ప్రపంచ సముద్ర శక్తిగా భారత్
బాల్యంలో సముద్రాన్ని కళ్లారా చూడని ఒక వ్యక్తి… నేడు కేంద్ర నౌకాయాన మంత్రిగా, భారత్ ను ఒక ఒక ప్రధాన సముద్ర శక్తిగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అస్సాంలోని వరద ప్రభావిత దిబ్రూఘర్ జిల్లా ములుక్ గ్రామంలోని ఒక దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పెరిగిన శర్బానంద సోనోవాల్, కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు సమీపంలోని మార్కెట్లో కూరగాయలు కూడా అమ్మేవారు. అక్కడి నుంచి విద్యార్థి నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా, అస్సాం ముఖ్యమంత్రిగా ఎదిగి ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలలో ఒకదానికి నాయకత్వం వహిస్తున్నారు. మృదుస్వభావి అయిన సోనోవాల్పై, ‘మారిటైమ్ ఇండియా విజన్ 2030’, ‘అమృత్ కాల్ విజన్ 2047’ లక్ష్యాల వైపు భారతదేశాన్ని నడిపించే బాధ్యత ఉంది. ఆంగ్ల వార్తాపత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్య విశేషాలు:
ప్ర: సముద్రయాన రంగానికి ప్రస్తుతం మునుపెన్నడూ లేనంత ప్రాధాన్యం లభిస్తోంది. దీనికి కారణాలేమిటి? ఈ విషయాలపై ప్రధాన మంత్రి కార్యాలయం మీ మంత్రిత్వ శాఖతో ఎంత తరచుగా సంప్రదింపులు జరుపుతుంది?
జ: భారతదేశం సముద్రాలను ఒక సరిహద్దు ప్రాంతంగా చూసే ధోరణి నుంచి మన జాతీయ భద్రత, ఆర్థిక సంక్షేమం, అంతర్జాతీయ పలుకుబడికి అవి అత్యంత కీలకమైనవని గుర్తించే స్థాయికి చేరుకుంది. 2014 కంటే ముందు, భారతదేశ సముద్ర రంగ సామర్థ్యం చాలా వరకు నిరుపయోగంగానే ఉండిపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సముద్ర రంగం భారతదేశ అభివృద్ధి, వ్యూహాత్మక ఎజెండాలో ప్రధాన స్థానానికి చేరుకుంది. సహజంగానే సముద్ర రంగానికి సంబంధించిన అంశాలు నేడు జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి, అనుసంధానం, వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి (స్థితిస్థాపకత)లతో ముడిపడి ఉన్నందున పీఎంఓ దీనిపై నిరంతరం నిశిత పర్యవేక్షణ జరుపుతుంది.
వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి, సముద్రపు దొంగతనాలు, ఉగ్రవాదం, స్మగ్లింగ్, అక్రమ చేపల వేట వంటి మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి మన సముద్రాలు చాలా కీలకమైనవి. అదే సమయంలో, ఓడరేవులు, నౌకాయానం, అంతర్గత జలమార్గాలు, బ్లూ ఎకానమీ (సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ) ద్వారా సముద్ర రంగం ఆర్థిక వృద్ధికి శక్తిమంతమైన ఇంజిన్‌గా మారుతోంది. వాతావరణ మార్పులు, భారతదేశ సుదీర్ఘ తీరప్రాంతం, ద్వీప భూభాగాలు బలమైన సముద్ర పాలన ఆవశ్యకతను మరింత నొక్కి చెబుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే, ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగడం ఒక ప్రముఖ సముద్ర శక్తిగా దాని ఎదుగుదలతో విడదీయరానిది.
ప్ర: సముద్ర రంగం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని మీరు భావిస్తున్నారా?
