కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల డ్రామేశ్వరం

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల గురించి గొప్పగా చెప్పుకొన్నారు. 2008లో నాటి సమైక్య రాష్ట్రం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినా 2014 వరకు ప్రధాన బ్యారేజీ మీద పక్క రాష్ట్రంతో ఒప్పందం జరగనేలేదు, అక్కడ తట్టెడు మట్టి కూడా పోయలేదు, పర్యావరణ, అటవీ అనుమతులు కూడా పొందలేదు, అయినప్పటికీ కమిషన్ల కోసం రూ.7000 కోట్లు ఖర్చు చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను దగా చేసింది. ప్రధాన బ్యారేజీతో పాటు సరైన స్టోరేజీ లేకుండా 160 టీఎంసీల నీళ్లు లిఫ్టు చేస్తామని, 16 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని, 10 టీఎంసీలు గ్రామీణ ప్రాంతాలకు, 30 టీఎంసీలు హైదరాబాద్ కు తాగునీరు, 16 టీఎంసీలు పరిశ్రమలకు ఇస్తామని ప్రగల్భాలు పలికిన అప్పటి ప్రభుత్వాన్ని కాగ్ రిపోర్టు కూడా ఎండగట్టింది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత విషయంలో సరైన రిపోర్టు తీసుకోలేదని కాగ్ తప్పుబట్టింది.

తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మిస్తే 70 శాతం పైగా మునక (దాదాపు 6వేల ఎకరాలు) మహారాష్ట్రలో ఉండడం, అందులో రెండున్నర వేల ఎకరాలు టైగర్ రిజర్వ్ ఫారెస్టులు ఉండడంతో బ్యారేజీ ఎత్తుపై ఒప్పందానికి పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మొదటికే ముప్పు రావడంతో 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం, ఈ విషయాలతో పాటు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని, ప్రధాన బ్యారేజీని కాళేశ్వరం దిగువకు మార్చడం సరైనదే అని సాగునీటి రంగ నిపుణుల అభిప్రాయం. అయితే, ఇప్పుడున్న మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సాయిల్ టెస్టు చేయించలేదు, హైడ్రాలజీ విషయంలో సరైన పద్దతి పాటించలేదు, నిపుణులైన ఇంజనీర్ల సలహాలు తీసుకోలేదు, పైగా మూర్ఖపు నిర్ణయాలు, అవినీతి ఎజెండా! వీటికి అదనంగా మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలు, నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడం నేటి ఈ దురదృష్టకర పరిస్థితికి కారణం. సీడబ్ల్యూసీ అనుమతి రాకముందే బ్యారేజీ నిర్మాణం చేపట్టడం కేసీఆర్ ప్రభుత్వ దురుద్దేశాలకు నిదర్శనం. ఫలితం సుస్పష్టం. 2014 నుంచి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ సాగునీటికి సహకరించినప్పటికీ కల్వకుంట్ల కుటుంబ దోపిడీ, కేసీఆర్ నియంతృత్వ విధానాల వల్ల దాదాపు లక్ష కోట్లు అప్పు తెలంగాణ మెడకు చుట్టుకోవడమే కాదు, కట్టిన నాలుగేళ్లలో ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ కుంగిపోయింది. 

వరుణ దేవుడి దయతో 2019 నుంచి 2025 వరకు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సకాలంలో  సమృద్ధిగా వర్షాలు కురవడంతో వరి పంట అధిక దిగుబడి వచ్చింది. అయితే, వరుణదేవుడి దయతో పండిన పంటను కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పండిందని పెద్దఎత్తున గోబెల్స్ ప్రచారం చేయడంతో, అది నిజమే అన్న అపోహ ప్రజల మనసుల్లోనూ నాటుకుంది. 2023 నవంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంతో తదనంతరం 2024-25లో కూడా ఈ సమృద్ధి వర్షాలతోనే, మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఒక్క చుక్క నీరు లిఫ్టు చేయకపోయినప్పటికీ అంతకన్నా ఎక్కువ భూమి సాగవడం, దిగుమతి కూడా మరింత రావడంతో తెలంగాణలో పెరిగిన సాగు, వరి దిగుబడికి కారణం కాళేశ్వరం బ్యారేజీ ఎంత మాత్రం కాదనేది స్పష్టమైంది. అప్పటి వరకు బీఆర్ఎస్ దోపిడీ నాయకులు డబ్బా కొట్టుకున్న విషయం మోసం అని రుజువైంది.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కుంగిపోయిన మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన ఎన్డీఎస్ఏ బృందం వాటి డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నాయని స్పష్టంగా నివేదిక ఇవ్వడంతో బీఆర్ఎస్ దోపిడీ, దగా బయటపడింది. ఆ మూడు బ్యారేజీలతో పాటు కన్నేపల్లి పంప్ హౌజ్ సత్వరమే, సరైన రీతిలో రిపైర్లు చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పినప్పటికీ, రేవంత్ ప్రభుత్వం దుర్బుద్ధితో వాటి రిపైర్లు/పునర్నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఇప్పుడు వచ్చిన ఎల్ నినో కరువులో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు, రాజకీయ దురుద్దేశాల వల్ల ఉత్తర తెలంగాణ రైతాంగం నష్టపోతున్నది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబ దోపిడీలో, ముఖ్యంగా కాళేశ్వరం దోపిడీలో కమిషన్ల కోసం కమిషన్ వేసి, లోపభూయిష్టంగా విచారణ జరిపి, కమిషన్లు దొబ్బి, కేసులను నిర్వీర్యం చేసి, బీఆర్ఎస్ నాయకులను రక్షిస్తూ బ్యారేజీలు, పంపుహౌజ్ రిపైర్లు సకాలంలో చేయక రైతాంగాన్ని ఘోరంగా శిక్షిస్తోంది. రైతులకే కాకుండా హైదరాబాద్ ప్రజల తాగునీటికి కూడా పెను ప్రమాదం వచ్చే పరిస్థితి ఈ తెలంగాణ కాంగ్రెస్ ఘోర వైఫల్యాల వల్ల ఏర్పడుతుంది. 

కాళేశ్వరం దోపిడీలో అసలు బాధ్యుడు కేసీఆర్ ఫాంహౌజ్ లో పడుకుంటే, మరో బాధ్యుడు హరీష్ రావు మాయల ఫకీరు వేషాలు వేస్తూ ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడానికి బాధ్యత తీసుకోవడం లేదు. రబ్బరు చెప్పులు, ట్రంకు డబ్బాలతో వెలమ హాస్టల్ నుంచి వచ్చిన హరీష్ లక్ష కోట్లకు ఎలా ఎదిగాడన్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా, ఇప్పుడు మూడు నెలలు అవకాశం ఇస్తే తెలంగాణను సస్యశ్యామలం చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. ఈయనను మించి వారం రోజుల్లో తెలంగాణ ప్రాజెక్టులు నింపుతామనడం డ్రామారావు మూర్ఖత్వానికి, అహంకారానికి నిదర్శనం. ఈ రెండు పార్టీలు (కాంగ్రెస్, బీఆర్ఎస్) ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరంతో తెలంగాణ ప్రజలను దగా చేసి, దోపిడీ చేసి ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు రోజుకో కొత్త డ్రామా చేస్తూ, ఈ కాళేశ్వరాన్ని డ్రామేశ్వరంగా మార్చేస్తున్నారు.