Pralhad joshi

వికసిత్ భారత్ అంటే సంక్షేమం కూడా

Pralhad joshiబెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన 97 లక్షల మంది సరైన పత్రాలు సమర్పించకపోవడం అక్కడ సమస్య ఉన్నది అనడానికి స్పష్టమైన సంకేతమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. తొలగించిన వాటిలో 63 శాతం హిందూ ఓట్లు ఉన్నాయని తెలిపారు. తొలగింపులే కాదు, చేరికలు కూడా జరిగాయన్నారు. బెంగాల్‌లో బిజెపి గెలవలేదని భావించేవారని, కానీ ఇప్పుడది సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై మరింత దృష్టి సారిస్తామని వెల్లడించారు. 2012లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ పీక్ డిమాండ్ 256 గిగావాట్లు ఉన్నప్పుడు, మొత్తం గ్రిడ్ కుప్పకూలిందని, ఉత్తర భారతదేశం అంధకారంలో మునిగిపోయిందని అన్నారు. కానీ నేడు 256.4 గిగావాట్ల పీక్ డిమాండ్ ను విజయవంతంగా తట్టుకున్నామని, ఇది వ్యవస్థాగత మెరుగుదలకు నిదర్శనంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయాలు, పునరుత్పాదక ఇంధన రంగంపై అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం, మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై పార్టీ వైఖరిని వివరించారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు రాష్ట్రాల్లో మీ పార్టీ అద్భుతమైన పనితీరు కనబరిచింది. మీకు అనుకూలంగా పని చేసిన అంశాలు ఏంటి?

జ: అస్సాం విషయానికి వస్తే అది కేవలం సుపరిపాలన వల్లే సాధ్యమైంది. ఉద్దేశాలు మంచివైతే, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ, నిజాయితీగా పని చేస్తే, చివరికి లభించే ఫలితం ఇలాగే ఉంటుంది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని చూడండి. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని ఇప్పుడు ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ అహంకారమే దానికి పతనానికి కారణమైంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో అది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత. అక్కడి తృణమూల్ ప్రభుత్వ అహంకారం, అణచివేత, శాంతిభద్రతల విషయంలో వైఫల్యం వంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. ప్రజలు నిజంగా విసిగిపోయారు. గతంలో వారిని ఎప్పుడూ స్వేచ్ఛగా ఓటు వేయనివ్వలేదు. కానీ ఈసారి యంత్రాంగం, ముఖ్యంగా ఎన్నికల సంఘం, స్వేచ్ఛాపూరిత, పారదర్శక ఓటింగ్‌కు అద్భుతమైన ఏర్పాట్లు చేయడంతో ప్రజలు పెద్దయెత్తున తరలివచ్చి ఓటు వేశారు. అక్కడ ఏకంగా 93 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా ఈ సాంకేతిక యుగంలో, గతంలోలాగా ఎవరైనా వచ్చి దొంగ ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఈసారి మా వ్యూహం భిన్నంగా ఉంది, కొంతమంది కేంద్ర మంత్రులను అక్కడికి పంపించాం. చాలా కష్టపడ్డాం. నిరంతర పర్యవేక్షణ కొనసాగింది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా బిజెపి తరఫున ఎవరో ఒకరు క్రమం తప్పకుండా బెంగాల్‌కు వెళ్తూనే ఉన్నారు. టీఎంసీ గూండాలు ప్రజలపై దాడి చేసినప్పుడల్లా మేం అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించాం. కేంద్ర హోంమంత్రి 15 రోజులకు పైగా అక్కడే ఉండి రోజంతా శ్రమించారు. మాకు అటువంటి బలమైన విజయకాంక్ష ఉంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌లో బిజెపి గెలవాలని మేం బలంగా భావించాం. బిజెపికి, ఇతర పార్టీలకు ఉన్న వ్యత్యాసం ఇదే.

ప్ర: గత ఆర్థిక సంవత్సరంలో ఆహార రాయితీ రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంది. అధికారిక అంచనాల ప్రకారం తీవ్ర పేదరికం 5 శాతంకి తగ్గినట్టు చూపిస్తుండగా, మీరు ఇప్పటికీ 81 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. రాయితీ ఆహార ధాన్యాలు అవసరమైన వారు ఇంత పెద్ద సంఖ్యలో ఉండకపోవచ్చు కాబట్టి ఈ వాస్తవాన్ని ప్రతిబింబించేలా జాతీయ ఆహార భద్రతా చట్టంలో మార్పులపై చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని మీరు అనుకోవడం లేదా?

