బిజెపి ప్రత్యేక మిషన్‌గా తెలంగాణ
తెలంగాణను బిజెపి జాతీయ నాయకత్వం ప్రత్యేక మిషన్‌గా తీసుకుందని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఆ మిషన్‌ను విజయవంతం చేసే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బిజెపి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుందన్న ఆయన తెలంగాణలో బిజెపికి టైమొచ్చిందన్నారు. తెలంగాణ పర్యటనలో కార్యకర్తల ఉత్సాహం, ప్రజల్లో నెలకొన్న విశ్వాసం చూస్తే ఈ నమ్మకం కలిగిందన్నారు. జూన్ 30న మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నితిన్ నబీన్ సుదీర్ఘంగా ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, “ఏకాత్మ మానవ దర్శనం”, “అంత్యోదయ” సిద్ధాంతాలను ప్రవచించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, విలువలతో కూడిన రాజకీయాలు, సుపరిపాలన నమూనా అందించిన భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయిలను స్మరించుకున్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ “ఏక్ భారత్”, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ “అంత్యోదయ”, అటల్ బిహారీ వాజ్‌పేయి “సుపరిపాలన” అనే మూడు మహోన్నత సిద్ధాంతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆచరణలో పెడుతూ ఆధునిక భారత నిర్మాణానికి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు.
కార్యకర్తలే బిజెపి బలం
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నబీన్ ప్రసంగిస్తూ.. ”రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన మీరందరూ కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దూతలు, సంస్థను బలోపేతం చేసే శక్తులు, తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఏర్పాటు సమయంలో కన్న కలలను సాకారం చేసే సేనానులు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించాలనే సంకల్పాన్ని ఈ కార్యవర్గ సమావేశం ద్వారా మనమంతా చేయాలి. బిజెపి కార్యకర్తగా మన ప్రయాణం కేవలం రాజకీయ ప్రయాణం కాదు. అది సిద్ధాంతాల కోసం చేసే ప్రయాణం, త్యాగం కోసం చేసే ప్రయాణం, తపస్సుతో కూడిన ప్రయాణం, దేశానికే తొలి ప్రధాన్యతగా భావించే జాతీయవాద ప్రయాణం. ఆ మహత్తర ప్రయాణంలో మనమంతా భాగస్వాములం.
నేడు మీరు చూస్తున్న బిజెపి అనే మహా వటవృక్షం కార్యకర్తల అంకితభావం, కష్టానికి, శ్రమకు ప్రతిఫలం. 1980లో స్థాపించిన బిజెపి తన తొలి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరు ఎంపీలను మాత్రమే గెలిపించుకోగలిగింది. అలాంటి పార్టీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. ఈ ఘనత పూర్తిగా బూత్ స్థాయి వరకు నిరంతరం శ్రమిస్తూ కమలాన్ని వికసింపజేసిన ప్రతి కార్యకర్తకే దక్కుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికి చేరేలా చేసిన సంకల్పం విజయవంతమైంది. “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” అనే భావనను సాకారం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత త్రివర్ణ పతాకం గౌరవంగా రెపరెపలాడేలా, దాని గౌరవానికి ఎవరూ భంగం కలిగించలేని విధంగా దేశ గౌరవాన్ని కాపాడే సంకల్పాన్ని కూడా విజయవంతంగా అమలు చేశారు. సుపరిపాలన గురించి మనం గర్వంగా మాట్లాడగలుగుతున్నామంటే, గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత నిజాయితీ, నిబద్ధతతో పాలన అందించడమే కారణం. అయితే, మనం సాధించిన విజయాలతోనే సంతృప్తి చెందే పరిస్థితి లేదు. ఇంకా ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. విజయం సాధించామని భావించి మన గమ్యాన్ని చేరుకున్నామని అనుకోవడం సరికాదు. ఇంకా ఎంతో పోరాటం చేయాల్సి ఉంది. స్వామి వివేకానంద కలలు కన్నట్లు భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి చేర్చే లక్ష్యాన్ని మనం సాధించాల్సి ఉంది. అందుకే ఇక్కడకు వచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఒక పిలుపునిస్తున్నాను. 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయాలంటే, ఈ తరానికి చెందిన ప్రతి కార్యకర్త తన సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగించాలి. అంకితభావం, సంకల్పం, నిరంతర కృషితో ముందుకు సాగి అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
1984లో బిజెపికి కేవలం రెండు లోక్‌సభ స్థానాలే వచ్చినప్పుడు కూడా మనం నిరాశ చెందలేదు. పోరాటాన్నే ఎంచుకున్నాం. పార్టీయే మన మార్గంగా, పార్టీయే మన బలంగా భావించి ముందుకు సాగాం. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోగలిగితే ఒకరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతామనే అచంచల విశ్వాసంతో పనిచేశాం. ఆనాడు రెండు సీట్లు మాత్రమే వచ్చినా మన సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పు రాలేదు. మన విధానాల్లో ఎలాంటి తడబాటు కనిపించలేదు. ఆనాడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసిన కాశ్మీర్ మనదే అనే సంకల్పంతో ముందుకు సాగాం. ఆ సంకల్పాన్ని నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాకారం చేయగలిగాం. తపస్సు, త్యాగం, కఠోర శ్రమ ద్వారానే ఫలితాలను సాధించగలమనే నమ్మకంతో ముందుకు సాగే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే మన కార్యకర్తల అసలైన బలం.
