేశంలో ‘సర్’ని అడ్డుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు సైతం ఆమోదించిన ‘సర్’ని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యతిరేకించడం సిగ్గుచేటు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లు ఇచ్చింది. రాష్ట్రంలో జాతీయ రహదారులకు రూ.1.85 లక్షల కోట్లు కేటాయించింది. అన్ని జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తున్నాం. రాష్ట్రానికి ఐదు వందే భారత్, నాలుగు అమృత్ భారత్ రైళ్లను కేటాయించాం. వారం రోజుల్లో మరో ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించుకోబోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక కొత్త రైల్వే స్టేషన్ అయినా నిర్మించారా? మోదీ ప్రభుత్వం.. రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్లను కేటాయిస్తే.. అందులో మూడు తెలంగాణకు కేటాయించారని గర్వంగా చెబుతున్నా. రూ.1.55 లక్షల కోట్లతో రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డపై బుల్లెట్ రైళ్లు రానున్నాయి. ఇన్నేళ్ల తమ పాలనలో రాహుల్ గాంధీ ఇచ్చారా? కేసీఆర్ తీసుకొచ్చారా? అలంపూర్ జోగులాంబ, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాం” అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
అవినీతి పార్టీలను బూడిద చేద్దాం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ.. “బెంగాల్లో బిజెపి గెలుపుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయి. దిల్లీ నుండి మోదీ నిధులు తెస్తుంటే, కాంగ్రెసోళ్లు తెలంగాణ సొమ్మును దిల్లీకి పంపుతున్నారు. భయపెడితే భయపడటానికి నేను ఫాంహౌస్‌లో ఎలుకను అనుకుంటున్నారా? అయ్య ఆస్తి మీద.. అయ్య పేరు మీద ఎదిగిన నాయకుణ్ణి కాదు. బిజెపి సైనికులం, మోదీ శిష్యులం. ప్రాణం పోయినా తప్పు చేయం. తప్పు చేసే వాళ్లను కూడా వదిలిపెట్టబోం. బిజెపి తలదించుకునే పని అసలే చెయ్యం. అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేస్తూ తెలంగాణను ముంచినోళ్లే ఎదురుదాడి చేస్తుంటే, ఏ తప్పు చేయనోళ్లం ఊరుకుంటామా? అగ్గి పుట్టిద్దాం.. ఆ అగ్గిలో అవినీతి, కుటుంబ పార్టీలను కాల్చి బూడిద చేద్దాం! మీరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా “తగ్గేది లే”. బరాబర్ బరిగీసి నిలబడతాం… కలబడతాం. మోదీ నాయకత్వంలో నితిన్ నబీన్ ఆధ్వర్యంలో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతాం.” అని అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారంటీ
బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. “మూడోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా కాషాయమయం అవుతోంది. తెలంగాణలోనూ బిజెపి ప్రభుత్వం ఎందుకు రాకూడదనే పిలుపుతో రాష్ట్రానికి మోదీకి వచ్చారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ ప్రజల పరిస్థితి మరింత దిగజారింది. తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారంటీ. మోదీతో కలిసి వస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. రాష్ట్రంలో అధికార పార్టీ ఓ వర్గానికి కొమ్ము కాస్తోంది. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలి.” అని అన్నారు.
తెలంగాణ కలలు సాకారం కాలేదు!
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. “ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడంతో ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సాధించుకున్న తెలంగాణ ప్రజల కలలు ఇప్పటికీ నిజం కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలతో మోసం చేసింది. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావాలి.” అని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కన్నీళ్లే
బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. “మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బిజెపి అధిక మెజారిటీ సాధిస్తోంది. మోదీపైన జనానికి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల గురించి రేవంత్ రెడ్డి సర్కారుకు ఆలోచన లేదు. ఆనాడు కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని కేసీఆర్ ఎలా దోచుకున్నారో.. అంత కంటే ఎక్కువగా కాంగ్రెస్ దోచుకుంటోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల కన్నీళ్లు కనిపిస్తున్నాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సైతం చెల్లించడం లేదు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రం కోలుకోవాలంటే బిజెపి అధికారంలోకి రావాలి.” అని అన్నారు.