జ: దీనికి ప్రధానమంత్రే స్వయంగా పార్లమెంటులో సమాధానం ఇచ్చారు. 2014 నుండి 2019 వరకు మొత్తం వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. 2019 నుండి 2024 వరకు అసలైన సంస్కరణలు, ప్రజల సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలు చేశాం. 2019 నుండి 2024 మధ్య గణాంకాలను చూస్తే బహుముఖ పేదరికం తగ్గినట్లు స్పష్టమవుతోంది. దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వల్ల వారు ఆదా చేస్తున్న డబ్బును, తమ పిల్లల కోసం, పాలు, గుడ్లు లేదా నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేస్తున్నారు. ‘వికసిత్ భారత్’ అంటే కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదు, ప్రజల సంక్షేమం కూడా. ప్రజలకు ఒకవేళ రేషన్ వద్దు అనుకుంటే వారి కార్డులను రద్దు చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలకు కచ్చితంగా చెప్పాను. అలాగే వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయడానికి ఈ రేషన్ కార్డును మరే ఇతర అవసరాలకూ గుర్తింపు పత్రంగా ఉపయోగించకూడదని స్పష్టం చేశాను.

ప్ర: బెంగాల్‌లో జరిగిన ఎస్ఐఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియలో వ్యత్యాసాల కారణంగా 27 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. వారు మళ్ళీ తమ పేర్లను చేర్చుకునేందుకు అప్పిలేట్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించాల్సి ఉంది, కానీ సమయాభావం వల్ల అది సాధ్యం కాలేదు. అయితే దాదాపు 1,600 పేర్లు మళ్ళీ చేర్చారు. మన దేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉంది. కానీ లక్షల మంది అర్హులైనప్పటికీ ఓటు వేయలేకపోయారు. రాజ్యాంగ పరంగా వారి హక్కులకు ఇది భంగం కాదా? దీనిపై మీ అభిప్రాయం?

జ: ఈ ప్రక్రియ అంతా అత్యంత శాస్త్రీయంగా జరిగింది. సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించారు. మమతా బెనర్జీ కోర్టుకు వెళ్లినప్పుడు, సుప్రీంకోర్టు అన్ని ఏర్పాట్లు చేసింది. కోర్టు పర్యవేక్షణలోనే న్యాయాధికారులను నియమించారు. అయితే, కేవలం ఎస్ఐఆర్ ఆధారంగానే ఒక పార్టీ గెలిచే అవకాశం లేదు. తమిళనాడులో ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇక్కడ (బెంగాల్లో) అది 97 లక్షలు. అందులో 63 శాతం హిందూ ఓట్లు ఉన్నాయి. కొంతమంది ముస్లింలు తృణమూల్ లేదా కాంగ్రెస్‌తో ఉన్నారనే వాస్తవాన్ని దాచాల్సిన అవసరం లేదు. వారు బిజెపికి అనుకూలంగా ఉండరు. మేం వారికి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పటికీ ఇది జరుగుతోంది. అయితే ఈ 97 లక్షలమంది విషయానికి వస్తే, దీనిపై పూర్తి విచారణ జరిగింది. వారి వద్ద సరైన పత్రాలు ఉంటే, వారు ఆ సమయంలో సమర్పించాల్సింది. వారు పత్రాలను సరిగ్గా సమర్పించలేకపోయారనే వాస్తవమే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయనడానికి స్పష్టమైన సంకేతం. నిరూపితమైతే తప్ప, ఎవరినీ ఓటు వేయనివ్వలేరు. కచ్చితంగా కొన్ని పేర్ల తొలగింపులు జరిగాయి, కానీ అన్ని మతాలు, కులాలలో కొత్త చేరికలు కూడా జరిగాయి. 2010లో కారణం ఏదైనప్పటికీ ఓటరును జాబితా నుంచి తొలగించవద్దని ఒక సర్క్యులర్ ఉంది. దానిపై మేం అప్పట్లో పోరాడాం. ఆ నిబంధన వల్ల ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి పేరును జాబితా నుంచి తొలగించలేదు. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచే సహకరించి ఉంటే, ఈ ప్రక్రియ ఇంత ఆలస్యం అయ్యేది కాదని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను.

ప్ర: ప్రభుత్వం కొత్త, పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, మన దేశంలో బ్యాటరీ నిల్వ ఉత్పత్తి పెద్దగా జరగకపోవడం వల్ల మనం ఆ ఇంధనాన్ని నిల్వ చేసుకుని వాడుకోలేకపోతున్నామనే ఆందోళన ఉంది. ఎందుకంటే మనదేశంలో బ్యాటరీ స్టోరేజి సదుపాయాల ఉత్పత్తి పెద్దగా జరగడం లేదు. అలాగే పర్యావరణ హితమైనవిగా చెప్పే ప్రాజెక్టుల ఏర్పాటు ఎక్కువగా అటవీ ప్రాంతాలలో ఉంటున్నాయి. ముసాయిదా నోటిఫికేషన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ పశ్చిమ కనుమలలో ఇవి అమలు జరుగుతున్నాయనే ఆందోళనలు ఉన్నాయి. దీనిపై మీ వైఖరి ఏమిటి?

జ: సమీపంలో జలాశయం, డ్యామ్ లేదా నది ఉన్న చోట మాత్రమే మనం పంప్డ్ స్టోరేజ్ (హైడ్రోపవర్) ప్లాంట్లను ఏర్పాటు చేయగలం. అలా చేస్తున్నప్పుడు పర్యావరణపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. అయినప్పటికీ సుప్రీంకోర్టుకు చెందిన పర్యావరణ ధర్మాసనం (గ్రీన్ బెంచ్) ఇటువంటి చర్యలను సులభంగా అనుమతించదు. కాబట్టి మేం పర్యావరణం, అభివృద్ధి రెండింటినీ దృష్టిలో ఉంచుకుని సమతుల్య విధానాన్ని అవలంబిస్తాం. మేం ఏదైనా తప్పు చేస్తే ఎలాగూ అనుమతి లభించదు. ఇవన్నీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు. ప్రజలు కోర్టును ఆశ్రయిస్తారు.

బ్యాటరీ నిల్వ విషయానికి వస్తే, 2030 నాటికి మొత్తం బ్యాటరీ నిల్వ అవసరం 411 గిగావాట్-గంటలు (GWh) ఉంటుంది. 2014 కంటే ముందు మనదేశంలో కేవలం 2 గిగావాట్ మాడ్యూల్స్ మాత్రమే ఉత్పత్తి అయ్యేవి. ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం ద్వారా మేం భారతదేశంలోనే 44 గిగావాట్ల వరకు ఉత్పత్తి చేస్తాం. అయితే కొన్ని ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కీలకమైన ఖనిజాలు అవసరం, ఇందుకోసం జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో లిథియం తవ్వకాలు కూడా జరుపుతున్నాము.

ప్ర: అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన రంగంలో బొగ్గు వినియోగం కొనసాగడం వల్ల పునరుత్పాదక రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

జ: ఈ సమస్యకు పునరుత్పాదక ఇంధనమే నిజమైన, అతిపెద్ద పరిష్కారం కాబోతోంది. ఉదాహరణకు, ఈ రోజు మన మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 150 గిగావాట్లు. ఇటీవల అత్యధిక విద్యుత్ డిమాండ్ (పీక్ పవర్ డిమాండ్) 256.4 గిగావాట్లకు చేరుకుంది. 2012లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో పీక్ డిమాండ్ 256 గిగావాట్లు ఉన్నప్పుడు, మొత్తం గ్రిడ్ కుప్పకూలింది, ఉత్తర భారతదేశం అంధకారంలో మునిగిపోయింది. కానీ నేడు మేం ఒకే రోజులో పీక్ డిమాండ్ సమయంలో 256.4 గిగావాట్లను విజయవంతంగా తట్టుకున్నాం. దీనర్థం వ్యవస్థాగత మెరుగుదల జరిగింది. ఇందులో 33 శాతం పునరుత్పాదక ఇంధనం నుంచే లభించింది. అందుకే మేం ఇండక్షన్ స్టవ్‌లను, విద్యుత్ వాహనాలను పెద్దయెత్తున ప్రోత్సహిస్తున్నాం. ఈవీల అమ్మకాలు, వినియోగం గణనీయంగా పెరిగాయి. కానీ, మీరు నిజంగా పర్యావరణ హితంగా మారి, డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే పగటిపూట మీ ఈవీని ఛార్జ్ చేయండి. పీఎం సూర్య ఘర్ లేదా మీ సొంత ఇంటికప్పు సోలార్ ద్వారా సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేసుకుని, దానిని ఛార్జ్ చేయండి. ఇది కిలోమీటరుకు రూపాయి కంటే తక్కువ ఖర్చు అవుతుంది. అంటే మొదట మీరు డబ్బు ఆదా చేస్తున్నారు, తర్వాత పర్యావరణానికి సహాయం చేస్తున్నారు. దిగుమతులను తగ్గించడం ద్వారా దేశానికి కూడా సహాయం చేస్తున్నారు.

