అంగారక గ్రహ వాతావరణంలో ఎగరనున్న డ్రోన్‌లు
నవంబర్ 30న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో
ప్రధాన మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజిన్ MRO- మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్- సౌకర్యాన్ని కొద్ది రోజుల క్రితం నేను హైదరాబాద్‌లో ప్రారంభించాను. భారతదేశం విమాన నిర్వహణ, మరమ్మత్తు, పునఃపరిశీలన రంగంలో ప్రధాన అడుగు వేసింది. INS’మాహే’ను భారత నౌకాదళంలోకి చేర్చారు. భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇది భారతదేశ నవీన ఆలోచన, ఆవిష్కరణ, యువ శక్తికి ప్రతిబింబంగా నిలిచింది. భారతదేశం 357 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. 10 సంవత్సరాల కిందటితో పోలిస్తే భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి 100 మిలియన్ టన్నులు పెరిగింది. భారతదేశం కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నట్లు కొద్దిరోజుల కిందటే ప్రకటించారు. ఇలాంటి విజయాలను, ప్రజల సామూహిక ప్రయత్నాలను ప్రజలకు అందించడానికి’మన్ కీ బాత్’ కార్యక్రమం ఒక అద్భుతమైన వేదిక.
సోషల్ మీడియాలో ఒక వీడియో కొన్ని రోజుల కిందట నా దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో మన దేశ యువత- ముఖ్యంగా మన Gen-Z- అంగారక గ్రహ వాతావరణంలో డ్రోన్‌లను ఎగరవేయడానికి ప్రయత్నిస్తోంది. డ్రోన్‌లు ఎగురుతాయి. కొన్ని క్షణాలు సమతుల్యంగా ఉంటాయి. అకస్మాత్తుగా నేలపై పడతాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ ఎగురుతున్న డ్రోన్‌లకు GPS సహకారం లేదు. అంగారక గ్రహంపై GPS సాధ్యం కాదు. కాబట్టి డ్రోన్‌లు ఎటువంటి బాహ్య సంకేతాలను లేదా మార్గదర్శకత్వాన్ని స్వీకరించలేవు. డ్రోన్‌లు వాటి కెమెరాలు, అంతర్నిర్మిత సాఫ్ట్‌వేర్ సహాయంతో ఎగరవలసి వచ్చింది. ఆ చిన్న డ్రోన్ నేల నమూనాలను గుర్తించాలి. ఎత్తును కొలవాలి. అడ్డంకులను అర్థం చేసుకోవాలి. సురక్షితమైన ల్యాండింగ్ మార్గాన్ని కనుగొనాలి. అందువల్ల డ్రోన్‌లు ఒకదాని తర్వాత ఒకటి పడిపోయేవి. పూణే నుండి వచ్చిన యువకుల బృందం ఈ పోటీలో కొంతమేరకు విజయాన్ని సాధించింది. వారి డ్రోన్ కూడా చాలాసార్లు పడిపోయి కూలిపోయింది. కానీ వారు వదిలిపెట్టలేదు. అనేక ప్రయత్నాల తర్వాత ఈ బృందం డ్రోన్ అంగారక గ్రహ వాతావరణంలో కొంతసేపటి వరకు ఎగరగలిగింది.
ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు మరొక దృశ్యం గుర్తుకు వచ్చింది. చంద్రయాన్-2 సంబంధం తెగిపోయిన రోజది. ఆ రోజు యావద్దేశం నిరాశ పొందింది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు కొద్దిక్షణాలు నిరాశకు లోనయ్యారు. కానీ, మిత్రులారా! వైఫల్యం వారిని ఆపలేదు. ఆ రోజే వారు చంద్రయాన్-3 విజయగాథ రాయడం ప్రారంభించారు. అందుకే చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయినప్పుడు అది కేవలం ఒక మిషన్ విజయంగా మాత్రమే భావించలేదు. వైఫల్యాన్ని అధిగమించిన తర్వాత నిర్మితమైన ఆత్మవిశ్వాస విజయమది. ఈ వీడియోలో కనిపించే యువకుల కళ్ళలో నేను అదే మెరుపును చూశాను. మన యువత అంకితభావం, మన శాస్త్రవేత్తల నిబద్ధతను చూసిన ప్రతిసారీ నా హృదయం ఉత్సాహభరితమవుతుంది.
జమ్మూ కాశ్మీర్‌లోని కొండ ప్రాంతాలలో తేనెటీగలు సులాయి అని కూడా పేర్కొనే అడవి తులసి నుండి ఒక ప్రత్యేకమైన తేనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ తెల్లరంగు తేనెను రాంబన్ సులాయి తేనె అని పిలుస్తారు. రాంబన్ సులాయి తేనె కొన్ని సంవత్సరాల కిందట జీఐ ట్యాగ్‌ను పొందింది. అప్పటి నుండి ఈ తేనె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.
నేడు భారతదేశం తేనె ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 11 సంవత్సరాల కిందట దేశంలో తేనె ఉత్పత్తి 76 వేల మెట్రిక్ టన్నులు. ఇప్పుడు అది ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలలో తేనె ఎగుమతులు కూడా మూడు రెట్లు పెరిగాయి. హనీ మిషన్ కార్యక్రమం కింద ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థ 2 లక్షల 25 వేలకు పైగా తేనెటీగల పెట్టెలను ప్రజలకు పంపిణీ చేసింది. ఇది వేలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలను అందించింది.
