కూల్చివేతలే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు
సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలతో పాలన ప్రారంభమవుతుందని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేతలతో పాలన ప్రారంభించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజలు బ్యాంకు రుణాలు తీసుకుని కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలే ఈ ప్రభుత్వ పాలనకు గుర్తింపుగా నిలిచిపోతుందన్నారు. కూల్చివేతలతో ప్రారంభమైన ఈ ప్రభుత్వాన్ని ప్రజలే ప్రజాస్వామ్య పద్ధతిలో కూల్చివేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 30న మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సహకారం, ఆశీర్వాదం రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని కోరుకుంటున్నానని రాష్ట్ర కార్యవర్గం సాక్షిగా స్పష్టం చేశారు.
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్.రాంచందర్ రావు అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ”భారతీయ జనతా పార్టీ అనేది ఒక్క వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదు; కార్యకర్తలే పార్టీకి వెన్నెముక. అందుకే మనమంతా “టీమ్ బిజెపి” భావనతో పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఎన్నికలో విజయాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలి. జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ తెలంగాణలో మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటించి కార్యకర్తలను కలవడం, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై మార్గనిర్దేశం చేయడం తెలంగాణపై పార్టీ జాతీయ నాయకత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టం చేస్తోంది. నితిన్ నబీన్ బిజెపి జాతీయ అధ్యక్షులైన తర్వాత అస్సాంలో మూడోసారి, పుదుచ్చేరిలో రెండోసారి, పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి పార్టీ విజయాలు నమోదు చేసినట్లే, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బిజెపి విజయ పతాకాన్ని ఎగురవేస్తుందనే పూర్తి విశ్వాసం నాకు ఉంది.
ఈ రోజు తెలంగాణలో బిజెపి ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కుటుంబ పాలన, అవినీతి, పరిపాలనా వైఫల్యాలతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చాయి. యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సహా ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వాల పాలనలో సంతృప్తిగా లేదు. మహిళలపై నేరాలు పెరుగుతున్నా ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు పారదర్శకంగా నేరుగా ప్రజలకు చేరుతున్నాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదు. అవినీతి, కమీషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ సర్కారు పని చేస్తోంది. మూసీ నది ప్రక్షాళనకు బిజెపికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ పేరుతో గాంధీ సరోవర్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేయడం సరైన విధానం కాదు. ముందుగా మూసీని శుద్ధి చేయాలి; ఆ తర్వాత ఇతర అభివృద్ధి ప్రణాళికలను చేపట్టాలి. లేకపోతే ఈ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే ప్రజల ధనాన్ని వృథా చేసే కార్యక్రమంగా మారుతుందనే అనుమానాలు బలపడతాయి.
గత పన్నెండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతిరహిత, పారదర్శక పరిపాలన కొనసాగుతోంది. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ దేశ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేసింది. ఎయిమ్స్, కోచ్ ఫ్యాక్టరీ, సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, జాతీయ రహదారులు వంటి అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమయ్యాయి. అయినప్పటికీ కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను కూడా కేంద్ర ప్రభుత్వంపైన, కేంద్ర మంత్రులపైన, బిజెపి ఎంపీలపైన నెట్టివేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. మెట్రో విస్తరణ, ఎంఎంటీఎస్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకుండా కేంద్రాన్ని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ప్రకటనలు, ఆరోపణలతో పాలన సాగదని, ప్రజలకు ఫలితాలు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తున్నాను. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజలను మోసం చేసే రాజకీయాల్లో ఒకే తాటిపై నడుస్తున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణ అభివృద్ధిని వెనక్కి నెట్టాయి. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై, హిందువులపై దాడులు జరిగినప్పుడు ఈ పార్టీలు మౌనంగా ఉండగా, వాటిని ఖండించి ప్రజల తరఫున గళమెత్తింది బిజెపి మాత్రమే. జిల్లాల్లో అనేక దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరిగిన ఘటనలు ఇందుకు నిదర్శనం.
తెలంగాణ ప్రజలు బిజెపికి అవకాశం ఇస్తే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ తెలంగాణగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను. రాబోయే రెండేళ్లలో కీలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త ప్రజల సమస్యలపై పోరాడుతూ, ప్రజల్లో మమేకమై పనిచేయాలి. మనలో మనం విభేదించకుండా “టీమ్ బిజెపి”గా ఐక్యంగా ముందుకు సాగి, ప్రజలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ఉద్యమించాలి. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మనకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త దిశానిర్దేశాన్ని అందించే సమావేశం అవుతుందని నమ్ముతున్నాను.” అని అన్నారు.
