అసత్య ప్రచారాలతో అరాచక రాజకీయాలు
యుద్ధంలో మొదట బలయ్యేది నిజమేనని ఒక నానుడి ఉంది. వర్తమాన రాజకీయ పోటీల విషయంలోనూ ఇది అక్షరాలా నిజమవుతోంది. నేటి ప్రజాస్వామ్య చర్చలో ‘పోస్ట్-ట్రూత్’ (నిజాల కంటే భావోద్వేగాలకే ప్రాధాన్యమిచ్చే) రాజకీయం ఒక కీలక పరిణామంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ‘సత్యానంతర’ (పోస్ట్ ట్రూత్) పరిస్థితుల్లో వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రచారం, వక్రీకరించిన కథనాలు, హేతుబద్ధత లేని భావోద్వేగపూరిత విజ్ఞప్తులు.. నిష్పాక్షిక వాస్తవాలను, నిర్ధారించుకోగల ఆధారాల కంటే ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయి. హేతుబద్ధమైన చర్చ స్థానంలో ప్రజలను భావోద్వేగాలకు గురిచేసి ప్రభావితం చేసే వాక్చాతుర్యం చోటుచేసుకుంటోంది.
ఒకప్పుడు ప్రధానంగా విద్యావేత్తల చర్చలకే పరిమితమైన ‘పోస్ట్ ట్రూత్’ (సత్యం కంటే భావోద్వేగాలే ముఖ్యమనే) భావన ఇప్పుడు దైనందిన రాజకీయాల్లో భాగమైంది. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడమే కాకుండా, ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఉద్దేశించిన తప్పుడు సమాచారం, ప్రచారాలు పెరుగుతున్నాయి. ప్రజలను వాస్తవాలపై అనుమానపడేలా చేయడం, వారి నమ్మకాలను తారుమారు చేయడం ఈ ప్రచారాల లక్ష్యంగా మారుతోంది. ఆరోపణలకు మద్దతుగా స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, వాటిని పదేపదే ప్రస్తావిస్తూ మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సత్యం కేవలం మొదటగా బలికావడమే కాకుండా, చివరికి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. భారత రాజకీయ చర్చలూ ఈ సత్యానంతర ధోరణికి అతీతంగా లేవు. ప్రతిపక్షాల్లోని కొన్ని వర్గాలు కృత్రిమంగా ఆగ్రహావేశాలను రగిలించడం, తప్పుడు ప్రచారానికి పాల్పడటం, ప్రజల్లో గందరగోళం, అశాంతి సృష్టించేందుకు తప్పుడు సమాచారాన్ని ఆయుధంగా మలుచుకోవడం పెరుగుతోంది. జాతీయ ప్రయోజనాల కంటే స్వార్థపూరిత రాజకీయ లక్ష్యాలకే ప్రాధాన్యమిస్తున్నాయి.
