‘వోకల్ ఫర్ లోకల్’తో ఆర్థికాభివృద్ధి
జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మోదీ చేస్తున్న ప్రచారానికి విస్తృత మద్దతు వస్తోంది. ప్రజలు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా స్థానిక ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ ‘వోకల్ ఫర్ లోకల్’ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బిజెపి తెలంగాణ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 16న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాచందర్ రావు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ ‘వోకల్ ఫర్ లోకల్’ బ్యానర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎన్. రాచందర్ రావు మాట్లాడుతూ.. ”హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్లూమ్స్ వంటి అనేక చేతివృత్తుల వారు దేశంలో ఉన్నారు. భువనగిరి హ్యాండ్లూమ్స్ వరల్డ్ ఫేమస్. గద్వాల, నారాయణపేట్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో కూడా చేతితో తయారయ్యే వస్తువులు ఉన్నాయి. కానీ వీటిని కొనుగోలు చేయకపోవడం వల్ల ఉపాధి కోల్పోయి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు మనం చూశాం. స్థానికంగా MSMEs, ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే, స్వదేశీ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మన దేశంలో తయారైన వస్తువులను స్థానికంగా కొనుగోలు చేయాలని, ఖాదీ, హ్యాండ్లూమ్ లాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలని చెప్పారు. ‘వోకల్ ఫర్ లోకల్ – లోకల్ ఫర్ గ్లోబల్’ నినాదంతో స్థానిక ఉత్పత్తులను ఎగుమతి చేసి, విదేశీ మార్కెట్లో డిమాండ్ పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.” అని అన్నారు.
వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం ”ఆపరేషన్ కగార్” చేపట్టిందన్నారు. దీనివల్ల చాలామంది మావోయిస్టులు లొంగిపోయారని, అడవులను వదిలి ఆయుధాలు అప్పగించారని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను బెదిరించారన్న ఆరోపణలపై స్పందిస్తూ ఈ ఎపిసోడ్లో ఇతర మంత్రుల పేర్లు, ముఖ్యమంత్రి దగ్గరి అనుచరులు కూడా బయటపడుతున్నారన్నారు. ”కాంగ్రెస్ అంటేనే కరప్షన్. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కరప్షన్ కొనసాగింది. ఇప్పుడు తెలంగాణలోనూ సెటిల్మెంట్లు, బెదిరింపులు, అవినీతి వంటి ఘటనల్లో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ దోచుకునే ప్రభుత్వంగా మారింది. బెదిరింపులు, వసూళ్లే పాలనగా మారిపోయాయి. కాంగ్రెస్ DNAలోనే కరప్షన్ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమూ తెలంగాణను దోచుకున్నది. ఇప్పటికీ వారు దోచుకున్న సొమ్మును పంచుకునే క్రమంలో కొట్లాడుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అమసర్థ, నిర్లక్ష్య పాలనలో రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, తెలంగాణ ప్రజలు దోచుకునే పార్టీలను, లీడర్లను, తుపాకీ పట్టుకుని బెదిరింపులకు పాల్పడే నాయకులను తిరస్కరించాలి. మంత్రి కొండా సురేఖ వివాదంలో ఆమె కుమార్తె సుస్మిత ఆరోపణలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాలు బయటపడ్డాయి. దీనిపై పూర్తి విచారణ జరగాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.” అని అన్నారు.

