కాంగ్రెస్ మహిళా వ్యతిరేక వైఖరిపై గళమెత్తిన తెలంగాణ నారీలోకం
కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండీ’ కూటమి కపట బుద్ధిని, మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న హైదరాబాద్ లో నిర్వహించిన ‘మహిళా ఆగ్రహ యాత్ర’ ఉవ్వెత్తున ఎగిసింది. దోమల్‌గూడలోని ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్క్ వరకు సాగిన ఈ భారీ పాదయాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొని కాంగ్రెస్ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, బిజెపి శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఇతర నాయకులు ముపాల్గొని మహిళా లోకానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. బిజెపి మహిళా మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, సామాన్య మహిళామణులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. కాంగ్రెస్ దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్లను ఏ విధంగా అడ్డుకుందో వివరిస్తూ నినాదాలు చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్న కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. దారి పొడవునా కాంగ్రెస్ మహిళా వ్యతిరేక ఆలోచనలను ఎండగడుతూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. జంటనగరాల నలుమూలల నుంచి తరలివచ్చిన నారీలోకంతో ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్క్ వరకు ఉన్న రహదారులన్నీ కాషాయమయమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మారిస్తే.. కాంగ్రెస్ మాత్రం దానిపై రాజకీయం చేస్తూ అడ్డుకుందని నేతలు విమర్శించారు. యాత్ర ముగింపులో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన సభలో మహిళా నాయకులు ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. మోదీ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం చేపట్టిన చారిత్రాత్మక పథకాలను వివరిస్తూనే.. మహిళా రిజర్వేషన్లకు గండికొట్టిన కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. నారీ శక్తి ఆగ్రహానికి కాంగ్రెస్ అంతర్థానం కావడం ఖాయమని హెచ్చరించారు. ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న మహిళా నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా ‘నారీశక్తి వందన్ అధినియమ్’ తీసుకువచ్చి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే, దానిని కూడా రాజకీయం చేస్తూ అడ్డుకున్న ఘోర చరిత్ర కాంగ్రెస్, ఇండీ కూటమి సొంతమని మండిపడ్డారు. మహిళా శక్తి ఎదగడం ఇష్టం లేని కాంగ్రెస్ డీలిమిటేషన్ అంశాన్ని అడ్డం పెట్టుకుని మహిళల అభివృద్ధిని కాలరాస్తోందని మండిపడ్డారు.
కౌరవుల మాదిరిగానే కాంగ్రెస్
ఈ నిరసన సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులని మండిపడ్డారు. తెలంగాణలో తొలిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ కేబినెట్లో ఒక్క మహిళా మంత్రికి కూడా చోటు కల్పించని చరిత్ర వారిదని, మహిళా లోకంపై వారికి ఉన్న గౌరవం ఎంతో దీనిని బట్టే అర్థమవుతుందని విమర్శించారు. నేడు రాజకీయ ఉనికి కోసం మహిళా బిల్లును అడ్డుకుంటూ.. ఈ అంశాన్ని ఉత్తర-దక్షిణ భారతాల మధ్య విభజన రాజకీయంలా మార్చడం దారుణమన్నారు. జార్జ్ సోరోస్ వంటి అంతర్జాతీయ శక్తుల ప్రభావంతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు దేశంలో విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నిప్పులు చెరిగారు.