జ: నిర్లక్ష్యం అని అనలేం కానీ స్వాతంత్య్ర అనంతర కాలంలో చాలావరకు సముద్ర రంగంపై భారత్ ఆలోచన కేవలం ఒక సరిహద్దు ప్రాంతంగానే ఉండిపోయింది. సముద్ర రంగం ఒక సమగ్ర ఆర్థిక వ్యవస్థగా కాకుండా ఓడరేవులు, నౌకాయానం, అంతర్గత జలమార్గాలు వేర్వేరు విభాగాలుగా విడివిడిగా అభివృద్ధి చెందాయి. భారతదేశం గొప్ప సహజ వనరులైన జలమార్గాలు, తీరప్రాంతాలను బలోపేతం చేయడంలో అప్పటి నాయకత్వం విఫలమైంది. తగిన పరిష్కారాన్ని కనుగొని, దానిని ఒక ఆర్థిక వృద్ధి సాధనంగా మార్చడానికి ఎలాంటి ప్రయత్నం జరగకపోవడంతో వ్యవస్థాగతమైన అడ్డంకులు అలాగే ఉండిపోయాయి. పురాతన చట్టాలు, నౌకల టర్నరౌండ్ సమయం (రేవుకు వచ్చిన ఓడలు వాటిపని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళే సమయం) ఎక్కువగా ఉండటం, లోపలి ప్రాంతాలకు అనుసంధానం లేకపోవడం, అంతర్గత జల రవాణా దాదాపు లేకపోవడం వల్ల భారతదేశ విస్తారమైన సముద్ర సామర్థ్యం నిరుపయోగంగా ఉండిపోయింది. ఈ అలసత్వం వల్ల మనం ఆర్థిక నష్టాల కంటే అధికంగా భారీ అవకాశాలను కోల్పోయాం. కానీ 2014 తర్వాత ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది. కేవలం ఓడరేవులను అభివృద్ధి చేయడంపైనే కాకుండా, ఓడరేవుల ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాం. ‘సాగరమాల’ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, 106 కొత్త జాతీయ జలమార్గాల ప్రకటన, స్పష్టమైన లక్ష్యాలతో రెండు ప్రతిష్టాత్మక విజన్ల ప్రారంభం, మెగా పోర్ట్ ప్రాజెక్టులు, చారిత్రాత్మక చట్టపరమైన సంస్కరణల ద్వారా సముద్ర రంగం భారతదేశ లాజిస్టిక్స్, వాణిజ్యం మరియు ఆర్థిక వ్యూహంలో అంతర్భాగంగా మారింది. దీని ఫలితాలు ఓడరేవుల సామర్థ్యం పెరగడం, వేగవంతమైన నౌకల టర్నరౌండ్, అంతర్గత రవాణాలో అద్భుతమైన వృద్ధి, క్రూయిజ్, లైట్‌హౌస్ టూరిజం, భారతీయ కంపెనీలకు అంతర్జాతీయ నౌకానిర్మాణ ఆర్డర్లు, షిప్ రీసైక్లింగ్‌లో ఆధిపత్యం, బలమైన బహుళ రవాణా అనుసంధానత, బ్లూ ఎకానమీలో పునరుత్తేజంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నేడు భారత్ అంతర్జాతీయ సముద్ర శక్తిగా అవతరిస్తోంది. మనం సుస్థిర షిప్ రీసైక్లింగ్ (నౌకల పునర్వినియోగం)లో ముందంజలో ఉన్నాం. మన నౌకాయాన వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఓడరేవులను ఆధునికీకరించడానికి, ప్రపంచ స్థాయి సముద్ర శ్రామిక శక్తి నైపుణ్యాలను పెంపొందించడానికి, మన సుదీర్ఘ తీర ప్రాంతపు అపారమైన సామర్థ్యాన్ని వెలికితీయడానికి ప్రముఖ సముద్ర శక్తులతో కలిసి పని చేస్తున్నాం. ‘మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047’ కింద మేము వాణిజ్యం, ఆవిష్కరణలు, ఉపాధి, సుస్థిరత, భవిష్యత్తు సంసిద్ద సముద్ర రంగాన్ని నిర్మిస్తున్నాం. ఈ పరివర్తనాత్మక ప్రయాణం 2047 నాటికి ప్రపంచంలోని అగ్రగామి సముద్ర దేశాలలో భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేస్తుందని, ‘వికసిత్ భారత్’ విజన్‌కు గణనీయంగా దోహదపడుతుందని మేము నమ్ముతున్నాము.
ప్ర: భారత్ సముద్ర వ్యూహంలో ఏదైనా పునర్వ్యవస్థీకరణ జరుగుతోందా?
