ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?
తెలంగాణలో గ్రామీణ రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 20న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం వనపర్తి నుంచి చీకటిమామిడి వరకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన 12 కిలోమీటర్ల నిరసన పాదయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వనపర్తి నుంచి చీకటిమామిడి వరకు ఉన్న 12 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 23 కోట్లు మంజూరైనప్పటికీ, ఏండ్ల తరబడి పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రోడ్డంతా గుంతలమయమై బండ్లు నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ అధ్వానపు రోడ్ల వల్లే ఎందరో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నిరసన యాత్ర చేపట్టింది.
ఈ యాత్రలో పాల్గొన్న రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, కొత్త రోడ్లు మంజూరు చేయకపోగా, కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు కూడా చేయడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని వెంటనే వనపర్తి – చీకటిమామిడి రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల సమస్యతో పాటు సాగునీటి విషయంలోనూ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని మండిపడ్డారు. బస్వాపూర్, శామీర్‌పేట చెరువుల నుంచి స్థానిక రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక, పంటలు పండక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వారికి భరోసా కల్పించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. బస్వాపూర్, శామీర్‌పేట చెరువుల ద్వారా రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు, ప్రజల పక్షాన బిజెపి పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