బెంగాల్ గెలుపు ఎలా సాధ్యమైందంటే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో దాదాపు 35 శాతం ఓట్లను సాధించి బిజెపి బలమైన ఉనికిని చాటుకుంది. ఇది తెలంగాణ ప్రజల్లో పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. అయితే మన ప్రయాణం ఇంకా ముగియలేదు. ఇంకా ఎన్నో పోరాటాలు మన ముందున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో విజయం ఎలా సాధించామని చాలామంది అడుగుతారు. వారికి నేను చెప్పేది ఏమిటంటే, ఆ విజయానికి కారణం మన సిద్ధాంతం, నాయకత్వం, కార్యకర్తల అపారమైన కృషి. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మభూమిని విధ్వంసకర పాలన నుంచి విముక్తి చేయాలనే సంకల్పానికి బిజెపి విజయం ఒక ప్రారంభం. ఆయన కలలు కన్న పశ్చిమ బెంగాల్‌ను రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం తప్పకుండా నిర్మిస్తుంది. 2016లో పశ్చిమ బెంగాల్‌లో మనకు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినప్పటికీ మన కార్యకర్తలు పోరాటాన్ని విడిచిపెట్టలేదు. 2021 ఎన్నికలను కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు. ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగినా, మన కార్యకర్తలు వేధింపులకు గురైనా, ఎన్నో కష్టాలు ఎదురైనా వారు తమ సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. అందుకే నేడు పశ్చిమ బెంగాల్ విజయం సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ అచంచల సంకల్పమే నేడు పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించడానికి కారణమైంది. ఆ విజయ ఘనత పూర్తిగా కార్యకర్తలదే.
బిజెపి కార్యకర్తలు ప్రజల కోసం వీధుల్లోకి వచ్చారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. ఎంతో మంది రక్తం చిందించారు. మానసిక వేధింపులను కూడా భరించారు. అక్కడి ప్రభుత్వం మన తల్లులు, సోదరీమణులను కూడా వేధించింది. అయినప్పటికీ కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా మౌనంగా నిలిచాయి. నేడు వారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో ప్రజలు బాధలు పడుతున్నప్పుడు, మన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నప్పుడు, మహిళల గౌరవం దెబ్బతింటున్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా వారి తరఫున మాట్లాడలేదు. ప్రతిపక్షం మొత్తం మౌనంగా ఉండిపోయింది. దేశ మహిళల గౌరవం, ప్రజల ఆత్మగౌరవం గురించి ఆలోచించే మనస్తత్వం వారికి లేదు. వారికి అధికారం మాత్రమే ముఖ్యం. అందుకే ప్రజలు వారిని వరుసగా తిరస్కరిస్తూ అధికారానికి దూరం చేస్తున్నారు.
