రైతులు చస్తున్నా స్పందించరా?
రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మండుటెండలో రైతులు అరిగోస పడుతున్నా, వడదెబ్బకు తాళలేక చచ్చిపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాలు, తరుగు పేరుతో పెద్ద ఎత్తున కటింగ్ చేస్తూ రైతులను దోచుకుంటున్నా, వడ్ల కొనుగోలు కోసం టోకెన్లు ఇవ్వడానికి కూడా దళారులు కమీషన్లు దండుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మే 5న కరీంనగర్ లోని ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న వెతలను కళ్లారా చూశారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించని విషయాన్ని గమనించారు. వడ్ల కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నామని కేంద్ర మంత్రి వద్ద రైతులు వాపోయారు. తాలు, తరుగు పేరుతో బస్తాకు నాలుగైదు కేజీలు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో రైతు సగటున రూ.20 వేలకుపైగా నష్టపోయే దుస్థితి నెలకొందన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. మండుటెండలో రోజుల తరబడి వడ్లు విక్రయించేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి స్పందిస్తూ “ఇంకెంతమంది రైతులను బలి కొంటారు? రైతులు చస్తున్నా వడ్లను కొనుగోలు చేయరా? కొనుగోలు కేంద్రాల వద్ద అరిగోస పడుతున్నా స్పందించరా? ప్రతి గింజకు కేంద్రమే పైసలిస్తుంటే కొనడానికి మీకున్న ఇబ్బందేమిటి? వడ్లు కొన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తున్నాం కదా? వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళితే మంత్రులను రైతులు కొట్టేటట్లు ఉన్నారు. రైతులను నట్టేట ముంచారు. చేతికి పంట వచ్చేదాకా ఒక టెన్షన్… చేతికొచ్చాక అమ్ముకోవడానికి పడిగాపులు కాయాలా? 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే…ఇప్పటిదాకా 15 లక్షల మెట్రిక్ టన్నులే కొంటారా? కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్లు ఇవ్వడానికి కూడా కమీషన్లు దండుకుంటున్న దుర్మార్గులు. తాలు, తరుగు, తేమ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నా స్పందించరా? వాస్తవాలు మాట్లాడితే మాపై ఎదురు దాడి చేస్తారా? రైతులు చచ్చిపోతుంటే కనీసం స్పందించాలనే సోయి కూడా లేదా? ప్రభుత్వం వెంటనే యుద్ద ప్రాతిపదికన వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలి. తాలు, తరుగు, తేమ పేరుతో కటింగ్ లేకుండా వడ్లకు కనీస ధర చెల్లించాలి.
విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై ఎంక్వైరీ కమిషన్ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర దాటినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము మీకు లేదా? కేసీఆర్ తో ఇన్నాళ్లు బేరసారాలాడారా? బేరసారాలు చెడిపోయాయి కాబట్టే కేంద్రానికి లేఖ రాస్తున్నారా? మా భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ ను కాల్చాలనుకుంటున్నారా? ఐదు రాష్ట్రాల ఫలితాలను డైవర్ట్ చేసేందుకే సీబీఐ డ్రామాలు. రేవంత్ రెడ్డి… మీకు కేసీఆర్ ను అరెస్ట్ చేయడం చేతగాదని ఒప్పుకుంటారా? అదే విషయాన్ని కేంద్రానికి రాసే లేఖలో చెప్పాలి. రేవంత్ రెడ్డికి చేతగాదని ఒప్పుకుని కేంద్రానికి లేఖ రాస్తే సీబీఐ విచారణపై కేంద్రం స్పందిస్తుంది.” అని అన్నారు.