పార్లమెంటులో మహిళా బిల్లుపై కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును చూస్తుంటే మహాభారతంలోని కౌరవుల సభ గుర్తుకు వస్తోందని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో కౌరవులు నవ్వుతూ ఏ విధంగా అవమానించారో.. నేడు మహిళల హక్కుల బిల్లు ఓడిపోతుంటే కాంగ్రెస్ నాయకులు అదే విధంగా నవ్వుతూ సంబరాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అవమానించిన వారు కౌరవుల మాదిరిగానే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. మహాభారత ధర్మయుద్ధంలో కృష్ణ పరమాత్ముని అండతో పాండవులు ఏ విధంగా విజయం సాధించారో.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అదే రీతిన మహిళల పక్షాన నిలిచి ధర్మయుద్ధం చేస్తున్నారని కొనియాడారు. మహిళలకు అన్యాయం జరగకుండా ‘నారీశక్తి వందన్ అధినియమ్’ ద్వారా వారికి రాజకీయ రక్షణ కల్పించేందుకు మోదీ కట్టుబడి ఉన్నారని, రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్ల లక్ష్యాన్ని తప్పకుండా సఫలీకృతం చేస్తామని భరోసా ఇచ్చారని రాంచందర్ రావు గుర్తుచేశారు. ఈ ధర్మయుద్ధంలో నారీశక్తి విజయం సాధించడం ఖాయమని, హైదరాబాద్ వీధుల్లో నేడు కదలివచ్చిన మహిళా లోకానికి తాను పాదాభివందనం చేస్తున్నానని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఏప్రిల్ 17 చీకటి రోజు
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకతను గుర్తించినప్పటికీ, దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ఆ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తూ మహిళా లోకానికి ద్రోహం చేసిందని విమర్శించారు. ఏప్రిల్ 17ను దేశ చరిత్రలో మహిళా లోకానికి జరిగిన అవమానకరమైన ‘చీకటి రోజు’గా ఆయన అభివర్ణించారు. ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొస్తే.. ఆ బిల్లును అడ్డుకుని, కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లోపల, బయట సంబరాలు చేసుకోవడం వారి మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. నేడు బీసీ జనాభా గణన గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ పని చేయలేదని ఆయన నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే బీసీల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని స్పష్టం చేశారు. మహిళలను రాజకీయంగా, సామాజికంగా వెనక్కి నెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ కుట్రలను నారీలోకం గమనిస్తోందన్నారు. కేవలం మహిళలకే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు గండికొడుతూ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాన్ని ప్రజలంతా తిప్పికొట్టాలని, మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా అందరూ ఏకం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టినా, మహిళా లోకానికి అన్యాయం చేయాలని చూసినా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలతో పాటు వారి మిత్రపక్షాల నాయకులు స్టాలిన్, అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం మహిళా రిజర్వేషన్లను, డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకుంటున్న ఈ నేతలందరూ ప్రజలకు జవాబుదారీగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నారీ శక్తికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఈ నాయకులకు రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెబుతుందని ఆయన ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ చట్టం తెచ్చినా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆచరణ సాధ్యం కాని మాటలతో తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా, చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. రేపు డీలిమిటేషన్ ప్రక్రియలో తెలంగాణకు గానీ, మహిళలకు గానీ అన్యాయం జరిగితే దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏకమై అడ్డుకోవడం వారి మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. ఈ అప్రజాస్వామిక ధోరణిని పల్లె పల్లెనా ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మహిళా సంఘాలు ఏకమై కాంగ్రెస్ కపట బుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మహిళా హక్కుల కోసం పెద్ద ఎత్తున గళమెత్తాలని కిషన్ రెడ్డి కోరారు.
మీ ఇంటికొచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండి
మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడంతోపాటు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని భావించి సంబురాలకు సిద్ధమైన దేశ మహిళల ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు. పులి పంజా విసిరేటప్పుడు ఒక అడుగు వెనకకు వేస్తోందని, అంత మాత్రాన ఓడినట్లు కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మహిళా బిల్లు విషయంలో ఒక అడుగు వేశారని, రెట్టించిన ఉత్సాహంతో మరో 10 అడుగులు ముందుకేసీ రాబోయే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ”సంక్షేమ పథకాలే కాకుండా మహిళలకు రాజకీయ ప్రాధాన్యమిచ్చి చట్టసభల్లో అడుగుపెట్టేలా చేయాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిని అడ్డుకుని విపక్షాలు విర్రవీగుతున్నాయి. మహిళా బిల్లును అడ్డుకునే పార్టీలన్నీ కుటుంబ వారసత్వ పార్టీలే. సోనియాగాంధీ, ఇందిరాగాంధీ, కనిమొళి, డింపుల్ యాదవ్, సుప్రియా సూలే పార్లమెంట్ లో ఉంటే చాలు, సాధారణ మహిళలకు చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత లేదని కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఎన్సీపీ పార్టీలు చెబుతున్నాయి. అందుకే మహిళా బిల్లును అడ్డుకున్నాయి. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందుతుందని సంబురాలకు సిద్ధమైన మహిళల ఆశలపై నీళ్లు చల్లారు.
తెలంగాణలోనూ మహిళలకు నెలకు రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్ రెడ్డిని గద్దె దించండి. అందులో భాగంగా మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండి. మహిళా ఆక్రోశం ఏమిటో తెలిసేలా రేవంత్ రెడ్డికి చురకలు అంటించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ముమ్మాటికీ మహిళా పక్షపాతి. రాష్టపతిగా, ఆర్థిక మంత్రి బాధ్యతలను మహిళలకు అప్పగించడమే నిదర్శనం.” అని బండి సంజయ్ అన్నారు.
