దళితుల మధ్య కాంగ్రెస్ సర్కార్ కుంపటి
ఎస్సీ వర్గీకరణ అమలు పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖరారు చేసిన రోస్టర్ పాయింట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని దళిత సంఘాల నేతలు, నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రోస్టర్ పాయింట్లను ఖరారు చేయడం ద్వారా దళిత వర్గాల మధ్య ప్రభుత్వమే కుంపటి రాజేసిన్నట్లు అవుతున్నది. రోస్టర్ పాయింట్లలో ఎస్సీ ‘ఏ’ గ్రూపునకు ప్రాధాన్యత దక్కలేదని, ‘సీ’ గ్రూపునకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం-2025’ పేరిట నూతన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన రిజర్వేషన్లను ఇకపై గ్రూపుల వారీగా అమలుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మొత్తంగా 59 షెడ్యూల్డ్ కులాలు ఉండగా, ఇప్పటివరకు ఆ కులాలకు రాజ్యాంగబద్ధంగా 15% రిజర్వేషన్లను గంపగుత్తగా అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం మొత్తం షెడ్యూల్డ్ కులాలను వాటిని జనాభా, ఆర్థిక వెనకబాటు ఆధారంగా మూడు గ్రూపులుగా ప్రభుత్వం విభజించింది. అదేవిధంగా 15% రిజర్వేషన్లను కూడా విభజించింది. ‘ఏ’ గ్రూప్లో అత్యంత వెనుకబడిన 15 ఎస్సీ ఉపకులాలను చేర్చి వారికి 1%, ‘బీ’ గ్రూప్లో మాదిగ సహా 18 కులాలకు 9%, ‘సీ’ గ్రూప్లో మాల సహా 26 కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించింది. సవరించిన రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ నియామకాలు, స్థానిక సంస్థలు, ఇతర వాటిల్లో అమలు చేసేందుకు, అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలతోపాటు ప్రభుత్వ సర్వీస్ నియమకాల్లో అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సవరించింది. నూతన రోస్టర్ పాయింట్లను ఖరారు చేసింది. దాని ప్రకారం గ్రూప్-ఏ లోని కులాలకు 7వ రోస్టర్ పాయింటు, గ్రూప్-బీ కులాలకు 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 రోస్టర్ పాయింట్లు, గ్రూప్-సీలోని కులాలకు 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు కేటాయించింది. ఈ కేటాయింపుల పట్ల దళిత వర్గాలలోని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రిజర్వేషన్ల మూల సూత్రం అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం. కానీ, ఎస్సీలకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల కేటాయింపు అందుకు విరుద్ధంగా ఉన్నదనే విమర్శలు తలెత్తుతున్నాయి.
ఎస్సీ వర్గీకరణపై 1995లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ 1996లో తన నివేదికను సమర్పించగా, దాని ఆధారంగా 1997 జూన్లో ఆనాటి తెలుగుదేశం (ఎన్డీఏ భాగస్వామి) ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను ఏ, బీ, సీ, డీగా విభజిస్తూ జీవో విడుదల చేసింది. ఆ తర్వాత 2000లో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ ‘రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం’ చేసి అమల్లోకి తీసుకొచ్చింది. ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు రిజర్వేషన్ కోటా అమలు చేసింది. రోస్టర్ పాయింట్లను కూడా ఏ, బీ, సీ, డీ వారీగా ప్రాధాన్యతనిస్తూ కేటాయించింది. 2004లో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేసింది. ఆ తర్వాత గత సంవత్సరం సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ సందర్భంగానూ అత్యంత వెనకబడిన వర్గాలకు న్యాయం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని విమర్శలు చెలరేగుతున్నాయి. రోస్టర్ పాయింట్ల కేటాయింపు ఏ, బీ, సీ గ్రూపుల క్రమానుగతంగానే ఉండాలి. దాని ప్రకారం అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తదుపరి గ్రూప్ బీ, ఆపై గ్రూప్ సీకి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రోస్టర్ పాయింట్లు కేటాయించింది. అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలను పక్కన పెట్టి గ్రూప్-బీ ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లలో మొదటి ప్రాధాన్యత, ఆ తరువాత గ్రూప్-ఏలోని అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు 7వ రోస్టర్ పాయింట్ కేటాయించింది. ఆపై గ్రూప్-సీ కులాలకు అవకాశం కల్పించింది. ఈ రోస్టర్ పాయింట్ల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్-బీలోని మహిళా అభ్యర్థితో నింపుతారు. అకడ అర్హతలున్న అభ్యర్థి లేకుంటే గ్రూప్-ఏ, ఆ తర్వాత గ్రూప్-సీలోని కులాలతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోతే, ఆయా ఖాళీలను క్యారీఫార్వర్డ్ చేస్తారు. ఇది కేవలం గ్రూప్-బీ అభ్యర్థుల కోసమే రూపొందించినట్టు ఉన్నదని ఏ, సీ గ్రూపులోని ఎస్సీ కులాలు వివరిస్తున్నాయి.
ఒక గ్రూపులో అర్హతలున్న మహిళా అభ్యర్థి లేకుంటే, అదే గ్రూపునకు సంబంధించిన పురుష అభ్యర్థితోనే పోస్టును భర్తీ చేయాలని, ఆ మేరకు అర్హులు లేకుంటే తదుపరి గ్రూపునకు సంబంధించిన అభ్యర్థికి అవకాశం కల్పించాలని, కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రోస్టర్ పాయింట్లను ఖరారు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీ ఓవర్సీస్తోపాటు పలు పథకాలను అదే తరహాలోనే అమలు చేస్తున్నారని ఉదహరిస్తున్నాయి.
కృష్ణ చైతన్య

