Nitin nabin

నితిన్ నబీన్ పర్యటన: తెలంగాణ బిజెపికి నూతన దిశ

Nitin Nabin Welcomeరాజకీయ పార్టీల్లో జాతీయ నాయకుల పర్యటనలు సాధారణమే. అయితే కొన్ని పర్యటనలు కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేసే మైలురాళ్లుగా నిలుస్తాయి. జూన్ 28 నుంచి 30 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో నిర్వహించిన మూడు రోజుల పర్యటన కూడా ఆ కోవ లోనిదే! ఈ మూడు రోజుల వ్యవధిలో జరిగిన సమావేశాలు, సమ్మేళనాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో చర్చలు, సంస్థాగత సమీక్షలు—ఇవన్నీ కలిపి చూస్తే తెలంగాణలో బిజెపిని అధికారానికి సిద్ధం చేయాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపించింది.

రాజకీయాల్లో గెలుపు కేవలం ఎన్నికల సమయంలో చేసే ప్రచారంతో సాధ్యం కాదు. బూత్ స్థాయి నుంచి బలమైన సంస్థాగత నిర్మాణం, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, ప్రజలతో నిరంతర సంబంధాలు, ప్రజా సమస్యలపై పోరాటం—ఇవే విజయానికి పునాదులు. ఈ అంశాలపైనే నితిన్ నబీన్ ప్రత్యేకంగా దృష్టి సారించడం విశేషం. ప్రతి కార్యకర్తే పార్టీకి బలం అనే సందేశాన్ని ఆయన సూటిగా తీసుకెళ్లారు. రాష్ట్ర నాయకత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ, అందరూ కలిసికట్టుగా పని చేయాలంటూ ఆయన ఇచ్చిన మార్గదర్శనం పార్టీ శ్రేణుల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. 

బిజెపి కార్యకర్తల పార్టీ. బిజెపి విస్తరణకు కార్యకర్తలే పునాది. నాయకత్వం వారి మధ్యకు వెళ్లి, వారి అభిప్రాయాలను తెలుసుకుని, భవిష్యత్తు లక్ష్యాలను పంచుకున్నప్పుడు పార్టీలో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనలో అదే వాతావరణం కనిపించింది. తాను జాతీయ అధ్యక్షుడు అన్న భావన నితిన్ నబీన్ ఎక్కడా ప్రదర్శించలేదు, తానొక సామాన్య కార్యకర్తే అన్నట్టు ప్రజలతో మమేకమయ్యారు. పార్టీ కార్యక్రమాలతో పాటు యువత, విద్యార్థులు, గిరిజనులు, ఇతర సామాజిక వర్గాలతోనూ కలిసిపోయారు. రాష్ట్ర కార్యాలయ సిబ్బందితోనూ చేతిలో చేయి వేస్తూ అప్యాయంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వాస్తవాలతో ప్రజల ముందుంచాలని స్పష్టమైన సందేశం ఇచ్చారు. 

తెలంగాణలో బిజెపి బూత్ స్థాయి నుంచి క్రమంగా పట్టు పెంచుకుంటూ వస్తోంది. ఎన్నికల్లో పెరుగుతోన్న ఓటు శాతం, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, కేంద్ర ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం వంటి అంశాలు పార్టీకి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అలాంటి సమయంలో జాతీయ అధ్యక్షుడి ఈ పర్యటన రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపింది, నాయకత్వానికి అవసరమైన ఆత్మవిశ్వాసం అందించింది. నితిన్ నబీన్ మార్గనిర్దేశంతో రాష్ట్రంలో బిజెపి మరింత ప్రభావవంతమైన శక్తిగా ఎదగడమే కాదు, రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడమూ పక్కా అని చెప్పవచ్చు.