ఈ వ్యాసం ఉద్దేశం ప్రతిపక్షాలపై కేవలం విమర్శలు గుప్పించడమో, రాజ్యాంగ సంస్థలు విమర్శలకు అతీతమైనవని చెప్పడమో కాదు. ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణే జీవనాడి. అయితే, దాని పేరుతో అసత్యాలను ప్రచారం చేసే హక్కు ఎవరికీ లేదు. మెరుగైన విధానాల రూపకల్పనకు భిన్నాభిప్రాయాలు అవసరం. కానీ, వాస్తవాల పరిశీలనకు నిలబడలేని ఆరోపణలతో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ, ప్రతీకారపూరితంగా నిరంతర దాడులు చేయడానికి భిన్నాభిప్రాయాలను సాకుగా ఉపయోగించలేం. అందువల్ల, వాస్తవాలను వక్రీకరించే తప్పుడు ప్రచారాన్ని సవాలు చేయడం, ఉద్దేశపూర్వకంగా అపనమ్మకాన్ని సృష్టించే కపట రాజకీయాల వల్ల దెబ్బతిన్న రాజ్యాంగ సంస్థలపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం. ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ప్రతిపక్షాల్లోని కొన్ని వర్గాలు ఎన్నికల సంస్థలను, ఎన్నికల ప్రక్రియలను ఏ విధంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయో పరిశీలించినప్పుడు ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ముఖ్యంగా మూడు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల)లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పదేపదే ఆరోపణలు చేయడం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చుట్టూ వివాదాన్ని సృష్టించడం, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విశ్వసనీయతను దెబ్బతీసేందుకు బాధ్యతారహితంగా ప్రయత్నించడం ఇందులో ప్రధానమైనవి. మొదటగా, ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు పదేపదే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ తరహా అభ్యంతరాలను సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో పరిశీలించింది. చివరకు 2024లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ అనుమానాలకు తెరదించింది. తిరిగి కాగితపు బ్యాలెట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలన్న డిమాండ్లను తిరస్కరించింది. తగిన ఆధారాలు, గణాంకాలు లేకుండా కేవలం అనుమానాలు, సందేహాల ఆధారంగా పదేపదే సవాళ్లు విసరడాన్ని కోర్టు ”హేయం, అవాంఛనీయం”గా అభివర్ణించింది. అయినప్పటికీ, అవే అబద్ధాలను పదేపదే ప్రచారం చేయకుండా ప్రతిపక్షాలను ఈ తీర్పు నిలువరించలేకపోయింది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చుట్టూ నెలకొన్న వివాదం కూడా ఇదే సత్యానంతర రాజకీయ ధోరణికి మరో ఉదాహరణ. చట్టబద్ధమైన, పరిపాలనాపరంగా సమర్థించదగిన ప్రక్రియను కొందరు తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాస్పదం చేస్తున్నారు. 2025లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పులో, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలకు ఓటర్ల జాబితాల సమగ్రతే పునాది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ”ఓటర్ల జాబితా కచ్చితత్వం, సంపూర్ణత, సమగ్రత”ను నిర్ధారించే లక్ష్యం ”చట్టబద్ధమైనదే కాకుండా, ఎన్నికల సంఘానికి అప్పగించిన రాజ్యాంగపరమైన బాధ్యతలో అంతర్భాగం” అని పేర్కొంది. ఓటర్ల జాబితాల సవరణకు చూపిన కారణాలకు, విశ్వసనీయమైన ఎన్నికల ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరానికి మధ్య ”ప్రత్యక్షమైన, హేతుబద్ధమైన సంబంధం” ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ అభిప్రాయాలు ఒక మౌలిక సూత్రాన్ని మరోసారి బలపరిచాయి. ఓటు హక్కును పరిరక్షించడమంటే అర్హులైన ప్రతి ఓటరుకు ఆ హక్కు అందేలా చూడటమే కాదు; ఓటర్ల జాబితాలు కచ్చితంగా, సంపూర్ణంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడటం కూడా అవసరం.
ఈవీఎంలు, ఎస్ఐఆర్ అంశాలకే పరిమితం కాకుండా, ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని, తద్వారా భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేలా నిరంతర దుష్ప్రచారం సాగుతోంది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం) నియంత్రణను కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించాయి. ప్రతిపక్ష నాయకుడికి కూడా చోటు కల్పిస్తూ, బహుళ సభ్యులతో కూడిన ఎంపిక కమిటీ ద్వారా నియామక ప్రక్రియను సంస్థాగతం చేయడం ద్వారా మా ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చింది. ఇతర రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను గౌరవించే విషయంలోనూ కాంగ్రెస్ చరిత్ర ఏమంత ఆదర్శప్రాయంగా లేదు. 1951లో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును తిప్పికొట్టేందుకు తొలి రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. తద్వారా వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించింది.
ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ సవరణలను ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఆయుధాలుగా ఉపయోగించారు. ఎమర్జెన్సీ ప్రకటనను న్యాయ సమీక్షకు అందకుండా చేయడంతోపాటు, ప్రధానమంత్రి ఎన్నికను కూడా న్యాయస్థానాల పరిశీలన పరిధి నుంచి తప్పించేలా సవరణలు చేశారు. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి విస్తృతమైన రక్షణ కల్పిస్తూ, న్యాయ సమీక్ష పరిధిని కుదించారు. రాజ్యాంగ సంస్కరణలకు ఉపయోగపడాల్సిన సవరణాధికారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలను విస్తరించుకునే సాధనంగా మార్చేశారు. సంస్థల హక్కులే కాదు, పౌరుల మానవ హక్కులనూ కాలరాశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించిన అటార్నీ జనరల్ నిరేన్ డే సుప్రీంకోర్టులో వాదిస్తూ, వ్యక్తిగత కక్షతో వ్యవహరించిన పోలీసు అధికారి ఒక నిర్దోషిని చంపినా, ఆ బాధితుడి కుటుంబానికి న్యాయస్థానం నుంచి ఉపశమనం పొందే హక్కు ఉండదని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నామో దీనితో పోల్చి చూడాలి. పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందిన 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును గౌరవించడమే కాకుండా, దొడ్డిదారి చట్టాల ద్వారా దానిని నీరుగార్చే ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. రాజ్యాంగం పట్ల, దాని మౌలిక సూత్రాల పట్ల మా ప్రభుత్వానికి గల గౌరవానికి, నిబద్ధతకు ఇది నిదర్శనం.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. అధికరణం 370ని రద్దు చేసినప్పుడు, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించినప్పటికీ, ప్రతిపక్షాల్లోని పలువురు ఇప్పటికీ ఆ తీర్పుతో విభేదిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి శాసన ప్రక్రియలు, రాజ్యాంగబద్ధ పదవులు కూడా విమర్శలకు అతీతంగా లేవు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని నిబంధనల ప్రకారం వ్యవహరించాలని స్పీకర్ కోరినందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యంలో ఒక నిర్ణయంతో విభేదించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, ఆ విభేదాలకు అసత్యాలు పునాదిగా ఉండకూడదు. సమాజంలో గందరగోళం, అశాంతి సృష్టించడం వాటి లక్ష్యం కాకూడదు. రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఒక ప్రసంగంలో రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను ఆశ్రయించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించారు. ఆయన సందేశం నేటికీ ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణకు, అరాచకానికి మధ్య ఉన్న కీలకమైన తేడాను అర్థం చేసుకునేందుకు ప్రతిపక్ష నాయకులు ఆ చారిత్రక ప్రసంగాన్ని చదవడం మంచిది.
రాజకీయ సమానత్వంతోపాటు ఆర్థిక, సామాజిక న్యాయం కూడా బలమైన ప్రజాస్వామ్యానికి పునాదులని మేము విశ్వసిస్తున్నాం. మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఈ సూత్రమే ఆధారం. అదే సమయంలో, స్థిరమైన, పరిణతి చెందిన ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ప్రజలు తమ భిన్నాభిప్రాయాలను, ఆందోళనలను చట్టబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాల్లో వ్యక్తం చేయడం అవసరం. గందరగోళం, అశాంతికి దారితీసే చర్యలకు పాల్పడకుండా, చర్చలు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. రాజకీయ పరాజయాల నుంచి పుట్టుకొచ్చే నిరాశ కారణంగా మన ప్రజాస్వామ్య సంస్థలు గానీ, భారత్ ప్రగతి గానీ బందీ కావడానికి వీల్లేకుండా చూడాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. తమ పరాజయాలకు గల కారణాలను విశ్లేషించుకొనే బదులు వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయాలని చూసే శక్తుల వల్ల దేశ పురోగతి ఏ పరిస్థితుల్లోనూ కుంటుపడేందుకు అనుమతించబోం.
రాజ్నాథ్ సింగ్,
కేంద్ర రక్షణ మంత్రి