తెలంగాణ అనేది ప్రారంభం నుంచే కమలం వికసించిన రాష్ట్రం. నేడు దేశంలోని 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ప్రజాసేవ చేస్తున్నాయంటే, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వమే కారణం. దేశ ప్రజలు ఆ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. అయితే, కాంగ్రెస్ వైఫల్యాలనే మన ఎన్నికల అజెండాగా చేసుకోం. గత 12 సంవత్సరాల్లో మన ప్రభుత్వం దేశంలో తీసుకొచ్చిన అభివృద్ధి, మార్పు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మన పనితీరే మన ఎన్నికల అజెండా. మోదీ ప్రభుత్వ ప్రత్యేకత ఏమిటంటే, మనం చెప్పిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటాం. అందుకే దేశవ్యాప్తంగా ‘మోదీ హై తో ముమ్కిన్ హై’ అనే నినాదం ప్రజల్లో బలంగా వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా అమలయ్యే గ్యారంటీ. కాంగ్రెస్ గ్యారంటీ అంటే ఎప్పటికీ నెరవేరదనే గ్యారంటీ అనే విషయం దేశ ప్రజలకు బాగా అర్థమైంది. దేశంలో ఏయే రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయో అక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. మనం శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేసి ప్రారంభించే బాధ్యతను కూడా మన ప్రభుత్వాలే నిర్వర్తించాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం ప్రజలకు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చింది.. ఇప్పటిదాకా అమలు చేయలేదు.
రాష్ట్ర అభివృద్ధికి విశేష ప్రాధాన్యం
తెలంగాణ అభివృద్ధికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలోని 30 లక్షలకు పైగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 33 లక్షలకు పైగా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలను పొందుతున్నారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు పసుపు సాగు చేసే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించే దిశగా కీలక అడుగుగా నిలిచింది. తెలంగాణలో 83 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేశాం. అలాగే పేదల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్రంలో 1.32 కోట్లకు పైగా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరిపించాం. తెలంగాణ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. ముద్రా యోజన ద్వారా రూ.86,800 కోట్లకు పైగా రుణ సాయాన్ని అందించి యువతను ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతోంది.
ఒకప్పుడు టీ అమ్మే వ్యక్తి కొడుకు దేశ ప్రధానమంత్రి ఎలా అవుతాడని కొందరు ప్రశ్నించారు. కానీ టీ అమ్మిన వ్యక్తి కొడుకుకే చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు ఎదుర్కొనే కష్టాలు బాగా తెలుసు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి సమస్యలను అర్థం చేసుకుని ప్రత్యేక పథకాలను అమలు చేశారు. దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి యోజన ద్వారా 75 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరగా, వారిలో తెలంగాణకు చెందిన సుమారు 7.5 లక్షల మంది వీధి వ్యాపారులు కూడా ఉన్నారు. నేను ఈ గణాంకాలను ప్రస్తావించడం వెనుక ఉద్దేశం ఒక్కటే. తెలంగాణ అభివృద్ధిలో బిజెపి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, చేస్తున్న కృషికి ఇవే నిదర్శనాలు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు మనల్ని ఆశీర్వదించారో, అప్పుడు మనం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. అధికారాన్ని మనం సేవకు సాధనంగా చూస్తాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవే మన ధ్యేయం. అందుకే తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశాం. అలాగే సమ్మక్క–సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 23కు పైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి సేవలందిస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఈ ప్రజావ్యతిరేక, నిద్రాణ ప్రభుత్వాన్ని ప్రజల ఆశీర్వాదంతో గద్దెదించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు ప్రకటించిన ఆర్థిక సహాయం అందించారా? అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితిలో వారు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం కన్నా దిల్లీ దర్బార్‌ను సంతోషపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణను ఏటీఎంలా ఉపయోగించి దిల్లీలో తమ రాజకీయాలను నడిపిస్తున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే, ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికే ప్రజలకు చేరేవి. నేడు గ్యారంటీల పోస్టర్లు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ ఆ గ్యారంటీల ప్రయోజనాలు మాత్రం ప్రజలకు అందలేదు. ఈ వాస్తవాన్ని ప్రతి ఇంటికీ, ప్రతి ప్రజానీకానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను అమలు చేసి పన్నుల వ్యవస్థను సరళీకృతం చేశాం. అలాగే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షల వరకు పెంచి మధ్యతరగతి, సామాన్య ప్రజల జీవితాల్లో ఆర్థిక ఊరట కల్పించే చర్యలు తీసుకున్నాం. కానీ తెలంగాణలో మాత్రం అక్రమ వసూళ్ల ద్వారా ప్రజల కష్టార్జిత ధనాన్ని దోచుకుని దిల్లీ దర్బార్‌కు తరలించే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుండటం బాధాకరం. తెలంగాణ ప్రజల శ్రమతో సంపాదించిన ఒక్క రూపాయి కూడా అక్రమ వసూళ్లకు గురికాకూడదు. ప్రజలను దోచుకునే ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజల ఆశీర్వాదంతో గద్దె దించేందుకు బిజెపి కట్టుబడి ఉంది. మన పోరాట దిశను ఇప్పటికే నిర్ణయించుకున్నాం. గల్లీ నుంచి అసెంబ్లీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ ప్రభుత్వ కౌంట్‌డౌన్ నేటి నుంచే ప్రారంభమైందని విశ్వసిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి ఖర్చుకు, ప్రతి నిర్ణయానికి, ప్రతి అవినీతి వ్యవహారానికి ప్రజల తరఫున బిజెపి కార్యకర్తలు పూర్తి లెక్క అడగాలి. అందుకు మీరందరూ సిద్ధంగా ఉండాలి.
