GKR Pracharam

జూబ్లీహిల్స్‌లో బిజెపి వ్యూహాత్మక ప్రచారం

GKR Pracharamగెలుపే లక్ష్యంగా జూబ్లీహిల్స్‌లో బిజెపి ఎన్నికల ప్రచారం వ్యూహాత్మకంగా సాగింది. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు కోరుతూ నియోజకవర్గంలో ఏ ఇంటినీ వదిలిపెట్టకుండా, ప్రతి ఒక్కరినీ కలిసేలా, పక్కా ప్రణాళిక ప్రకారం ప్రచారం చేపట్టింది. సభలు, ర్యాలీలు, కార్నర్ మీటింగులు, గడప గడప ప్రచారం, బస్తీల్లో భేటీలు, అపార్ట్ మెంట్ సొసైటీలతో సమావేశాలతో ప్రతి ఓటరును చేరుకొంది. మహాపాదయాత్ర పేరిట ఒకేరోజు 150 మంది నాయకులు ప్రచార బరిలో దిగి, కమలం గుర్తుకు ఓటు వేసేలా ప్రజలను ఒప్పించడం విశేషం. ఈ ప్రచారంలో అధికార కాంగ్రెస్ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లో ఎండగట్టారు. మోదీ ప్రభుత్వంలో దేశాభివృద్ధి, రాష్ట్రానికి అందించిన సహకారాన్ని వివరించారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయని మజ్లిస్.. కాంగ్రెస్ తోలు కప్పుకొని వస్తోన్న విషయాన్ని ప్రధానంగా ఎత్తిచూపారు. 2023 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున బరిలో దిగిన నవీన్ యాదవ్, ఈసారి కాంగ్రెస్ టికెట్ తో పోటీలో ఉండడమే ఇందుకు నిదర్శనమంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఓటేసినా, బీఆర్ఎస్ కు ఓటేసినా అది మజ్లిస్ కు చేరుతుందని విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. బిజెపి నాయకుల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రజకార్ల వారసులైన ఎంఐఎం ఆటలు సాగనివ్వమని, ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటెయ్యమని ప్రజలు తేల్చిచెప్పారు.

అభివృద్ధి చేయకుండా తాయిలాలా? : రాంచందర్ రావు

ప్రచారంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వేరు వేరు కార్యక్రమాల్లో మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్ నియోజకవర్గం వీధుల్లో నడవలేని పరిస్థితి.. వీధి లైట్లు వెలగట్లేదు.. రోడ్లు దారుణంగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం దుస్థితికి కారణం ఎవరంటే నగర పరిపాలన చేతుల్లో ఉండే మున్సిపల్ శాఖది. ఈ శాఖ మంత్రిగా పదేండ్లు పని చేసిన కేటీఆర్, గత రెండేళ్లుగా ఇప్పుడు పని చేస్తున్న రేవంత్ రెడ్డిలదే బాధ్యత. నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా ఇప్పుడు తాయిలాలతో ఓట్లు అడుక్కుంటున్నారు. టోపీలు పెట్టుకుని ముస్లిం సంతుష్టీకరణతో గెలవాలనుకుంటున్నారు. ముస్లింల వెనుకబాటుకు కారణం కాంగ్రెస్. ఇక్కడ ముస్లింలకు ఏమిచ్చారు..? స్కూల్స్ ఇచ్చారా..? ఇండ్లు ఇచ్చారా..? కేవలం బుజ్జగింపుతోనే 20శాతం ముస్లిం ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలదీ ఇదే ధోరణి. అసలు విషయాలు వదిలేసి ముస్లింలు ఖబ్రస్థాన్ కోసం స్థలం అడిగితే హిందువుల ప్రాంతాల్లో ఇస్తారా..? మరో దగ్గర రక్షణ రంగ భూములు కేటాయిస్తారా? అయ్య జాగీర్ అనుకుంటున్నావా..? నరేంద్ర మోదీ సర్కారు వచ్చిన తర్వాతనే ముస్లింలకు ఉచిత రేషన్, ఇండ్ల నిర్మాణం జరిగింది. ముస్లిం మహిళలకు రక్షణ లభించింది. ఇదంతా బిజెపి వల్లనే తప్ప ఏ ఇతర పార్టీతో కాదు. ముస్లింలకు ఉద్యోగాల కల్పన చేసింది బిజెపి. దేశంలో ఇప్పుడు ఐక్యత అవసరం. మనం ఎవరికి ఓటువేస్తున్నాం..? ఎందుకు ఓటు వేస్తున్నాం..? అని ఆలోచించి ఓటు వేయాలి.’’ అని రాంచందర్ రావు అన్నారు.

