NRR Arrest

నిరాధార ఆరోపణలు.. ప్రశ్నిస్తే దాడులు.. పేట్రేగుతున్న కాంగ్రెస్ అరాచకాలు

NRR Arrestరాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనకు ఇటీవలి కామారెడ్డి ఘటనలు అద్దం పడుతున్నాయి. తెలంగాణలో బిజెపికి వస్తోన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యాలయాల భూములు ఆక్రమించారంటూ కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అసత్య ఆరోపణలు చేశారు. తన ఆరోపణలపై ఆధారాలు ఉంటే దమ్ముంటే చర్చకు రావాలని షబ్బీర్ అలీకి కాటిపల్లి సవాల్ విసిరారు. నిజంగా ఆధారాలు ఉండి ఉంటే షబ్బీర్ అలీ ఈ సవాల్ స్వీకరించి ఉండేవారు, కానీ ఆధారాలు చూపోట్టక కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను ఉసిగొల్పారు. షబ్బీర్ అలీ ఆదేశాలతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాటిపల్లి నివాసం, క్యాంప్ కార్యాలయంపై దాడికి దిగారు. దాడి చేసినవారిని వదిలేసి, కాంగ్రెస్ గూండాల దాడిని ప్రతిఘటించిన 70 మంది బిజెపి కార్యకర్తలను అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారు. పోలీసులు బాధితులైన బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి నిదర్శనం.

కాటిపల్లి వెంకట రమణా రెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి విషయం తెలియడంతో బిజెపిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వెంటనే కామారెడ్డి బయలుదేరిన బిజెపి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, కార్యకర్తలకు అండగా నిలిచేందుకు అక్కడకు వెళ్లాలని భావించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ లను గృహ నిర్బంధం చేశారు. బిజెపి నాయకులు, కార్యకర్తల గృహ నిర్బంధాలు, అరెస్టులను కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ తదితరులు తీవ్రంగా ఖండించారు.

”ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డిపై ఆధార రహితంగా ఆరోపణలు చేసి, వాటిని నిరూపించాలని ఆయన సవాల్ చేసిన వెంటనే హౌజ్ అరెస్టుకు పాల్పడటం ముమ్మాటికీ కక్ష సాధింపే. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటును కాంగ్రెస్ నాయకులు కారుతో గుద్ది ధ్వంసం చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎమ్మెల్యేకు సంఘీభావంగా కామారెడ్డికి వెళ్లేందుకు సిద్ధమైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టు చేయడం తెలంగాణలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. ఇది ప్రజాస్వామ్య హక్కులపై బహిరంగ దాడి.” అని కిషన్ రెడ్డి విమర్శించారు.

”రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి? బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ఇంటిపై దాడి అమానుషం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును హౌజ్ అరెస్ట్ చేయడం అన్యాయం. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే. ఆత్మ రక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గు చేటు.” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”ప్రజాస్వామ్యంలో చర్చకు స్థానం ఉండాలి గానీ, హింసకు కాదు. కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన అల్లర్లకు పాల్పడటం అత్యంత దుర్మార్గం. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కామారెడ్డిలో ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే బిజెపి సహించదని హెచ్చరిస్తున్నాం.” అని ఈటల రాజేందర్ అన్నారు.