Lathicharge

దిల్లీలో విద్యార్థుల కోసం రాహుల్ నిరసనలు.. తెలంగాణలో అణచివేత

నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నెల రోజులకు పైగా దిల్లీలో సీజేపీ నిరసనలు జరుపుతుంటే కాంగ్రెస్ గాని, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గాని ఏనాడూ నోరు విప్పలేదు. కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు. కానీ పార్లమెంట్ వద్దకు వారు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకం కాగానే రంగంలోకి దిగారు. కనీసం గాయపడిన వారి పరామర్శించకుండా ‘దొంగచాటు’గా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్దకు వచ్చి నాటకీయంగా ప్రదర్శన జరిపారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి, భద్రతా పరిమితులను ఏ మాత్రం పట్టించుకోకుండా, దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టారు. అయినా, ప్రభుత్వం ఎంతో సంయమనంతో వ్యవహరించి, ఆయన వద్దకు మంత్రి డా. జితేంద్ర సింగ్ ను పంపింది. ‘మీ డిమాండ్లు ఏమిటి?’ అని ఆయన అడిగితే పార్లమెంట్ లో ఈ విషయమై చర్చకు ప్రభుత్వం ఒప్పుకుంటే సరిపోతుందని చెప్పారు. అందుకు ప్రభుత్వ ఆమోదం తెలపగానే మాటమార్చారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. అంతేకాదు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు సైతం రాజీనామాలు చేయాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ ఉద్దేశ్యం సమస్యకు పరిష్కారం కనుగోవడం కాకుండా సీజేపీ ఆందోళనతో తాము రాజకీయ ప్రయోజనం పొందాలనే సంకుచిత ధోరణి అని స్పష్టమైంది. దానితో కాంగ్రెస్ నాయకులను అక్కడి నుండి తరలించక పోలీసులకు తప్పలేదు. 

“లాఠీచార్జ్‌ ప్రజాస్వామ్య మార్గం కాదు. ప్రశ్నలు అడిగినందుకు యువతను కొట్టడం సరైంది కాదు. పార్లమెంట్‌లో నిలదీస్తాం” అని అంతకు ముందు రోజు దిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యలను ఖండిస్తూ చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో 150కు పైగా పేపర్ లీక్ లు జరిగాయని ఓ జాబితా విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాలలో జరిగిన పేపర్ లీక్ ల గురించిన వివరాలు సైతం మీడియాలో వచ్చాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యామంత్రి రాజీనామా చేసిన సందర్భం ఉందా? అనే ప్రశ్నకు కాంగ్రెస్ వారి నుండి జవాబులు లేవు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో తాము ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను అమలు పరచమని అడుగుతున్న విద్యార్థులు, యువకులపై పోలీసులను ప్రయోగించి అణచివేత చర్యలకు పాల్పడటం ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి గుర్తుకు రావడం లేదా? ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ హామీలు అమలు చేయాలని, నోటిఫికేషన్లు ఇవ్వాలని అడిగితే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ‘లాఠీ’ఫికేషన్‌ ఇస్తున్నదని మండిపడుతున్నారు. నాడు తమ వెంట ఉంటానని చెప్పిన రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో నిరుద్యోగులపై లాఠీదెబ్బలు పడుతున్నా రాహుల్‌గాంధీ నోటి నుంచి ఒక్కమాట కూడా ఎందుకు రావడం లేదు? ఒక్క ట్వీట్‌ కూడా ఎందుకు వేయడం లేదు? దిల్లీలో లాఠీ పడితే ప్రజాస్వామ్య హననం అయినప్పుడు తెలంగాణలో రాజధర్మం అవుతుందా? కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేస్తే, తెలంగాణలో విద్యాశాఖను తన ఆధీనంలో పెట్టుకున్న ముఖ్యమంత్రికి ఆ సూత్రం వర్తించదా? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 2024 అక్టోబర్ 1న తెలంగాణ గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని కోరిన నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీచార్జి జరిపింది. తెలంగాణ గ్రూప్-1 పరీక్షలలో జరిగిన అక్రమాలపై గత ఏడాది సెప్టెంబర్ 16న నిరసన తెలిపిన నిరుద్యోగులపై లాఠీలను ప్రయోగించారు. ఈ ఏడాది జనవరి 8, 9 తేదీలలో ఉద్యోగాల నోటిఫికేషన్ లను ప్రకటించాలని నిరసనలు జరిపిన యువకులను అణచివేశారు. జనవరి 10న తెలంగాణ పోలీసుల నియామకం నోటిఫికేషన్ కోసం నినదించిన వారిపై విరుచుకు పడ్డారు. జనవరి 18న నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. గత జూన్ లో సిటీ లైబ్రరీ వద్ద తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరసనకు దిగిన ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నించిన వారిపై పోలీసులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగిస్తూ, వారిని అణచివేస్తుంటే రాహుల్ గాంధీ కనీసం సానుభూతి తెలపలేదు. పోలీస్ చర్యను ఖండిస్తూ ట్వీట్ కూడా ఇవ్వలేదు. కానీ దిల్లీలో విద్యార్ధులపై సానుభూతి పేరుతో రాజకీయ డ్రామాకు తెరతీశారు. కాంగ్రెస్ నాయకత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరిని యువకులు, విద్యార్థులు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలి. 

కృష్ణ చైతన్య