ఈ నెల ప్రారంభంలో సౌదీ అరేబియాలో మొదటిసారిగా గీతను బహిరంగ వేదికపై ప్రదర్శించారు. ఐరోపాలోని లాత్వియాలో కూడా చిరస్మరణీయమైన గీతా మహోత్సవం జరిగింది. లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా, అల్జీరియా ప్రాంతాల కళాకారులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గుజరాత్‌లోని నవానగర్‌కు చెందిన జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ గొప్ప పని ఇప్పటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ప్రపంచ యుద్ధంలో పోలాండుకు చెందిన యూదు పిల్లలను ఎలా రక్షించారనేది ఆయన ఆలోచన. ఆయన గుజరాత్‌లో వేలాది మంది పిల్లలకు ఆశ్రయం కల్పించారు. వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. కొన్ని రోజుల కిందట దక్షిణ ఇజ్రాయెల్‌లోని మోశావ్ నెవాతిమ్‌లో జామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది చాలా విశేషమైన గౌరవం. పోలాండ్‌లోని వార్సాలో ఉన్న జామ్ సాహెబ్ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించే అదృష్టం గత ఏడాది నాకు లభించింది.
శీతాకాల పర్యాటకానికి సీజన్ వచ్చింది. అనేక దేశాలు శీతాకాల పర్యాటకాన్ని తమ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా చేసుకున్నాయి. అనేక దేశాలలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన శీతాకాల పండుగలు, శీతాకాలపు క్రీడా నమూనాలున్నాయి. ఈ దేశాలు స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో ట్రెక్కింగ్, ఐస్ క్లైంబింగ్, ఫ్యామిలీ స్నో పార్కులు వంటి అనుభవాలను తమ గుర్తింపుగా చేసుకున్నాయి. వారు తమ శీతాకాల ఉత్సవాలను ప్రపంచ ఆకర్షణలుగా కూడా మార్చుకున్నారు. మన దేశంలో శీతాకాల పర్యాటకానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మనకు పర్వతాలున్నాయి. సంస్కృతి ఉంది. అంతులేని సాహస అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఉత్తరాఖండ్‌లో శీతాకాల పర్యాటకం చాలా మందిని ఆకర్షిస్తుండడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఔలి, మన్ స్యారీ, చోప్టా, డెయారా వంటి ప్రదేశాలు శీతాకాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
కొన్ని వారాల కిందట భూటాన్‌ను సందర్శించాను. భూటాన్ రాజును, గతంలో రాజుగా ఉన్న ప్రస్తుత రాజు తండ్రిని, ప్రధాన మంత్రిని, ఇతరులను కలిశాను. భగవాన్ బుద్ధుడి పవిత్ర అవశేషాలను అక్కడికి పంపినందుకు ప్రతి ఒక్కరూ భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది విన్నప్పుడల్లా నా హృదయం గర్వంతో ఉప్పొంగింది.
కొన్ని రోజుల కిందట జి-20 శిఖరాగ్ర సమావేశంలో అనేక మంది ప్రపంచ నాయకులకు బహుమతులు అందించే విషయానికి వస్తే ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని మరోసారి చెప్పాను. మన దేశప్రజల తరఫున ప్రపంచ నాయకులకు బహుమతులు అందించేటప్పుడు ఈ భావనను దృష్టిలో ఉంచుకున్నాను. జి-20 సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి నేను నటరాజ కాంస్య విగ్రహాన్ని బహూకరించాను. తమిళనాడులోని తంజావూరు సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉన్న చోళుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. కెనడా ప్రధానమంత్రికి వెండి గుర్రం ప్రతిరూపాన్ని అందజేశాను. ఇది రాజస్థాన్‌లోని ఉదయపూర్ అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. జపాన్ ప్రధానమంత్రికి వెండి బుద్ధ ప్రతిరూపాన్ని బహూకరించాను. ఇది తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన ప్రసిద్ధ సిల్వర్ క్రాఫ్ట్ నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఇటలీ ప్రధానమంత్రికి పూల ఆకృతులతో కూడిన వెండి అద్దం బహుమతిగా ఇచ్చాను. అది కరీంనగర్ సాంప్రదాయిక లోహ శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. కేరళలోని మన్నార్ లో రూపొందించిన అద్భుతమైన కళా నైపుణ్యం ఉండే ఇత్తడి శిల్పాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి బహూకరించాను. భారతీయ చేతిపనులు, కళలు, సంప్రదాయాల గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడం; మన చేతివృత్తులవారి ప్రతిభకు ప్రపంచ వేదికను అందించడం నా లక్ష్యం.
ఈ సంవత్సరం పండుగ షాపింగ్ లో ప్రజలు ఇష్టపూర్వకంగా భారతీయ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. చిన్న చిన్న దుకాణదారులు కూడా ఈ మార్పును అనుభవించారు. ఈసారి యువత కూడా’వోకల్ ఫర్ లోకల్’ అనే స్ఫూర్తిని తమ జీవితాల్లో భాగంగా చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సరానికి షాపింగ్‌లో కొత్త దశ ప్రారంభం అవుతుంది. నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తాను.’వోకల్ ఫర్ లోకల్’ అనే మంత్రాన్ని గుర్తుంచుకోండి. దేశంలో తయారు చేసిన వాటిని మాత్రమే కొనండి. దేశప్రజలు కష్టపడి తయారుచేసిన వాటిని మాత్రమే అమ్మండి.

