భాగ్యనగర భవిష్యత్తు మార్చేందుకు మరింత బలంగా ప్రజల్లోకి వెళ్దాం!
భాగ్యనగరాన్ని సరైన దిశలో నడిపించగలిగేది, ప్రజల ఆశలను నెరవేర్చగలిగేది బిజెపి మాత్రమే అని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. అభివృద్ధి రాజకీయాలా? లేక కుటుంబ రాజకీయాలు, అవినీతి రాజకీయాలా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రజల చేతిలో ఉందన్నారు. భాగ్యనగర భవిష్యత్తును మార్చాలంటే మనం ప్రజల మధ్యకు మరింత బలంగా వెళ్లాలని బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి వ్యాపారి, ప్రతి లబ్ధిదారుని కలిసి వారి ఆశీర్వాదం కోరుదామన్నారు. జూన్ 28న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు పెద్దఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నితిన్ నబీన్ ప్రసంగిస్తూ.. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ శక్తిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. బిజెపి కార్యకర్తలు సంపూర్ణ శక్తితో, అంకితభావంతో పని చేసి భాగ్యనగర భవిష్యత్తును మార్చబోతున్నారన్నారు. భాగ్యనగర ప్రజలు కూడా బిజెపితో కలిసి అభివృద్ధి దిశగా ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ”నేను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడినైనా, నా అసలు బలం కార్యకలే. భారతీయ జనతా పార్టీకి నిజమైన శక్తి కార్యకర్తలే. పార్టీకి ఉత్సాహం, బలం అందించేది కార్యకర్తలే.” అని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన, సేవతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అధికారం అనేది ప్రజలను పాలించడానికి కాదని, సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమే అని మోదీ చూపించారన్నారు.
”తెలంగాణతో బిజెపి అనుబంధం కేవలం రాజకీయ బంధం కాదని, అది పోరాటం, విశ్వాసం, గౌరవంతో ముడిపడి ఉందన్నారు. తెలంగాణలో బిజెపి నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్‌లో సుష్మా స్వరాజ్ బలంగా గళం వినిపించారని గుర్తు చేశారు. రాజకీయ లాభనష్టాలు చూడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని మాత్రమే ఆమె ఆలోచించారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రేమతో “చిన్నమ్మ” అని పిలిచే సుష్మా స్వరాజ్ కృషిని ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన త్యాగాలు ఎంతో గొప్పవి. ఆ పోరాటంలో బిజెపి కార్యకర్తల పాత్ర కూడా ఎంతో కీలకం. తెలంగాణ ప్రజల కలలను పూర్తిగా సాకారం చేయగలిగేది నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి మాత్రమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని మొదటి నుంచి చివరి వరకు ఎదిరించి పోరాడింది భారతీయ జనతా పార్టీయే. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ తన పాత రాజకీయ సంస్కృతినే కొనసాగిస్తోంది. కాంగ్రెస్ కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే హామీలు ఇస్తుందని, అమలు కోసం కాదన్నారు.” అని అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే విజయ సంకల్పంతో ముందుకు సాగాలంటూ.. ”ప్రతి బూత్ అధ్యక్షుడు, ప్రతి కార్యకర్త మూడు ముఖ్యమైన సంకల్పాలు చేయాలి. మొదటి సంకల్పం – ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి కుటుంబం దగ్గరకు బిజెపి కార్యకర్త చేరుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పార్టీ విధానాలను ప్రజలకు వివరించాలి. రెండో సంకల్పం – ప్రతి ఓటరును సంప్రదించాలి. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలి. మూడో సంకల్పం – కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరికీ కలవాలి. వారి సమస్యలను తెలుసుకోవాలి. సమాజంలోని ప్రతి వర్గంతో అనుబంధం పెంచుకోవాలి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి.” అని అన్నారు.
”తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అవినీతిలో మునిగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి ప్రతీకగా మారింది. గత బీఆర్ఎస్ సర్కారు పేద ప్రజల కష్టార్జిత ధనాన్ని దోచుకునేందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు, అవినీతికి పాల్పడిన దోషులను శిక్షించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఆపదు.” అని అన్నారు. ప్రజల మద్దతుతో బిజెపి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. తెలంగాణ ప్రజల కల ఇంకా పూర్తికాలేదని, ప్రజలు ఆశించిన మార్పు ఇంకా రాలేదన్నారు. అవినీతి, కుటుంబ పాలన చేస్తున్న రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”తెలంగాణను అవినీతి, కుటుంబ రాజకీయాల బంధనాల నుంచి విముక్తి చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిదీ. ప్రతి బూత్‌లో కమలం వికసించేలా పనిచేద్దాం. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అరాచక పాలన నుంచి బయటపడింది. ఇప్పుడు అదే మార్పు తెలంగాణలో కూడా రావాల్సిన సమయం వచ్చింది.” అని నితిన్ నబీన్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ మాత్రం బిజెపి అడ్డానే
ఈ సమావేశంలో ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి వచ్చినా, హైదరాబాద్ మాత్రం బిజెపి అడ్డానే. ఈ మూడు కార్పొరేషన్లలో కూడా కమలం వికసించడం ఖాయం. ఎందుకంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు, ప్రత్యామ్నాయంగా బిజెపి వైపే చూస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక రోజు వాన పడితేనే హైదరాబాద్ సగం మునిగిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో చిన్న వాన పడినా రోడ్లు జలమయం అవుతున్నాయి. వాహనాలు వరదల్లో చిక్కుకుంటున్నాయి. కరెంట్ షాక్‌లతో ప్రాణాలు కోల్పోతున్నారు. నగరం మొత్తం నదీ ప్రవాహంలా మారిపోతోంది. హైదరాబాద్‌ను బాగుచేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం నగర భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి తమ ఖజానాలు నింపుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అడ్డాలుగా మార్చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం మజ్లిస్‌తో చేతులు కలిపి అధికారం కోసం తహతహలాడుతున్నాయి. వారికి ప్రజాసేవ కంటే అధికారం ముఖ్యం. కానీ బిజెపికి దేశమే ప్రథమం, దేశసేవే పరమావధి. మజ్లిస్ పార్టీ రోహింగ్యాలు, అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయుల దొంగ ఓట్లతో హైదరాబాద్‌ను కైవసం చేసుకోవాలని కుట్ర చేస్తోంది. ఆ పన్నాగాన్ని మనం అడ్డుకోవాలి. హైదరాబాద్‌లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ ఓట్లు నమోదు కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి బూత్ అధ్యక్షుడు, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి బిజెపి సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బిజెపిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అబద్ధాలు నాటే ప్రయత్నం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ వల్లే బిజెపి గెలిచిందని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు కేరళంలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? బెంగాల్‌లో బిజెపికి ప్రజల మద్దతు పెరిగింది కాబట్టే విజయం సాధించింది. అలాగే రేపు హైదరాబాద్‌లో, తెలంగాణలో కూడా ప్రజల మద్దతుతో బిజెపి గెలుపు ఖాయం.” అని అన్నారు.

