ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏప్రిల్ 6న బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బిజెపి నాయకులు, కార్యకర్తలు అన్ని స్థాయుల్లోని పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండా ఎగరవేసి, పార్టీ కోసం, దేశం కోసం అసమాన త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలను స్మరించుకున్నారు. అంతేకాదు, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు తమ నివాసాలపై పార్టీ జెండా ఎగరవేశారు. ఇక హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలోనూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిజెపి జాతీయ నాయకులు మురళీధర్ రావు, బిజెపి శాసన మండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. కోట్లాది మంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బిజెపి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని, అందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. ఇది కేవలం సంబరాలు చేసుకునే రోజు మాత్రమే కాదని, దేశమే ప్రథమం అనే సిద్ధాంతం పట్ల నిబద్ధతను చాటుకునే గర్వకారణమైన రోజని ఆయన పేర్కొన్నారు. నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి మహనీయులు వేసిన పునాదులపై నేడు పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దృఢమైన, స్వయం సమృద్ధమైన ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