జ: గత పదేళ్ళలో మౌలికమైన పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ మార్పు కేవలం విధానపరమైనది మాత్రమే కాదు, దృక్పథంలో వచ్చిన మార్పు-భారతదేశం సముద్రాలను పరిధికి సంబంధించిన ప్రాంతంగా చూడటం నుంచి మన జాతీయ భద్రత, ఆర్థిక సంక్షేమం, అంతర్జాతీయ పలుకుబడి ప్రధానమైనదిగా గుర్తించే దిశగా పయనించింది. ఇంతకుముందు మన వ్యూహాత్మక దృక్పథం ప్రధానంగా భౌగోళిక సవాళ్లకు పరిమితమై ఉండేది. నేడు భారతదేశం హిందూ మహాసముద్రాన్ని తన వ్యూహాత్మక ప్రయోజనాలకు కేంద్రంగా చేసుకుని, ఇండో-పసిఫిక్‌లో తనను తాను ఒక ప్రముఖ సముద్ర శక్తిగా పరిగణిస్తోంది. ఈ ప్రాంతంలో బలమైన సముద్ర ఉనికి, లక్ష్యంతో కూడిన మోహరింపులు, మెరుగైన సముద్ర అవగాహన ఇందులో ప్రతిబింబిస్తాయి. రెండవ ప్రధాన మార్పు ఏమిటంటే, వేర్వేరు విభాగాల ద్వారా పాలన నుంచి సమగ్ర సముద్ర పర్యావరణ వ్యవస్థ వైపు అడుగులు పడటం. విడిగా కాకుండా ఒక ఏకీకృత జాతీయ వ్యూహంతో ముందుకు సాగుతున్నాం.
ప్ర: గల్ఫ్ సంక్షోభం భారతీయ నౌకాయానం, మొత్తంగా సముద్ర రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది?
జ: హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్గాల్లో ఒకటి. ఇది ప్రపంచ చమురు వాణిజ్యంలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. భారత్ కు ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పిజి దిగుమతులతో పాటు పశ్చిమ ఆసియాతో వాణిజ్యానికి ఇది కీలక మార్గం. ఈ సంక్షోభం కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి, ఇంధనం, సరుకు రవాణా సరఫరాలకు అంతరాయం కలిగింది, సరుకు రవాణా ఛార్జీలు పెరిగాయి, యుద్ధ ప్రమాద బీమా ప్రీమియంలు భారీగా పెరిగాయి. షిప్పింగ్ షెడ్యూల్లు ప్రభావితమయ్యాయి, సరఫరా గొలుసుల్లో జాప్యం జరుగుతోంది. పశ్చిమ ఆసియాతో వాణిజ్యంపై ఒత్తిడి పడింది. భారతీయ నావికుల భద్రత కూడా ప్రమాదంలో పడింది. ప్రభుత్వం సమన్వయంతో కూడిన పద్ధతిలో స్పందించింది. ఉన్నత స్థాయి సమీక్షలు జరిగాయి. దీనికి సాధికార కార్యదర్శుల బృందం, పారిశ్రామిక సంఘాలతో క్రమబద్ధమైన సంప్రదింపులు తోడయ్యాయి. కార్యాచరణ స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించడానికి ఓడరేవులు తగిన చర్యలు తీసుకున్నాయి. అవసరమైన సరుకు రవాణాకు ప్రాధాన్యం ఇవ్వడం, పోర్టు ఛార్జీల తగ్గింపు, ఛార్జీల మినహాయింపు, అదనపు నిల్వ సామర్థ్యం, క్యాబోటేజ్ (ఒక దేశంలోని రెండు ప్రాంతాల మధ్య సరుకు రవాణాపై సడలింపులు), కస్టమ్స్ విధానాలను సరళీకృతం చేయడం వంటి చర్యలు చేపట్టాం. యుద్ధ ప్రమాద బీమా రక్షణను కల్పించడానికి ప్రభుత్వం సార్వభౌమ మద్దతుతో కూడిన ‘భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్’ ను కూడా ప్రారంభించింది.
ప్ర: చాలా ఓడరేవులు తమ సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు చెబుతున్నా ఇందులో చాలా వరకు ఇంకా నిరుపయోగంగానే ఉంది కదా?
జ: నేను దానిని నిరుపయోగంగా ఉందని అనను. డిమాండ్ కంటే ముందే సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న వ్యూహం ఫలితం ఇది. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కింద, 32 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవసరాలకు మద్దతుగా భారతదేశం తన సముద్ర మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తోంది. ఓడరేవుల సామర్థ్యం ఎన్నడూ వాణిజ్యానికి లేదా ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారకూడదనేదే మా లక్ష్యం. మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా సముద్ర రంగంలో, ఇప్పటికే ఉన్న రద్దీకి ప్రతిస్పందించడం కంటే భవిష్యత్తు డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయాలి. గత 12 ఏళ్లలో భారతీయ ఓడరేవులలో సరుకు రవాణా 59 శాతం పెరగగా, ఓడరేవుల సామర్థ్యం 80 శాతం విస్తరించింది. ఈ కాలంలో భారత్ మొత్తం ఓడరేవు సామర్థ్యం ఆర్థిక సంవత్సరం 2015 లో సుమారు ఏడాదికి 1,561 మిలియన్ మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటిపిఏ) నుంచి ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 2,818 ఎంఎంటిపిఏకి పెరిగింది. ఇది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టాలనే స్పష్టమైన విధాన నిర్ణయాన్ని ప్రతిబింబిస్తుంది. సామర్థ్య వినియోగం అనేది పోర్టును బట్టి మారుతుంటుంది. ఇది సరుకు రకం, దీని పరిధిలోని భూభాగం అభివృద్ధి, వివిధ రవాణా సాధనాల అందుబాటు, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే మా దృష్టి కేవలం ఓడరేవుల నిర్మాణానికే పరిమితం కాలేదు. మేము రోడ్డు, రైలు, అంతర్గత జలమార్గాల అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నాం. ఓడరేవుల ఆధారిత పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తున్నాం, తీరప్రాంత షిప్పింగ్‌ను విస్తరిస్తున్నాం, ‘ఒక దేశం-ఒక రేవు’ ప్రక్రియ వంటి డిజిటల్ కార్యక్రమాల ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నాం.
ప్ర: ఉద్యోగాల సృష్టిలో సముద్ర రంగం సామర్థ్యం ఎంత?
జ: రాబోయే దశాబ్దాలలో దేశంలో అత్యంత ముఖ్యమైన ఉపాధి వనరులలో ఒకటిగా మారగల సామర్థ్యం సముద్ర రంగానికి ఉంది. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కింద, పోర్ట్ కార్యకలాపాలు, నౌకా నిర్మాణం, మరమ్మతులు, నావికులు, అంతర్గత జలమార్గాలు, క్రూయిజ్ టూరిజం, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీ వంటి విస్తృత శ్రేణి కార్యకలాపాల ద్వారా ఈ రంగం ఒక కోటికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా. ఈ ఉపాధి సామర్థ్యానికి వధవన్, విజింజం, బహుదా, గలాథియా బేలలో కొత్త ఓడరేవులు వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలు, లాజిస్టిక్స్, సేవలను ఒక చోటికి చేర్చే మారిటైమ్ క్లస్టర్ల అభివృద్ధి తోడ్పడుతుంది. మధ్యకాలికంగా, ప్రతిపాదిత ‘సాగరమాల 2.0’ కార్యక్రమం ద్వారా ఆర్థిక సంవత్సరం 2035 నాటికి సుమారు 10,000 ప్రత్యక్ష, 50,000కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నాం. సముద్ర రంగ అభివృద్ధి నిధి, ప్రధాన, ఇతర ఓడరేవులలో జరిగే అనేక ఇతర పెట్టుబడులు కూడా ఉపాధి కల్పన జరుగుతుంది. ప్రపంచంలో నావికులను సరఫరా చేసే మూడు అతిపెద్ద దేశాలలో భారతదేశం ఇప్పటికే ఒకటి. పర్యావరణహిత నౌకాయానం (గ్రీన్ షిప్పింగ్), సముద్ర పవన విద్యుత్తు రంగం, సముద్ర బయోటెక్నాలజీ వంటి కొత్త రంగాలు అదనపు మార్గాలను ఆవిష్కరిస్తున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలు భవిష్యత్తు అవసరాలకు సరిపోయే శ్రామిక శక్తిని సృష్టించడంతో పాటు తీరప్రాంత ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఆర్థిక అవకాశాలను విస్తరిస్తాయి.

