కుటుంబ పాలన నుంచి ‘నేషన్ ఫస్ట్’ దిశగా దేశం
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధి, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో విశేష పురోగతి సాధించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఒకప్పుడు కుటుంబ పాలనలో సతమతమైన దేశం నేడు ‘నేషన్ ఫస్ట్’ భావన దిశగా ముందుకెళ్తుందన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. త్వరలోనే తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అమెరికా పర్యటన విజయవంతమైంది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో పాల్గొనేందుకు జూలై 30న అమెరికా వెళ్లిన ఎన్. రాంచందర్ రావుకు వాషింగ్టన్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆటా ప్రతినిధులతో పాటు పెద్దసంఖ్యలో వచ్చిన ప్రవాస భారతీయ బిజెపి కారయకర్తలు, మద్దతుదారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆటా సభలతో పాటు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటనలో ప్రవాస తెలుగు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, యువ నాయకులు, ప్రవాస భారతీయ ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. విజయవంతంగా పర్యటన ముగించుకొని ఆగస్ట్ 6న ఆయన స్వదేశానికి తిరిగివచ్చారు.
ఆగస్ట్ 4న న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి (యూఎస్ఏ ఆఫ్ బిజెపి) నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వందే భారత్ రైళ్లు , ఆయుష్మాన్ భారత్, పీఏం ఆవాస్ యోజనా, జల్ జీవన్ మిషన్, పీఏం కిసాన్, వంటి పథకాలు దేశ అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం, మహిళ రిజర్వేషన్ బిల్లు వంటి నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. ”దేశ రాజకీయ చరిత్రను గమనిస్తే కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులను, ఇతర గొప్ప నాయకులను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటూ దేశానికి నిస్వార్థ సేవ చేసిన శాస్త్రి వంటి నాయకులకు తగిన గుర్తింపు లభించలేదు. కాంగ్రెస్ పాలనకు, బిజెపి పాలనకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు వంట గ్యాస్ కనెక్షన్ లేదా టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. సిఫార్సులు ఉంటేనే పనులు జరిగేవి. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఈ పరిస్థితి మారి, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది. ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ ద్వారా గ్రామాలకు రహదారులు, ప్రపంచ స్థాయి జాతీయ రహదారుల నిర్మాణం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ తర్వాత యూపీఏ-1, యూపీఏ-2 పాలనా కాలంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ, నిర్ణయాధికారం అంతా సోనియా గాంధీ చేతిలోనే ఉందనే భావన ప్రజల్లో బలంగా ఉండేది. 2జీ, కామన్వెల్త్, బొగ్గు కుంభకోణాల రూపంలో లక్షల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టి, దేశం అవినీతిలో కూరుకుపోయింది.
2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ దిశ పరివర్తన చెందింది. ఒకప్పుడు అమెరికా నుంచి గోధుమలు, పాలపొడి దిగుమతులపై ఆధారపడి, సహాయం కోసం చేయి చాచిన భారత్.. నేడు దాదాపు 50-60 దేశాలకు ఆర్థిక సహాయం అందించే స్థాయికి ఎదిగింది. కోవిడ్ సంక్షోభంలో స్వదేశీ టీకా ‘కోవాగ్జిన్’ను తయారు చేసి, 140 కోట్ల మంది భారతీయ పౌరులకు ఉచితంగా అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకూ వ్యాక్సిన్లను అందించి మానవత్వాన్ని చాటుకుంది. మౌలిక సదుపాయాల కల్పనలో 2014కు ముందు కేవలం 75గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 150కి చేరింది. భోగాపురం వంటి ఆధునిక అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం ఇందుకు నిదర్శనం. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ అంతరిక్షంలోకి విజయవంతంగా రాకెట్‌ను పంపడం మన సాంకేతిక ప్రగతికి సాక్ష్యం. రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడిన భారత్, నేడు స్వదేశీ రక్షణ పరికరాలను భారీగా ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఇటీవల జరిగిన సైనిక చర్యల్లో మన ‘మేక్ ఇన్ ఇండియా’ రక్షణ పరికరాలే కీలక పాత్ర పోషించాయి.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అవసరమే, కానీ దేశ భద్రత, సమగ్రత విషయంలో రాజకీయ భేదాలు పక్కనబెట్టాలి. అమెరికాలో 9/11 దాడుల సమయంలో ప్రతిపక్షాలన్నీ రక్షణ చర్యలకు ఏకతాటిపై నిలిచాయి. కానీ మన దేశంలో సైనికులు ప్రాణాలర్పించి పాకిస్తాన్‌పై చర్యలు చేపడితే, కొందరు ప్రతిపక్ష నాయకులు ఆధారాలు చూపాలని అడగడం బాధాకరం. జంతర్ మంతర్ నిరసనల్లో దేశ వ్యతిరేక నినాదాలు రావడం, కాశ్మీర్ అంశంపై బాధ్యతారహితమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదు. మన దేశం ఒక మానవ శరీరం లాంటిది. శరీరంలోని ఏ అవయవాన్ని కోసి వేరొకరికి ఇవ్వలేమో, అలాగే భారత్‌లోని ఏ భాగాన్నీ విడిచిపెట్టలేం.” అని రాంచందర్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి డి.వాసుదేవరావు, యుఎస్ఏ ఆఫ్ బిజెపి మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల, యుఎస్ఏ ఆఫ్ బిజెపి తెలంగాణ కన్వీనర్ విలాస్‌రెడ్డి జంబులా, అమర్ గోస్వామి, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, విజయ్ కుందూరు, ప్రవీణ్ తడకమల్ల, మధు బెల్లం, రామ్ వేముల, సాయినాథ్, బస్వ శేఖర్, హనుమంత్, రవి పటేల్, సుబ్రహ్మణ్యం, కల్పనా శుక్లా, అమిత్పాండే, గుంజన్ మిశ్రా, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, పీయుష్ పటేల్, సుమన్ రాయ్, ఉపేంద్ర చివుకుల, రాజురెడ్డి, సురేష్ పటేల్, శ్రీనివాస్, ప్రదీప్ కట్టతోపాటు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి వందలాది మంది ప్రవాస భారతీయులు, బిజెపి నాయకులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరై ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి తమ మద్దతు ప్రకటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో తాము కూడా భాగస్వాములమవుతామని వారు పేర్కొన్నారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ మహాసభలు, మరియు త్ కన్వెన్షన్ కార్యక్రమాల్లో రాంచందర్ రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

