Coal Mines

PKOC-2: సింగరేణి సిగలో మరో మణిహారం

సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా కేంద్ర మరో ముందడుగు వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని PKOC-2 (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి కట్టబెట్టి, కార్మికుల ఎన్నో ఏళ్ల కలను మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. ఇటీవలే.. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల -2 బ్లాక్ సింగరేణి సిగలో చేరిన సందర్భంలో  PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ ను కూడా సింగరేణికే దక్కేలా చొరవ తీసుకోవాలని కార్మికులు, యూనియన్ లీడర్ల నుంచి డిమాండ్లు వచ్చాయి. PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి వచ్చే విధంగా తెలంగాణ బిడ్డ అయిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి సింగరేణి శ్రేయస్సు, అభివృద్ధి పట్ల నిబద్ధతను, కార్మికుల పట్ల ప్రేమను చాటుకున్నారు.

ఆగస్ట్ 3న వేలం ప్రక్రియ పూర్తయిపోయింది. ఈ విధానంలో సింగరేణి సంస్థకు మణుగూరు PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను కేటాయింపులు జరిగాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి  ఈ డిప్ సైడ్ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వులను సొంతం చేసుకుంది. సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు ఈ మైన్ నడుస్తుంది. దాదాపు 2వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇక్కడ దొరికే G-8 (మంచి క్వాలిటీ) బొగ్గు కారణంగా మొత్తం రూ.43వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం కూడా లభిస్తుంది. దీనివల్ల తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా దక్కడంతో పాటు సింగరేణి భవిష్యత్తు, అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయి. ప్రభుత్వానికి, సింగరేణికి, విద్యుత్ రంగానికి, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. 

సింగరేణి బొగ్గు కంపెనీకి వరుసగా 3 బొగ్గు బావులు దక్కడం ద్వారా దక్షిణ భారతదేశానికి అవసరమైనంత మేర బొగ్గును అందుబాటులోకి తెచ్చి తెలంగాణ ప్రాంతంలో మరింత పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు మేలు జరుగుతుంది. సింగరేణి సంస్థకు.. ఆర్థిక బలం పెరిగి, సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకారంతో 3 బొగ్గు గనులు సింగరేణి సాధించడం ఒక శుభపరిణామం.

నైని, తాడిచర్ల-2, PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ రావడంతో

  • సింగరేణికి 860 మిలియన్ టన్నుల రిజర్వుల సమకూరుతాయి.
  • 6,500 మందికి జీవనోపాధి లభిస్తుంది.
  • సగటున 35 ఏళ్లపాటు ఏడాదికి 22 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి చేయవచ్చు.
  • ఈ 3 బ్లాకుల వల్ల సింగరేణికి రూ.1,95,510 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.
  • రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా రూ.48వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది.