సెమికాన్ 2.0తో ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ శక్తిగా తీర్చిదిద్దే దిశగా కేబినెట్లో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. రూ.1,27,500 కోట్ల వ్యయంతో, 12 సంవత్సరాల కాలవ్యవధితో చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమం ‘సెమికాన్ 2.0’ పథకం ద్వారా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా సప్లయ్ చైన్‌లో ఇబ్బందులు, పెరుగుతున్న సాంకేతికంగా దేశాల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటుగా రూ.62,500 కోట్లతో తీసుకొచ్చిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (MPMS) కూడా దేశ మొబైల్ తయారీ రంగంలో ఒక కొత్త విప్లవానికి బాటలు వేయనుంది. మొత్తంగా రూ.1.9 లక్షల కోట్లతో మొబైల్, సెమీకండక్టర్ రంగం అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
PLI తో మారిన ముఖచిత్రం
మోదీ ప్రభుత్వం అమలు చేసిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (PLI) కారణంగా 2014-15లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న మన దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ విలువ 2025-26 నాటికి రూ.13 లక్షల కోట్లకు పెరిగింది. దీంతోపాటుగా ఎగుమతులు రూ.38 వేల కోట్ల నుంచి రూ.3.3 లక్షల కోట్లకు, మొబైల్ ఫోన్ తయారీ రూ.18 వేల కోట్ల నుంచి రూ.5.45 లక్షల కోట్లకు, మొబైల్ ఎగుమతులు రూ.1,500 కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు పెరిగాయి. 2014కు ముందు 90%గా ఉన్న మొబైల్ ఫోన్ల దిగుమతులు దాదాపు సున్నా శాతానికి చేరుకోవడం దేశ పారిశ్రామిక పురోగతికి, కేంద్ర ప్రభుత్వ దీర్ఘదృష్టి నిర్ణయాలకు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఇవాళ దేశంలో అత్యధికంగా విదేశాలకు ఎగుమతులు చేస్తున్న అన్ని రంగాలతో పోల్చి చూసినట్లయితే మొబైల్ తయారీ రంగం మూడోస్థానంలో ఉంది.
సెమికాన్ ప్రాజెక్టు 1.0 కింద కేంద్ర ప్రభుత్వం రేపటి ప్రపంచానికి అవసరమైన నైపుణ్యతతో కూడిన యువతను సిద్ధం చేసేందుకు 315 విశ్వవిద్యాలయాల్లో 68 వేల మంది విద్యార్థులకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ డిజైన్ అటొమేషన్ (EDA) టూల్స్ తో ఆధునిక సాంకేతికతతో కూడిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందించింది. ఇందులో తెలంగాణ నుంచి ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ వరంగల్, జేఎన్టీయూ హైదరాబాద్, బీఐటీఎస్ హైదరాబాద్, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ సహా మొత్తం 27 విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలున్నాయి. దీంతోపాటుగా దేశవ్యాప్తంగా 105 స్టార్టప్‌లు చిప్ డిజైన్‌లో పని చేస్తున్నాయి. ఈ స్టార్టప్‌లు MSME లు శాటిలైట్ కమ్యూనికేషన్స్, డ్రోన్స్, నిఘా కెమెరాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT), LED డ్రైవర్లు, AI పరికరాలు, టెలికాం పరికరాలు, స్మార్ట్ మీటర్లు వంటి వాటిలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్స్ ను తయారు చేస్తాయి.
తెలంగాణలో EMC లకు కేంద్రం ప్రోత్సాహం
ఈ-సిటీ, ఫ్యాబ్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ఫీల్డ్ EMC ప్రాజెక్టు కోసం రూ.252 కోట్లు, మహేశ్వరం గ్రీన్‌ఫీల్డ్ EMC ప్రాజెక్టు కోసం రూ.139 కోట్లు, హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ కు రూ.75 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేయనున్న EMC ప్రాజెక్టు కోసం రూ.258 కోట్లు కలిపి తెలంగాణలో EMC ల కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.724 కోట్ల ఆర్థిక సాయం అందించింది. సెమికాన్ 2.0లో చిప్ డిజైన్, మెషీన్స్ & మెటీరియల్స్, మరిన్ని సిలికాన్/కాంపౌండ్ సెమీకండక్టర్ & డిస్ప్లే ఫ్యాబ్‌ల ఏర్పాటు, ATMP (సెమీకండక్టర్స్ అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్) / OSAT (ఔట్ సోర్స్డ్ సెమీకండక్టర్స్ అసెంబ్లీ అండ్ టెస్ట్) పరిశ్రమల విస్తరణ, అధునాతన R &D (రీసెర్చ్ & డెవలప్మెంట్), టాలెంట్ డెవలప్మెంట్ అనే 6 ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 2028లో తొలి సిలికాన్ ఫ్యాబ్ ప్రారంభం కానుండగా భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ, డిజైన్ హబ్‌గా నిలబెట్టేందుకు ఈ సెమికాన్ 2.0 పథకం కీలక పాత్ర పోషించనుంది.
ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ రంగంలో జరుగుతున్న మార్పులను తెలంగాణకు అవకాశాలుగా మలచుకునేందుకు ఇదే సరైన సమయం. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, వ్యాక్సిన్, హెల్త్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ రంగాలకు దేశంలో ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెమికాన్ 2.0తో తెలంగాణకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలోని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు రూ.1,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు అందించింది. ఇప్పుడు సెమికాన్ 2.0 ద్వారా వచ్చే వచ్చే అవకాశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని, సెమీకండక్టర్ తయారీ, ATMP యూనిట్లు, డిజైన్ సెంటర్లు, పరిశోధనా సంస్థలను ఆకర్షించేందుకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాలి.
సెమికాన్ 2.0తో పాటుగా రూ.62,500 కోట్లతో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (MPMS) కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశంలో మొబైల్ ఫోన్స్ తయారీని మరింత విస్తరించడం, దేశీయంగా వాల్యూ యాడెడ్ ప్రొడక్షన్ పెంచడం, సప్లయ్ చైన్ ను బలోపేతం చేయడం, భారతీయ బ్రాండ్లను ప్రపంచస్థాయికి మరింతగా తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద మొబైల్ ఫోన్ తయారీపై 2.25% నుంచి 5% వరకు ప్రోత్సాహకం, దేశీయంగా కీలక విడిభాగాల కొనుగోలుపై అదనంగా 1.5%, భారతీయ బ్రాండ్ల డిజైన్, రీసర్చ్ & డెవలప్మెంట్ కోసం మరో 3% అదనపు ప్రోత్సాహకం అందించనున్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరిగే అవకాశం ఉండగా, సుమారు 60,000 ప్రత్యక్ష ఉపాధి కల్పన జరగనుంది. ఇది దేశ మొబైల్ తయారీ రంగంతో పాటుగా తెలంగాణలో మొబైల్ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే మొబైల్ తయారీ రంగం ద్వారా దేశంలో 25 లక్షల మందికి ఉపాధి లభిస్తుండటం సంతోషించాల్సిన విషయం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ విజన్ కారణంగా 2014-15తో పోలిస్తే ఎలక్ట్రానిక్స్ తయారీ 7 రెట్లు, ఎగుమతులు 11 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా నిలిచింది. దేశంలో వినియోగిస్తున్న 99.2% మొబైల్ ఫోన్లు మేకిన్ ఇండియా స్ఫూర్తితో భారత్‌లోనే తయారవుతున్నాయి. 2025లో స్మార్ట్ఫోన్లు ప్రపంచంలో భారత్ నుంచే అత్యధికంగా ఎగుమతి అయ్యాయి. ఈ పథకం ప్రయోజనాన్ని తెలంగాణ పెద్ద మొత్తంలో సద్వినియోగం చేసుకోవాలి. మొబైల్ ఫోన్ తయారీ, కంపోనెంట్ తయారీ, డిజైన్, R & D కేంద్రాలు తెలంగాణలో స్థాపించే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న EMC (ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్)లు, ESDM (ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్) ఎకోసిస్టమ్, టీహబ్, ఐఐటీలు హైదరాబాద్ లో ఉండటంతో వాటి సహకారంతో ఏర్పడే నూతన సంస్థలకు మరింత బలం చేకూరుతుంది. తెలంగాణ యువతకు కూడా ఇదొక సువర్ణావకాశం. చిప్ డిజైన్, సెమీకండక్టర్ తయారీ, క్లీన్‌రూమ్ టెక్నాలజీ, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ వంటి ఆధునిక నైపుణ్యాలతో యువత ప్రపంచ స్థాయి ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వికసిత భారత్-2047 లక్ష్య సాధనలో మన దేశం ఈ రంగంలో మరింత దూసుకుపోయే విధంగా యువశక్తి కీలక పాత్ర పోషించాలి.
జి.కిషన్ రెడ్డి,
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

