భవిష్యత్తు కోసం ఇంధన వ్యవస్థల నిర్మాణం
ప్రపంచ ఇంధన రంగం ప్రస్తుతం శరవేగంగా మార్పులకు లోనవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, వాతావరణ మార్పుల వల్ల తలెత్తే అడ్డంకులను తట్టుకుంటూ ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, స్థిరత్వాల మధ్య సమతుల్యతను సాధించేందుకు ప్రపంచ దేశాలు తంటాలు పడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఈ సవాలు మరింత తీవ్రమైనది. అందుకే మునుపెన్నడూ లేని విధంగా పరస్పర సహకారం, ఆవిష్కరణలు ఇక్కడ అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ కూటమి ప్రాధాన్యం మరింత పెరిగింది. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు కలిసికట్టుగా పని చేయడానికి, పరిష్కారాలను పంచుకోవడానికి, మరింత పటిష్టమైన, స్థిరమైన ఇంధన భవిష్యత్తును రూపొందించడానికి ఇది ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.
‘స్థితిస్థాపకత (పరిస్థితులకు అనుగుణంగా మారే గుణం), ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల నిర్మాణం’ అనే ఇతివృత్తంతో భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఇతివృత్తానికి ఇంధన రంగం కంటే సరిగ్గా సరిపోయే రంగం మరొకటి లేదు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, విద్య, వ్యవసాయం లేదా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ.. ఇలా ఏ జాతీయ లక్ష్య సాధనకైనా ఇంధనమే పునాది. మానవాళిలో దాదాపు సగ భాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంధన శాఖ మంత్రులు, ప్రతినిధులు దిల్లీలో సమావేశం కానున్న వేళ ఈ శిఖరాగ్ర సదస్సు చర్చలను, భవిష్యత్ ఇంధన వ్యవస్థల రూపకల్పనలో భారత్ పాత్రను సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయం. భారత ప్రధానమంత్రి కాప్-26 (COP26) సదస్సులో 2070 నాటికి దేశాన్ని ‘నెట్ జీరో’ (కర్బన ఉద్గారాల రహిత)గా మారుస్తామని ప్రకటించినప్పుడు ఈ ఇంధన వ్యవస్థ రూపురేఖలు ఖరారయ్యాయి.
‘అందరికీ ఇంధనం’ అనేది బ్రిక్స్ దేశాల ఉమ్మడి ప్రాధాన్యాలను ప్రతిబింబించే చట్రం. ఈ విధానంలో గుర్తించిన ముఖ్యమైన అంశాలు ఇవి:
- ఇంధన లభ్యత, సమానత్వం
- ఇంధన భద్రత, సుస్థిరత
- సాంకేతికత, ఆవిష్కరణలు
- ఇంధన లభ్యత
భారతదేశం తన ప్రతిష్టాత్మక ‘సౌభాగ్య’ పథకం కింద రికార్డు స్థాయిలో 2.86 కోట్ల గృహాలకు విద్యుద్దీకరణను పూర్తి చేసి, సార్వత్రిక విద్యుత్ సరఫరాకు పెద్దపీట వేసింది. ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం విస్తరించడం వల్ల తలసరి విద్యుత్ వినియోగం 1,450 యూనిట్లకు చేరుకుంది. ఇది 2013-14 నాటి స్థాయిలతో పోలిస్తే 52 శాతం ఎక్కువ. పెరుగుతున్న సంపదను, మెరుగైన జీవన ప్రమాణాలను ప్రతిబింబిస్తూ భారత్ తలసరి విద్యుత్ వినియోగం 2030 నాటికి దాదాపు 2,000 యూనిట్లకు, 2047 నాటికి దాదాపు 4,000 యూనిట్లకు పెరుగుతుందని అంచనా. గడిచిన 12 ఏళ్లలో భారత్ తన విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని రెండింతలు పెంచి 540 గిగావాట్లకు (జిడబ్ల్యు) పైగా సాధించింది. ఈ వేగవంతమైన వృద్ధి వల్లే ప్రస్తుత వేసవి కాలంలో నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ (పీక్ డిమాండ్) అయిన 270.8 గిగావాట్లను మనం విజయవంతంగా అందుకోగలిగాం. మరీ ముఖ్యంగా భారత్ తన స్వీయ నిర్దేశిత లక్ష్యాల కంటే ఐదేళ్ల ముందే శిలాజ రహిత (నాన్-ఫాసిల్) ఇంధన వనరుల ద్వారా 50 శాతానికి పైగా విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించింది. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీరుస్తూనే, మరోవైపు తన వాతావరణ లక్ష్యాలను సాధించే దిశగా భారత్ ఎంత పట్టుదలతో పయనిస్తుందో ఇది నిరూపిస్తోంది.
ఈ బలమైన పునాదితో భారత్ ఇప్పుడు తన ఇంధన పరివర్తన తరువాతి దశకు సిద్ధమవుతోంది. 2035-36 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ దాదాపు 459 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా. దీని కోసం దాదాపు 1,121 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అవసరం అవుతుంది. ఈ విస్తరణ ప్రధానంగా సౌర, పవన విద్యుత్త్తు వంటి పునరుత్పాదక ఇంధనం ద్వారానే సాగుతుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇకపై తమ గరిష్ట అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక సామర్థ్య ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇది దేశ విద్యుత్ రంగంలో ఒక ముఖ్యమైన పరిణామం. మన విద్యుత్ వ్యవస్థ సాధిస్తున్న పరిణతికి, ఆధునికతకు, స్థితిస్థాపకతకు ఇది అద్దం పడుతోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో ఇంధన భద్రత మునుపెన్నడూ లేనంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించి, వైవిధ్యభరితమైన ఇంధన వనరులను కలిగి ఉండాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశంలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నందున, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో దిగుమతి చేసుకునే బొగ్గు వినియోగాన్ని మనం ఇప్పటికే తగ్గించాం. అలాగే దిగుమతి ఆధారిత బొగ్గు ప్లాంట్లలో స్వదేశీ బొగ్గును కలిపే అంశాలను పరిశీలిస్తున్నాం. పారిశ్రామిక అవసరాలను తీరుస్తూనే, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ‘బొగ్గు గ్యాసిఫికేషన్’ మరో ప్రాధాన్య రంగంగా మారింది. ఇందుకోసం 2030 నాటికి 10 కోట్ల టన్నుల లక్ష్యంతో జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్‌ను ఏర్పాటు చేశారు.
గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పత్తులు కూడా దేశీయ అవసరాలకే కాకుండా, ఒక ప్రధాన ఎగుమతి వనరుగా ప్రత్యామ్నాయ ఇంధనాలుగా ఎదుగుతున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని వేగంగా ప్రోత్సహిస్తోంది. సౌరశక్తి మన పునరుత్పాదక ఇంధన పరివర్తనకు వెన్నెముకగా నిలిచింది. ప్రస్తుతం 157 గిగావాట్లుగా ఉన్న మన సౌరశక్తి సామర్థ్యం 2014-15తో పోలిస్తే 54 రెట్లు పెరిగింది. రాబోయే దశాబ్దంలో ఇది 500 గిగావాట్లు దాటుతుందని అంచనా. సౌరశక్తి సామర్థ్యంలో భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఈ భారీ పునరుత్పాదక ఇంధన విస్తరణ వెనుక ప్రచారం లేని నిజమైన హీరో ఎవరంటే అది ‘ట్రాన్స్‌మిషన్’ (విద్యుత్ ప్రసార) రంగమే. గత దశాబ్దంలో, మన ప్రసార, పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సింక్రొనైజ్డ్ గ్రిడ్‌లలో ఒకటిగా ఎదిగింది. ఇది తక్కువ కార్బన్ ఉద్గారాల పరివర్తనకు అవసరమైన స్థాయిని, అనుకూలతను అందిస్తోంది.
సాంకేతికత, ఆవిష్కరణలు
డిజిటల్ ఆవిష్కరణలు భవిష్యత్ విద్యుత్ వ్యవస్థను మరింతగా ప్రభావితం చేస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఇప్పటికే వేగం పుంజుకుంది. ఇప్పటివరకు ఆరుకోట్ల స్మార్ట్ మీటర్లను అమర్చడం ద్వారా గ్రిడ్‌ను మరింత స్మార్ట్‌గా మార్చడమే కాకుండా, సమయాన్ని బట్టి మారే టారిఫ్ విధానాన్ని అమలు చేయడం సాధ్యమైంది. రేపటి మేధోసంపన్నమైన, అనుసంధానిత వ్యవస్థలు ఈ రోజు మనం చూస్తున్న భౌతిక మౌలిక సదుపాయాల కంటే చాలా ఎక్కువ విలువను సృష్టిస్తాయి. ఇప్పుడు ప్రతి వినియోగదారుడికి ఉత్పత్తిదారుడిగా మారే అవకాశం లభించింది. ‘పీఎం సూర్య ఘర్ యోజన’ ఇప్పటికే 40 లక్ష గృహాల్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేయించి మంచి పురోగతి సాధిస్తోంది. ఇది భవిష్యత్తులో వినియోగదారుల మధ్య నేరుగా విద్యుత్ లావాదేవీలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ మార్పును సులభతరం చేయడానికి ‘ఇండియా ఎనర్జీ స్ట్యాక్’ (భారత ఇంధన వ్యవస్థ) భారతదేశ డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోంది. విద్యుత్ రంగంలో యుపిఐ వంటి ఒక విప్లవాత్మక క్షణం త్వరలోనే రాబోతోంది.
వినియోగదారులే కేంద్రంగా ఇంధన వ్యవస్థ వైపు సాగుతున్న ఈ మార్పులో వికేంద్రీకరణ తదుపరి దశ. విద్యుత్ పంపిణీ రంగం పుంజుకుంటున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. పంపిణీ, ప్రసార నష్టాలు 15 శాతానికి తగ్గాయి, విద్యుత్ సంస్థలు చరిత్రలోనే మొదటిసారిగా లాభాల దిశగా పయనిస్తున్నాయి. పటిష్టమైన ఇంధన వ్యవస్థలు కేవలం బలమైన దేశీయ విధానాల ద్వారానే కాకుండా, బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా మాత్రమే నిర్మితమవుతాయని భారత్ ఎల్లప్పుడూ నమ్ముతుంది. బ్రిక్స్ అసలైన బలం ఒకరికొకరు అండగా నిలవడంలోనే ఉంది. ఏ ఒక్క బ్రిక్స్ దేశం వద్ద మాత్రమే అన్ని పరిష్కారాలు లేవు, కానీ మనమందరం కలిసికట్టుగా ఉంటే సురక్షితమైన, పటిష్టమైన, స్థిరమైన ఇంధన వ్యవస్థలను నిర్మించడానికి అవసరమైన దాదాపు అన్ని వనరులు మన వద్ద ఉన్నాయి. ఈ ఏడాది కూడా భారత్ బ్రిక్స్ కూటమికి నాయకత్వం వహిస్తున్న తరుణంలో ఈ ఉమ్మడి దార్శనికతను ఆచరణాత్మక ఫలితాలుగా మార్చడమే మా లక్ష్యం. తద్వారా సుస్థిరమైన, సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మిస్తాం.
మనోహర్ లాల్ ఖట్టర్,
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి

