Visit

ఇది రాబందుల ప్రభుత్వం!

Maktal Paramarshaనారాయణపేట జిల్లా మక్తల్‌లో బిజెపి 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, గిరిజన బిడ్డ ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆయన ఫిబ్రవరి 10న మక్తల్‌ వెళ్లారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మహాదేవప్ప గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారని, కానీ అధికార పార్టీ నాయకులు తమను వేదిస్తూ, బెదిరిస్తూ, భయపెట్టారని ఆయన భార్య  రాంచందర్ రావుకు తెలిపింది. వారి ఒత్తిడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె వివరించింది. పార్టీ తరఫున ఎరుకల మహాదేవప్ప కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడుతూ ఇలాంటి నీచ రాజకీయాలకు దిగడాన్ని ఖండించారు. ఇంకా స్థానికులు, పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడి ఈ ఘటన గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘గత కొంతకాలంగా ఎరుకల మహాదేవప్పను అధికార పార్టీ నాయకులు తీవ్రంగా వేధించారని మాకు తెలిసింది. మహాదేవప్ప గారి భార్య చెప్పిన విషయాలు ఇప్పటికే వార్తల్లో కూడా వచ్చాయి. మహాదేవప్ప భార్యకు చదువురాదు. అయినప్పటికీ ఆమెతో సంతకం చేయించుకుని, ఆమెకు తెలియకుండా వివరాలను మార్చి తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి దారుణాలు, బెదిరింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రేవంత్ ప్రభుత్వం కాదు.. రాబంధుల ప్రభుత్వం. పోలీసులు చట్టపరంగా వ్యవహరించకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించవద్దు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులే ఇలా ప్రవర్తించడం అన్యాయం. ఎవరి ఒత్తిళ్లకు లోబడి తప్పుడు ఎఫ్ఐఆర్‌లు రాస్తున్నారు? ఎస్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోంది. ప్రాణాలు తీసేంత దారుణంగా వ్యవహరించడమేంటి? ఇది ఒక ఎస్టీ కుటుంబానికి, ఒక గిరిజన బిడ్డకు జరిగిన ఘోరమైన అన్యాయం. అబద్ధాలు సృష్టించి, ఆధారాలు మార్చి ఇలా చేయడం ఎంత వరకు సమంజసం? కొంతకాలం క్రితం మహాదేవప్పపై బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించారు. కానీ ఆయన తిరిగి బిజెపిలోకి వచ్చి, 6వ వార్డు అభ్యర్థిగా నిజాయితీగా పోటీలో నిలిచారు. మక్తల్ పట్టణంలో ఈ విధంగా వేధింపులతో రాజకీయాలు చేస్తూ ప్రజలను గోస పెట్టడం సరికాదు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టి, తప్పుడు ఎఫ్ఐఆర్‌ను సరిచేయాలి. పోస్టుమార్టం నిర్వహించాలి. మానవ హక్కుల సంఘం కూడా ఇక్కడకు వస్తుంది. బాధ్యతారహితంగా వ్యవహరించి, ఎఫ్ఐఆర్‌ను మార్చి తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బిజెపి కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఎవ్వరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆత్మహత్యలకు పాల్పడవద్దు. పోస్టుమార్టం జరిపించి, తప్పుడు ఎఫ్ఐఆర్‌ను మార్చేవరకు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.’’ అని అన్నారు.