కుమ్మక్కయిన మూడు పార్టీలు
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, కుటుంబ పాలనను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అవినీతి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అవినీతి అనే స్థాయికి ఆ పార్టీ చేరుకుంది. నేడు నేరమయ రాజకీయాలకు కూడా కాంగ్రెస్ ప్రతీకగా మారుతోంది. దేశ వ్యతిరేక శక్తులకు, దేశాన్ని విభజించే ఆలోచనలకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెడుతోంది. అందుకే అవినీతి, నేరమయ రాజకీయాలు అనే రెండు మచ్చలతో కాంగ్రెస్ గుర్తింపు పొందుతోంది. ఇటీవల ముసీ రివర్‌ఫ్రంట్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన పాత అవినీతి సంప్రదాయాన్నే కొనసాగిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా ధనాన్ని దోచుకునే మరో అవకాశంగా దానిని మలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల కష్టార్జిత ధనాన్ని ప్రజల సంక్షేమానికి కాకుండా ఇతర రాజకీయ అవసరాలకు వినియోగిస్తే బిజెపి కార్యకర్తలు ప్రతి రూపాయికి లెక్క అడుగుతారు.
తెలంగాణలో మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ కుమ్మక్కును ప్రజలు గమనిస్తున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ఏ ప్రయత్నాన్నైనా బిజెపి పూర్తిగా వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తులో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లను రద్దు చేసి, ఆ ప్రయోజనాలను ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటాం. సమాజంలో ఇంకా అభివృద్ధి ఫలాలు పూర్తిగా అందని వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే మన లక్ష్యం. దేశవ్యాప్తంగా 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ద్వారా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన “అంత్యోదయ” సిద్ధాంతాన్ని మోదీ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. భారతీయ సంస్కృతి, చారిత్రక వారసత్వం, సనాతన సంప్రదాయాలను పరిరక్షించి పునరుజ్జీవింపజేయడానికి మన ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దేశ సంస్కృతికి గౌరవం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేసింది. తెలంగాణలో హిందూ దేవాలయాలు, దేవతల పట్ల అవమానకర ఘటనలు చోటుచేసుకున్నాయి. అయ్యప్ప స్వామి ఆలయంపై జరిగిన దాడి వంటి ఘటనలను బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది. అలాంటి ఘటనలకు బాధ్యులైన వారిని ప్రజాస్వామ్యబద్ధంగా నిలదీద్దాం. ప్రజలు ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. కుటుంబ పాలన, అవినీతి, హామీల అమలులో వైఫల్యం వంటి రాజకీయాలకు ముగింపు పలకాలంటే మనమంతా మరింత శక్తివంతంగా పోరాటానికి సిద్ధం కావాలి.
కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల రాజకీయాల్లో మూడు ఉమ్మడి లక్షణాలు —అవినీతి, కుటుంబ పాలన, హామీల అమలులో వైఫల్యం ఉన్నాయి. అదే సమయంలో వారు సంతుష్టీకరణ రాజకీయాలపై ఆధారపడితే, బిజెపి రాజకీయాలు ప్రతి పౌరుడిని సంతృప్తిపరిచే సమగ్ర అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్” అనే మంత్రంతోనే ప్రజల మధ్యకు వెళ్దాం. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ సేవాభావంతో పనిచేయడమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం.
