Nitin Nabin

బిజెపి కార్యాలయాలు ప్రజలకు అండగా నిలిచే ‘సేవా కేంద్రాలు’

RR Party Office Openingరాజకీయాలు అధికారం కోసం కావు సేవ కోసం.. భోగం కోసం కావు త్యాగం కోసం.. ఐశ్వర్యం కోసం కావు తపస్సు కోసం.. అనే సేవా సంకల్పంతో ప్రతి కార్యకర్త తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సరికొత్త పోరాటానికి సిద్ధం కావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. 3 రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా జూన్ 28న ఒకేరోజు రికార్డు స్థాయిలో 9 జిల్లా బిజెపి నూతన కార్యాలయాలను ప్రారంభించారు. గండిగూడలో జరిగిన రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి జిల్లా కార్యాలయాలు పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించే ‘సంకల్ప కేంద్రాలు’, ప్రజలకు అండగా నిలిచే ‘సేవా కేంద్రాల’ని స్పష్టం చేశారు. “నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్” అనే నినాదంతో పనిచేసే బిజెపి కార్యకర్తలకు ఈ కార్యాలయాలు స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయని హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆవిర్భవించి ఇన్నేళ్లయినా అమరవీరులు కలలుగన్న స్వప్నం ఇంకా పూర్తిగా నెరవేరలేదని, ఆ ఆశయాలను సాకారం చేయాల్సిన బాధ్యత బిజెపిపై ఉందన్నారు. కొందరు బిజెపిని బయటి పార్టీ అని విమర్శిస్తుంటారని మండిపడుతూ.. 1984లో దేశవ్యాప్తంగా పార్టీకి కేవలం ఇద్దరే ఎంపీలు ఉంటే, అందులో ఒకరు తెలంగాణ గడ్డ నుంచే గెలిచారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో కష్టాలు, పోలీస్ లాఠీ దెబ్బలు, పోరాటాలు, ప్రాణత్యాగాలతో తెలంగాణ నేలపై కమల వనాన్ని పూయించిన సీనియర్ కార్యకర్తలందరికీ ఆయన హృదయపూర్వకంగా శిరస్సు వంచి ప్రణామాలు సమర్పించారు. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీల అవకాశవాద రాజకీయాలపై నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని కేవలం అధికారాన్ని అనుభవించే సాధనంగా మార్చుకున్న పాలకులను గద్దె దించే శక్తి బిజెపి కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై బిజెపి కార్యకర్తలు పోరాడితే, ఆ పోరాట ఫలాన్ని కాంగ్రెస్ మోసపూరితంగా పొందిందని విమర్శించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థానికే ప్రాధాన్యత ఇచ్చే చరిత్ర కాంగ్రెస్‌దని, పాలనలో ఘోరంగా విఫలమైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా పోరాటాల ద్వారా గద్దె దించేందుకు కార్యకర్తలు గ్రామ గ్రామాన, వీధి వీధినా కదలాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నో హింసలు, అరాచకాలను ఎదుర్కొని, పోరాటాలతో అక్కడ కమలం ఎలా వికసించిందో, తెలంగాణలో కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా, అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే సంకల్పంలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలని, కేంద్ర నిధులతో తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారనీ, అలాగే రాష్ట్రంలో కూడా ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పడితేనే సంపూర్ణ ప్రగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బిజెపి కార్యకర్తలకు ఒక కొత్త పోరాటానికి నాంది అని, ప్రతి ఒక్కరూ సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో పోరాడి మున్సిపల్ ఎన్నికల్లో కమలాన్ని వికసింపజేయాలని పిలుపునిచ్చారు. 1980లో స్థాపించిన బిజెపి నేడు దేశంలోని 22 రాష్ట్రాలలో అధికారంలో ఉంటూ నిరంతరం ఎదుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని నితిన్ నబీన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల కో-ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.