ప్ర: మనం ప్రతి సంవత్సరం సుమారు 1.5 కోట్ల బాసుమతియేతర (నాన్-బాస్మతి) బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాం. దీని సగటు ఆదాయం కిలోకు రూ.33-34 గా ఉంది. ఇది ఎలా సాధ్యం? బహిరంగ మార్కెట్‌లో ఆ ధరకు బియ్యం లభించవు. ఇది ప్రాథమికంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యమేనని, అది పక్కదారి పడుతోందని చాలా మంది నమ్ముతున్నారు. అంటే, పేదల పేరుతో ఇదంతా ఎగుమతులకు వెళ్తోందా?

జ: అందుకే బయోమెట్రిక్స్ నుంచి ఈ-పోస్ (ePOS), ఇప్పుడు సీబీడీసీ (CBDC) వరకు డిజిటల్ పద్ధతులకు మార్పు వేగంగా జరుగుతోంది. దీని వల్ల లీకేజీలను అరికట్టవచ్చు, రీసైక్లింగ్ జరగకుండా చూడవచ్చు. వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలి. రేషన్ దుకాణాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. మేం వారిని పనిచేసేలా ఒత్తిడి తెస్తున్నాం. ఇటువంటి అక్రమ పద్ధతులను నిరంతరం దాడులు చేసి అరికట్టాలని మేం రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పాం. మేం కస్టమ్స్‌కు కూడా ఆదేశాలు జారీ చేశాం. ఈ విషయంలో మేం ఆందోళన చెందుతున్నాం.

ప్ర: పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంచేందుకు, విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. ఇది విద్యుత్ కోతలకు, సరఫరా ఇబ్బందులకు దారితీస్తోంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

జ: కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్ వేయడానికి సమయం పడుతుంది, ఎందుకంటే చాలా అనుమతులు అవసరం అవుతాయి. అటవీ అనుమతులు ఉంటాయి, అది ఒక గ్రామం లేదా నగరం మీదుగా వెళితే ప్రజలు నిరసనలు చేపడుతారు. వీటన్నింటి మధ్యే మనం పనిచేయాలి. ఆ తర్వాత, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (పక్షి) కి సంబంధించి సుప్రీంకోర్టు స్టే ఉంది, అది ఇప్పుడు పరిష్కారమైంది. అది కాకుండా మేం గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1 (జీఈసీ-1) తో ముందుకు వెళ్తున్నాం. దీనిని మేం దాదాపు పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సహాయం అందించాం. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 2 అమలు జరుగుతోంది, గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 ఇప్పుడు క్యాబినెట్ ఆమోదానికి వెళుతోంది. ఇది దాదాపు రూ.57,000 కోట్ల బడ్జెట్ కలిగిన భారీ ప్రాజెక్ట్. మూడో అంశం బ్యాటరీ నిల్వ. బ్యాటరీ నిల్వ ఇప్పుడే ప్రారంభమవుతోంది, ఎందుకంటే మన సౌరవిద్యుత్ ఉత్పత్తి ఒకే సంవత్సరంలో 44 గిగావాట్లు పెరిగింది. సాయంత్రం వేళల్లో ఈ విద్యుత్ అందుబాటులో ఉండదు కాబట్టి ఈ విద్యుత్‌ను ఏమి చేయాలనే దానిపై ఇప్పుడు ఆలోచించడం జరుగుతోంది. కాబట్టి నేను విద్యుత్ మంత్రిత్వ శాఖకు రెండు సూచనలు చేశాను: సాయంత్రం 4, 5 గంటల మధ్య చేయగలిగే పనులకు రాయితీపై విద్యుత్ అందించవచ్చా? ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లలో చేసినట్లుగా. బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం వంటి పనులు ముందే చేసుకునేలా, మీ ఈవీలను ఛార్జ్ చేయడానికి ఆ విద్యుత్‌ను ఉపయోగించుకునేలా మనం రాష్ట్రాలను ప్రోత్సహించవచ్చా? అది కాకుండా బ్యాటరీల కోసం రూ.24,000 లేదా రూ.25,000 కోట్ల పీఎల్ఐ పథకం అమలవుతుందని నేను భావిస్తున్నాను. దీనిని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది, కానీ సోలార్ స్టోరేజ్ కోసం మార్గదర్శకాలను మేం అందిస్తున్నాం.

ప్ర: భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గణాంకాల ప్రకారం 80 శాతానికి పైగా పనీర్ నమూనాలు ఆహార భద్రతా పరీక్షలో విఫలమయ్యాయి. దీనిపై మంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది? ఇందులో పేర్కొన్న పెద్ద కార్పొరేషన్లపై ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా?