నెరవేరని ఆకాంక్షలు
తెలంగాణ ఏ ఆకాంక్షతో ఏర్పడిందో, ఆ కల ఇంకా పూర్తిగా సాకారం కాలేదు. ఆనాడు పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పూజ్య సుష్మా స్వరాజ్ గళమెత్తారు. బిజెపి కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రజలు కన్న ఆ కలలను పూర్తిగా సాకారం చేసే బాధ్యత బిజెపి ప్రభుత్వానిదే. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పార్టీ కార్యకర్తలందరూ మరింత పట్టుదలతో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను. నేడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల రాజకీయాన్ని నడుపుతోంది. ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి బూత్ స్థాయికి వెళ్లి ఆ అబద్ధాలను ప్రజల ముందు బట్టబయలు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి వేర్వేరు విధానాలతో పనిచేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కేవలం కమీషన్ల పైనే దృష్టి పెడుతోంది. పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఆ బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్వర్తిస్తోంది. దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి అందించడం కేంద్ర ప్రభుత్వ గొప్ప విజయాల్లో ఒకటి. మహిళల గౌరవం, ఆత్మగౌరవం, ఆరోగ్యాన్ని కాపాడేందుకు మన ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించింది. మహిళల హక్కులు, గౌరవం, సాధికారతకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు కోట్ల “లఖ్‌పతి దీదీ”లను తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత్ ఆత్మనిర్భర్‌గా ఎదగాలంటే దేశ జనాభాలో సగమైన మహిళలు కూడా సమాన శక్తితో ముందుకు రావాల్సిందే.
కాంగ్రెస్ నాయకులకు అధికారం అంటే ప్రజాసేవ కాదు, స్వప్రయోజనాలను నెరవేర్చుకునే సాధనం. వారి వైఫల్యాలు, ప్రజలకు చేసిన అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో “కాంగ్రెస్ రహిత తెలంగాణ”ను నిర్మించాలనే లక్ష్యంతో ప్రజలను ఏకం చేస్తాం. భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక సిద్ధాంతం ఉంది.. దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ప్రధానం. దేశం ముందు, పార్టీ తర్వాత, వ్యక్తిగత ప్రయోజనం చివర అనే విలువలతోనే ప్రతి కార్యకర్త పనిచేస్తాడు.
అప్పుడు ఆందోళన.. ఇప్పుడు విశ్వాసం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి “2047 నాటికి వికసిత్ భారత్” అనే మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏ దేశమైనా ఒక గొప్ప కలతోనే అభివృద్ధి చెందుతుంది. అమెరికా “గ్రేట్ అమెరికన్ డ్రీమ్”తో ముందుకు సాగింది. చైనా కూడా గొప్ప దేశంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేసింది. అలాగే నేడు 140 కోట్ల మంది భారతీయులను “వికసిత్ భారత్ – 2047” అనే లక్ష్యం ఒక్కటే ఏకం చేసింది. చాలామంది “దేశంలో ఏమి మారింది?” అని ప్రశ్నిస్తుంటారు. వారికి నేను చెప్పేది ఒక్కటే. నేడు ప్రపంచవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకానికి ఉన్న గౌరవం ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు మన దేశ భూభాగంలోనే దేశ విద్రోహుల జెండాలు ఎగురవేసినా దిల్లీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండేది. 2011లో కాశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో పాకిస్తాన్ జెండా ఎగిరిన రోజులను మనం మర్చిపోలేం. కానీ 2014 తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. నేడు లాల్ చౌక్‌లో రెపరెపలాడేది భారత త్రివర్ణ పతాకమే. ఇదే నూతన భారతానికి ప్రతీక. అయినప్పటికీ ఇంకా ఎన్నో లక్ష్యాలు సాధించాల్సి ఉంది. దేశ అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేశాం. సరిహద్దుల రక్షణను మరింత శక్తివంతం చేశాం. దేశంపై దురుద్దేశాలతో చూసే శక్తులకు తగిన విధంగా గట్టి సమాధానం చెప్పే సామర్థ్యాన్ని భారతదేశం నేడు సంపాదించింది. ఆపరేషన్ సిందూర్, సర్జికల్ స్ట్రైక్స్ వంటి చర్యల ద్వారా ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాం. భారతదేశ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. భారత పౌరుడిపై ఎవరైనా దాడి చేస్తే దానికి తగిన ప్రతిస్పందన ఇవ్వడం భారత్‌కు తెలుసు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయాలనే ప్రోత్సహించింది. ఈ దేశ మట్టి, ఈ దేశ సంస్కృతి, ఈ దేశ ప్రయోజనాల పట్ల నిజమైన నిబద్ధతను ఆ పార్టీ ఎన్నడూ ప్రదర్శించలేకపోయింది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న పార్టీగా కాంగ్రెస్ చెప్పుకున్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకోలేకపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రయోజనాల విషయంలో ఎన్నో సార్లు రాజీ పడింది. అందుకే కాంగ్రెస్ పార్టీ రాజీ రాజకీయాలకు ప్రతీకగా నిలిస్తే, భారతీయ జనతా పార్టీ జాతీయవాదానికి ప్రతీకగా నిలిచింది. దేశ ప్రయోజనాలే మన రాజకీయాల కేంద్రబిందువు.