మహిళా హక్కులను కాలరాయడమే
అనంతరం రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా, మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వాలు జనాభా లెక్కల సాకుతో దశాబ్దాల కాలం మహిళా రిజర్వేషన్లను వాయిదా వేస్తూ వచ్చాయని, కానీ మోదీ ప్రభుత్వం 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 2029 నాటికే రిజర్వేషన్లు అమలు చేసేలా అడుగులు వేస్తోందని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలకు ఒక్క సీటు కూడా తగ్గకుండా, పైగా సీట్ల సంఖ్య పెరిగేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, పార్లమెంట్ సీట్లు 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉందని.. తద్వారా మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం పెరుగుతుందని వివరించారు. ఈ ప్రక్రియను అడ్డుకోవడం అంటే కేవలం మహిళలనే కాకుండా, దళిత, గిరిజన వర్గాల హక్కులను కూడా కాలరాయడమేనని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్ల (ముస్లిం కోటా) పేరుతో కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు పసలేని వాదనలు చేస్తూ మహిళా బిల్లుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా 2029లో 33 శాతం రిజర్వేషన్ల అమలును ఆపే శక్తి ఎవరికీ లేదని, మహిళల హక్కులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు ఇంటింటికీ వెళ్లి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉనికి కోల్పోతామని వారి భయం
ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక గొప్ప ఫార్ములాతో, దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో ఎలాంటి అన్యాయం జరగకుండా, దేశమంతా సమన్యాయం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా వేలాది మంది మహిళలకు, యువతకు రాజకీయ అవకాశాలు లభిస్తే తమ ఉనికి ఎక్కడ కోల్పోతామో అన్న భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు ఈ బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. గతంలో సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్లపై హామీ ఇచ్చి, చిత్తశుద్ధి లేక నామమాత్రపు ప్రయత్నాలతో కాలయాపన చేశారని మండిపడ్డారు. డీలిమిటేషన్ తర్వాత మహిళలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిసినా.. అబద్ధాలు, అపోహలతో దేశ ప్రజలను ప్రతిపక్షాలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందలేదని తెలియగానే రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నాయకులు సంబరాలు చేసుకోవడం వారి మహిళా వ్యతిరేక ఆలోచనలకు పరాకాష్ట అని అరుణ విమర్శించారు. సామాన్య మహిళలు చట్టసభలకు రావడం ఇష్టం లేని ఈ వారసత్వ రాజకీయ నేతలు, కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే పదవుల్లో ఉండాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత దక్కకుండా కుట్రలు చేస్తున్న పార్టీలకు రాబోయే రోజుల్లో నారీలోకం సరైన బుద్ధి చెబుతుందని ఆమె హెచ్చరించారు.
30 ఏళ్లుగా మహిళా బిల్లు నిర్వీర్యం
అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో మహిళలను పూజించడం, గౌరవించడం ఆనవాయితీ అని, అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని కొనియాడారు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ముందుకొచ్చింది మహిళలేనని, చంద్రమండలంపై అడుగుపెట్టిన కల్పనా చావ్లా భారతీయ ముద్దుబిడ్డ అని గుర్తుచేశారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకునే దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని.. ‘మోదీ హై తో ముమ్కిన్ హై’ (మోదీ ఉంటే సాధ్యమే) అని స్పష్టం చేశారు. 1996 నుండి దాదాపు 30 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ఏ విధంగా నిర్వీర్యం చేసిందో అందరికీ తెలుసని మండిపడ్డారు. ‘మహిళలకు శక్తినిద్దాం.. దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టండి’ అని మోదీ పార్లమెంటులో కోరినా, కాంగ్రెస్ తన అబద్ధపు ప్రచారాలతో అడ్డుకుందని ధ్వజమెత్తారు. బిజెపికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ దక్షిణ భారతదేశం నుండి కాంగ్రెస్ కొత్త అబద్ధాలను వదులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లు విషయంలో ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినా, తప్పకుండా 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని మోదీ మాట ఇచ్చారని గుర్తుచేశారు. మహిళా శక్తిని, ఈ బిల్లును అడ్డుకోవాలని చూసే వారిని ప్రజలు పాతాళంలోకి తొక్కివేయడం ఖాయమని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
హైదరాబాద్ సాక్షిగా జరిగిన ‘మహిళా ఆగ్రహ యాత్ర’ కాంగ్రెస్ నీచ రాజకీయాల పట్ల నిరసన గళంతో ఉవ్వెత్తున ఎగిసి విజయవంతంగా ముగిసింది. మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, మహిళా వ్యతిరేక కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని మహిళలు, బిజెపి శ్రేణులు హెచ్చరించారు.