జ: ఎఫ్ఎస్ఎస్ఏఐ దీన్ని చూస్తోంది. ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. కానీ వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా, ఒక వినియోగదారుడిగా, మా ఎన్సీహెచ్ (జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్) చాలా ప్రాచుర్యం పొందిందని నేను చెప్పాలి. మేం సమస్యలపై వెంటనే స్పందించాం. పనీర్, ఇతర వస్తువులపై మాకు ఫిర్యాదులు వచ్చినప్పుడు, నేను జె.పి. నడ్డా (కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి) కి లేఖ రాశాను, ఆయన వెంటనే దానిపై చర్యలు తీసుకున్నారు. నమూనాలు సేకరించారు, దాడులు చేయించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అది ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ అయినా, కంపెనీ అయినా, లేదా ఒక చిన్న దుకాణదారుడైనా – ప్రజల ఆరోగ్యం, సంక్షేమం మాత్రమే అత్యంత ప్రధానమైనవి. ఒక కార్పొరేట్ హోటల్ కూడా ఇలాంటి పనులు చేస్తోందని మాకు ఫిర్యాదు వస్తే మేం వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. 

ప్ర: బెంగాల్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన అంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్న రెండు రాష్ట్రాలు కేరళ, తమిళనాడు. బిజెపి అక్కడ ఎందుకు ప్రయోజనం పొందలేకపోయింది?

జ: మేం రెండు రాష్ట్రాల్లోనూ గట్టి ప్రయత్నాలు చేశాం. నాకు గుర్తున్నంత వరకు, 70ల నుంచి ద్రవిడ పార్టీలు కాక ఇతర పార్టీలు ఎన్నిక కావడం లేదా ప్రజలను ఆకట్టుకోవడం అక్కడ చాలా కష్టంగా మారింది. కానీ మేం మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అయితే, టీవీకే (TVK – ఒక స్థానిక పార్టీ) ఈ రెండు పార్టీలను ఓడించగలదని ప్రజలు భావించారు. కానీ మేం చేతులు ముడుచుకుని కూర్చోము. హర్యానా లేదా మహారాష్ట్ర వంటి మాకు ఉనికి లేని లేదా జూనియర్ భాగస్వామిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా మేం మా బలాన్ని పెంచుకున్నాం. కొన్ని చోట్ల మాకు వేగంగా ఫలితాలు వచ్చాయి, కొన్ని చోట్ల విజయం సాధించడం కష్టమైన పనే, కానీ మేం అవరోధాలను అధిగమిస్తాం.

కేరళ విషయానికి వస్తే, తదుపరి ఎన్నికలు, రాబోయే లోక్‌సభ కోసం మా ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభమవుతాయి. పార్టీ ఎదుగుదల విషయంలో మోదీ జీ ఊరికే కూర్చోరు, మా లాంటి లక్షల మంది కార్యకర్తలను కూడా ఊరికే కూర్చోనివ్వరు. కాబట్టి మేమంతా కేరళకు వెళతాం. తమిళనాడులో ఓటమి ఎదురైనప్పటికీ మా ఓట్ల శాతం పెరిగింది. వచ్చే సారి మరింత మెరుగ్గా సన్నద్ధమవుతాం. ఇంతకుముందు బెంగాల్‌లో మేం గెలవలేమని ప్రజలు అనేవారు, కానీ అది సాధ్యమైంది. మేం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై మరింత దృష్టి సారిస్తాం.

ప్ర: ఎన్నికల ఫలితాల తర్వాత మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలు నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. అవి మళ్లీ వేగం పుంజుకుంటాయని అనుకుంటున్నారా?

జ: మొదటిగా, వాటిని వ్యతిరేకించిన వారికి ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా శిక్ష వేశారు. 1971 నుంచి సీట్ల సంఖ్య అలాగే ఉంది. అప్పుడు దేశ జనాభా 55 కోట్లు, నేడు 140 కోట్లకి చేరింది. దక్షిణాదిలో జాతీయ ఆకాంక్షల ప్రకారం మేం జనాభా నియంత్రణ బాగా చేసినందున మా జనన రేటు సాపేక్షంగా తక్కువగా ఉంది. అయినప్పటికీ, నా నియోజకవర్గంలో ఇప్పటికీ 21 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి డీలిమిటేషన్ చేయడం, సంఖ్యను పెంచడం వల్ల సమస్య ఏమిటి? వారి వ్యతిరేకత కేవలం డీలిమిటేషన్‌పై మాత్రమే కాదు; వారి వ్యతిరేకత మహిళల రిజర్వేషన్‌ గురించే.