నేడు కొందరు “ఏం మారింది?” అని ప్రశ్నిస్తున్నారు. వారికి నేను చెప్పదలిచింది ఒక్కటే. 2014కు ముందు దేశం నిరాశలో, అవినీతిలో కూరుకుపోయింది. యువత తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తుపై ఆందోళన చెందేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంపై దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. కరోనా వంటి మహా విపత్తు నుంచి దేశాన్ని విజయవంతంగా బయటకు తీసుకువచ్చే సామర్థ్యాన్ని ఆయన చూపించారు. దేశ భద్రతకు ఎలాంటి సవాలు ఎదురైనా ధైర్యంగా, దృఢంగా సమాధానం చెప్పగల నాయకత్వాన్ని దేశం నేడు చూస్తోంది.
త్వరలో త్రిలింగ భూమిలో కమలం వైభవం
రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ముందుకు మనం ఒక గొప్ప లక్ష్యంతో, ఒక స్పష్టమైన దార్శనికతతో, ప్రజల్లో విశ్వాసాన్ని నింపే సంకల్పంతో వెళ్లాలి. ప్రతి కార్యకర్త సిద్ధాంతాల కోసం పోరాడటంతో పాటు, పార్టీని మరింత బలోపేతం చేయడానికి తన సంపూర్ణ శక్తిని వినియోగించాలి. మనం సమాజ విశ్వాసాన్ని గెలుచుకోవాలి. సమాజం మనపై విశ్వాసం ఉంచితే, పార్టీ మరింత బలపడుతుంది. పార్టీ బలపడితే ప్రతి బూత్‌లో విజయం సాధించగలుగుతాం. ప్రతి బూత్‌ను గెలుచుకునే లక్ష్యాన్ని సాధించిన రోజే తెలంగాణలో బిజెపి విజయానికి బలమైన పునాది పడుతుంది. బూత్ స్థాయిలో మన కార్యకర్తలు నిర్మించిన బలమైన సంస్థాగత శక్తే తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని తీసుకొస్తుంది. అంగ, బంగ, కళింగ ప్రాంతాల నుంచి కమలం ఎలా విజయవంతంగా వికసించిందో, అదే విధంగా ఇప్పుడు త్రిలింగ భూమి అయిన తెలంగాణలో కూడా కమలం తన వైభవాన్ని చాటే సమయం ఆసన్నమైంది. అందుకే తెలంగాణలో కమలం వికసింపజేయాలనే అచంచల సంకల్పంతో మనమంతా ముందుకు సాగాలి. బిజెపి విజయయాత్రలో తెలంగాణను కూడా విజయగాథగా నిలపాలి.
తెలంగాణలో ప్రజాసమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడేందుకు సిద్ధం కావాలి. తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలవాలంటే వారి సమస్యలతో మమేకం కావాలి. ప్రజల సమస్యలపై పూర్తి శక్తితో ఉద్యమించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై ఐక్యంగా, అంకితభావంతో పోరాటం చేస్తే 2028లో తెలంగాణలో విజయం భారతీయ జనతా పార్టీదేననే పూర్తి విశ్వాసం నాకు ఉంది. నేను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి పార్టీ ఇన్‌చార్జిగా పనిచేసిన సమయంలో అక్కడ కూడా కాంగ్రెస్ అరాచక, అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉండేది. అప్పట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో బలమైన నాయకుడని చాలామంది చెప్పేవారు. అయితే అవినీతి, అరాచక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల మద్దతుతో గద్దె దింపింది బిజెపి కార్యకర్తలే. వారి అంకితభావం, కఠోర శ్రమ ఫలితంగానే అక్కడ మళ్లీ బిజెపి ప్రభుత్వం ఏర్పడింది.
తెలంగాణలో మార్పు దిల్లీ నుంచి రాదు. తెలంగాణ ప్రజలతో కలిసి పోరాడితేనే మార్పు సాధ్యమవుతుంది. ప్రజలతో కలిసి నడుస్తూ, వారి ఆశయాలకు ప్రతినిధులుగా నిలబడితేనే తెలంగాణలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడుతుంది. జాతీయ నాయకత్వానికి బలం రాష్ట్ర నాయకత్వం నుంచి వస్తుంది. రాష్ట్ర నాయకత్వానికి బలం జిల్లా నాయకత్వం నుంచి లభిస్తుంది. జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వం బలంగా నిలుస్తుంది. మండల నాయకత్వానికి అసలైన శక్తి బూత్ స్థాయి నాయకత్వమే. అందుకే బూత్ స్థాయి వరకు సంస్థను మరింత బలోపేతం చేయడం మన అందరి బాధ్యత. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయగాథను రాయబోయేది మీ కృషి, మీ అంకితభావమే అనే నమ్మకం నాకు ఉంది. తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మన రాజకీయ లక్ష్యం మాత్రమే కాదు. ఎన్నో సంవత్సరాలుగా కార్యకర్తల నిస్వార్థ త్యాగాలకు, పోరాటాలకు తగిన ఫలితం అందించడం మన బాధ్యత. ప్రజల కలలను సాకారం చేసే తెలంగాణను నిర్మించడమే మన సంకల్పం. అందుకే కార్యకర్తలంతా ప్రతి ఇంటికీ వెళ్లాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి, తెలంగాణకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలి. అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజలకు స్పష్టంగా వివరించాలి.
మన లక్ష్యం ఒక్కటే..వికసిత్ భారత్.
మన సంకల్పం ఒక్కటే.. వికసిత్ తెలంగాణ.
మన విశ్వాసం ఒక్కటే.. భారతీయ జనతా పార్టీ విజయం.
ఈ విశ్వాసంతో, ఈ సంకల్పంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనమంతా సిద్ధంగా ముందుకు సాగుదాం” అని అన్నారు.
విజయవంతంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఎన్. రాచందర్ రావు తెలంగాణ అధ్యక్షుడయ్యాక ఆయన అధ్యక్షతన తొలిసారి నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతమైంది. ఈ సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం విశేషం. సమావేశం ముందు నితిన్ నబీన్ పార్టీ జెండాను ఎగరేశారు. ఎన్. రాంచందర్ రావు అధ్యక్షోపన్యాసం చేశారు. నితిన్ నబీన్ మార్గదర్శనం చేయడం శ్రేణులకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. రాష్ట్ర కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది. బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ రాజకీయ తీర్మాన్ని ప్రవేశపెట్టగా, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుండే మద్దతు తెలిపారు. బిజెపి శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవసాయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మినర్సయ్య మద్దతు తెలిపారు. 12 ఏళ్ల మోదీ పాలనపై అభినందన తీర్మానాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రవేశపెట్టగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మద్దతు పలికారు. ఇటీవల మృతి చెందిన బిజెపి నాయకులకు సంతాపం ప్రకటించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై విస్తృతంగా చర్చించారు. సంస్థాగత విషయాలపై రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ చర్చించారు. రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్ రాష్ట్ర సమస్యలపై ఆందోళనలు అన్న అంశంపై ప్రసంగించారు. సమారోప్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. వేదికను, సమావేశ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. కాషాయ జెండాలతో అలంకరించారు. బిజెపి మేడ్చల్ మల్కాజ్‌గిరి రూరల్ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి చక్కని ఆతిథ్యం ఇచ్చింది.
