తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన రోజే అసలైన పండుగ
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన రోజే అసలైన పండుగ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. కార్యకర్తల్లో ఉన్న ఈ పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోందన్నారు. బిజెపి క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉందని, రాబోయే జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్ల ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27న బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది కేక్ కట్ చేశారు. తన జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని, సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న ఎన్. రాంచందర్ రావుకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నినాదాలతో ఎయిర్పోర్ట్ పరిసరాలు హోరెత్తాయి. శంషాబాద్ విమానాశ్రయం నుండి బిజెపి రాష్ట్ర కార్యాలయం (నాంపల్లి) వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. దారి పొడవునా ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపారు. “నా రాజకీయ జీవితంలో పుట్టినరోజు వేడుకలను ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జరుపుకోలేదు. కార్యకర్తల ప్రేమ, అభిమానం, ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రాజకీయాల్లో కొన్ని విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నాం. ఒక పార్టీ నాయకుడు అసెంబ్లీకి వస్తే అది పెద్ద న్యూస్ అవుతోంది, ఆయన సొంత పార్టీ ఆఫీసుకి వస్తే.. అది కూడా పెద్ద న్యూస్ అవుతోంది. ఈ తరహా రాజకీయాలు ప్రజలకు మేలు చేయవు. ప్రజలకు కావాల్సింది నిత్యం అందుబాటులో ఉండే సేవకులు. ఆ నిరంతర ప్రజా సేవకుడే నరేంద్ర మోదీ. ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీల దుకాణాలు మూతపడటం ఖాయం. తెలంగాణ ప్రజలు బిజెపిని ఆదరించి, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనమందరం ఇదే ఉత్సాహంతో పని చేసి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలి.” అని రాంచందర్ రావు అన్నారు.