జూబ్లీహిల్స్‌కూ పాతబస్తీ పరిస్థితి: కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచినంత మాత్రాన జరిగే మార్పు ఏమీ ఉండదని, ఈసారి బిజెపికి అవకాశం ఇచ్చి, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని అభ్యర్థించారు. ‘‘స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంటి పార్టీలు పాలించాయి, కానీ మన బతుకులు మాత్రం మారలేదు. డ్రైనేజీ నీటిలో నిలబడి మీటింగ్‌లు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. పేరుకు ధనవంతుల కాలనీగా ఉన్నా, జూబ్లీహిల్స్‌లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. రహ్యత్ నగర్, వెంగళరావు నగర్, బోరబండ కాలనీల్లో మురుగు నీరు పారుతున్నా, ఈ కంపు వాసనలో ప్రజలు ఎలా బతుకుతున్నారో కేసీఆర్ ఒక్క రోజైనా ఆలోచించారా? వర్షం వస్తే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. ఇక్కడ 11 ఏళ్లుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, జూబ్లీహిల్స్‌ను కేసీఆర్ పూర్తిగా పట్టించుకోలేదు. ఖైరతాబాద్, షేర్‌లింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌ల లాగా జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏమిటి? జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ పార్టీలకు ఓటేస్తే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టే. ఈ రెండు పార్టీలు ఎంఐఎంకు కీలుబొమ్మలుగా మారాయి. ఈ మూడు పార్టీలు నిజానికి ఒక్కటే. పాతబస్తీలో మజ్లిస్ నేతలు హిందువులపై దాడులు చేశారు. పాతబస్తీలో మంత్రులు పర్యటించాలంటే ఎంఐఎం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. రేపు జూబ్లీహిల్స్‌కు కూడా అదే పరిస్థితి రావచ్చు. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 భృతి వంటి హామీలు అమలు చేయకుండా డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్నారు. మోసపూరిత పార్టీలకు ఓటు వేయకుండా, ఆత్మగౌరవంతో ఈ రెండు పార్టీలపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఇది. జూబ్లీహిల్స్ ప్రజలు అమ్ముడుపోకుండా పులిబిడ్డల్లా నిలబడాలి.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం: బండి సంజయ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ సంతుష్టీకరణ రాజకీయాలను ఎండగట్టారు. టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హిందువును… టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చనని స్పష్టం చేశారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చాడని చురకలంటించారు. ‘‘అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా? ఓవైసీ సోదరులను భాగ్యలక్ష్మీ గుడికి తీసుకుపోయి బొట్టు పెట్టించి, అమ్మవారి పాట పాడించే దమ్ముందా?’’ అని నిలదీశారు. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని ఆయన తల్లి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గోపీనాథ్ ఆస్తులను పంచుకునేందుకు రేవంత్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేశారన్నారు. ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయన్నారు. రేవంత్ కు దమ్ముంటే.. గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు వావి వరసల్లేవని, చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేనే లేదని, సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమని విమర్శించారు. మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు హితువు పలికారు. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు పీక్క తినేటోడు వచ్చిండంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్ అని, వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. పొరపాటున కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళ సూత్రం కూడా గుంజుకుపోతారని హెచ్చరించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరారని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కొమ్ముకాయడం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మండిపడ్డారు. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఓవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ హిందువులారా… 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించాలంటూ కమలం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు.

2028 విజయానికి జూబ్లీహిల్స్ నాంది: షెకావత్

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. జూబ్లీహిల్స్‌లో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 2028 శాసనసభ ఎన్నికల్లో బిజెపి విజయాన్ని ఎవరూ ఆపలేరని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే బిజెపి విజయానికి నాంది అని తెలిపారు. ఒకప్పుడు ఇద్దరు సభ్యులున్న బిజెపి.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా నిలవడంలో ప్రవాసీల పాత్ర మరువరానిదని అన్నారు. ప్రతి గ్రామంలోనూ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడించడంలో ప్రవాసీలు అత్యంత కీలక పాత్ర పోషించారన్నారు. ఎన్నో ఉద్యమాల తర్వాత తెలంగాణ పుట్టిందన్న ఆయన పదేళ్ల పాటు కుటుంబ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్ట పోయిందన్నారు. తెలంగాణ ప్రజలు కన్న కలలను బీఆర్ఎస్ సాకారం చేయలేదన్నారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎంతో ఒప్పందాలు చేసుకుని తమ ప్రభుత్వాలను నడిపాయని ఆరోపించారు. నవీన్ యాదవ్ అప్పుడు ఎంఐఎం.. ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీపడుతున్నాడని, ఈ పార్టీల ఒప్పందం ఎలా ఉందో తేటతెల్లం అవుతుందన్నారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, రాష్ట్ర పదాధికారులు తదితర నాయకులు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో భేటీ అయి బిజెపికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ సైతం లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంచారు. కార్నర్ మీటింగుల్లో అభివృద్ధి కోసం కమలం గుర్తుకు ఓటు వేయాలన్నారు. దేశ భద్రతతో బిజెపి రాజీపడదన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రు దేశాలు గడగడలాడాయని చెప్పారు.

నవంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 9న ప్రచారానికి తెరపడింది. అయితే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. పెద్దఎత్తున అధికార దుర్వినియోగం, అక్రమాలకు తెరతీసింది. ఓటర్లకు డబ్బులను ఎరగా వేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. నవంబర్ 14న వెల్లడి కానున్న ఫలితాల్లో జూబ్లీహిల్స్ భవితవ్యం తేలనుంది.