NRR HGT

ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు

NRR HGTభారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ తెలంగాణలో దేశభక్తిపూరిత వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు వారి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇండ్లపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తార్నాకాలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసి, మన త్రివర్ణ పతాకం దేశ ప్రగతికి, వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ ఉద్యమాన్ని ‘వందేమాతరం’ 150 ఏళ్ల వేడుకలకు అంకితం చేయడం ఎంతో ప్రత్యేకమైనదని, ఇది భారతావని ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ‘హర్ ఘర్ తిరంగా’ను గర్వంగా, దేశభక్తి వేడుకగా జరుపుకోవాలని కోరారు. తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ఆగస్టు 12 నుండి 14 వరకు విగ్రహాలు, స్మారక చిహ్నాల వద్ద ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామాలు, కూడళ్లలో తిరంగా ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

బిజెపి రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి దిల్లీలోని తమ నివాసాలలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి, దేశభక్తి స్ఫూర్తిని చాటుతూ ఈ ప్రచారంలో భాగస్వాములయ్యారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి, జెండాతో సెల్ఫీ తీసుకుని వందేమాతరం గీతంతో కలసి harghartiranga.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతం రావు గారు, తూళ్ల వీరేందర్ గౌడ్ కూడా తమ ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించి, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తమ ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తమ నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. అదేవిధంగా పార్టీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల బాధ్యులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేస్తూ, ఆ ఫోటోలు, వీడియోలను #HarGharTiranga హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు.