Nitin Nabin at TG formation

అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకుందాం

Delhi TG Formation Dayరాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. తెలంగాణను కొందరు ఏటీఎంలాగా మార్చుకుని కాంగ్రెస్ జేబులు నింపుతున్నారని విమర్శించారు. దీనిని అడ్డుకునేందుకు బిజెపి కార్యకర్తలంతా కలసి పోరాడాలని పిలుపునిచ్చారు. జూన్ 2న బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. దిల్లీ తెలంగాణ భవన్ వేదికగా సాగిన ఈ ఉత్సవాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో తెలంగాణ ఉద్యమ చరిత్ర, బిజెపి నేతల భాగస్వామ్యంపై పలు చిత్రపటాలను ప్రదర్శించారు. తెలంగాణ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నితిన్ నబీన్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, బిజెపి తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలందరికీ నితిన్ నబీన్ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రాత్మక ప్రజా ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నితిన్ నబీన్ ప్రసంగిస్తూ.. ”మొదటి నుంచీ బిజెపి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్ముతూ వచ్చింది. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో జార్ఖండ్, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా ఏర్పాటు చేశాం. తెలంగాణ విషయంలో కూడా మేం మద్దతు తెలిపాం. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం చెర నుంచి విడిపించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఈ సందర్భంగా మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం అనంతరం ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన అడుగు జాడల్లోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ.. వాటి అభివృద్ధికి పాటుపడుతున్నారు. 

తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అలాగే ఈ పోరాటంలో అసువులు బాసిన అమర వీరులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. వారు కలలు కన్న తెలంగాణను నిర్మించుకోవడంలో ఇప్పుడు కాస్త వెనుకబడ్డాం. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి కోసం, అమరవీరులు కలలు కన్న తెలంగాణను నిర్మించుకునేందుకు బిజెపి పోరాటం చేస్తుంది. తెలంగాణ సాధనలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కృషి కూడా మరువలేనిది. పార్లమెంటులో ఆమె తెలంగాణ కోసం గొంతెత్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. జార్ఖండ్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఆర్జేడీ పార్టీ అనవసర రాద్ధాంతం చేసింది. కానీ జార్ఖండ్ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంగ్రెస్ 1969లో దమన కాండ జరిపింది. ఎంతో మంది విద్యార్థుల మరణానికి కారణమైంది. కానీ బిజెపి మాత్రం తెలంగాణ ఏర్పాటులో ఇచ్చిన మద్దతు చాలా గొప్పది. 1997లో కాకినాడ సభలో తెలంగాణ ఏర్పాటు గురించి స్పష్టంగా హామీ ఇచ్చాం. అప్పుడు కేవలం రాజకీయంగా చేసిన వాగ్దానం కాదు.. తెలంగాణ కోసం బిజెపి సంకల్పంతో చెప్పిన మాటలు. తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల సంస్కృతిని కాపాడేందుకు బిజెపి కృషి చేస్తుంది. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. మోసం చేసిన విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దీంతో తెలంగాణలోని అనేక మంది యువతీ యువకులు ప్రాణత్యాగాలు చేశారు. 

గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం.. వికసిత భారత్ లో తెలంగాణను భాగస్వామ్యం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. 31 లక్షల మంది తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ యోజన నిధులు, 75 లక్షలకు పైగా లబ్ధిదారులకు ముద్ర యోజన రుణాలు, 1.27 కోట్ల జనధన్ ఖాతాలు, ఆయుష్మాన్ కార్డులను అందజేశాం. రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను భారీగా తెలంగాణకు మంజూరు చేశాం. బీబీనగర్ లో ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థను ఇచ్చాం. 2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న లక్ష్యంతో పాటు సమృద్ధ తెలంగాణ ఏర్పాటు చేసేందుకు పాటుపడతాం. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందజేస్తాం. బిజెపి నేతృత్వంలో అమరవీరులు కలలు కన్న తెలంగాణను నిర్మించుకుందాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి వికాసానికి పాటుపడుతాం. ” అని నితిన్ నబీన్ అన్నారు.

 త్యాగాల ఫలితమే ‌‌తెలంగాణ: రాంచందర్ రావు

యువకులు, విద్యార్థులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు చేసిన అపారమైన త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని ఈ సమావేశంలో ప్రసంగించిన ఎన్. రాంచందర్ రావు గుర్తుచేశారు. తెలంగాణ ఆకాంక్ష కోసం 1,200 మందికి పైగా యువకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి సుదీర్ఘ పోరాటం, బలిదానాల వల్లే దశాబ్దాల కల సాకారమైందని భావోద్వేగంగా పేర్కొన్నారు. “తెలంగాణ అనేది కేవలం ఒక సాధారణ రాష్ట్రం కాదు.. దీని ఏర్పాటు వెనుక తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవం, అసంఖ్యాక త్యాగాలతో కూడిన ఒక సుదీర్ఘ ఉద్యమం ఉంది” అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య, పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే సిద్ధించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తూ.. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు బేషరతుగా, అచంచల మద్దతు పలికిన అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ స్మరించుకుంటూ “అప్పట్లో సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో తెలంగాణ కోసం బలంగా నిలబడకపోతే, తెలంగాణ గొంతు అంత శక్తివంతంగా వినిపించేది కాదు. తెలంగాణ ప్రజలు ఆమె చేసిన సహకారాన్ని ఎల్లప్పుడూ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటారు” అని కొనియాడారు. 

ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో, ఇప్పుడు మన ప్రయాణం మరింత అభివృద్ధి, ప్రగతి వైపు సాగాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ (వికసిత భారతదేశం) అనే బృహత్ సంకల్పంలో భాగంగా మనమంతా కలిసికట్టుగా ‘వికసిత్ తెలంగాణ’ లక్ష్యం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న బంధాన్ని ప్రస్తావిస్తూ.. రెండు రాష్ట్రాలు పరస్పర స్నేహంతో, ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీతో ముందుకు సాగాలని రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు. “తెలుగు ప్రజలమైన మనకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. మన మధ్య ఎటువంటి ద్వేషాలు, విభేదాలు ఉండకూడదు.. కేవలం అభివృద్ధిలో మాత్రమే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పరస్పర స్నేహం, సంపూర్ణ సహకారం (కోఆపరేషన్) ఉంటేనే ఉభయ రాష్ట్రాలు ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోగలవు. ‘వికసిత్ తెలంగాణ’, ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’లు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే ‘వికసిత్ భారత్’ స్వప్నం సాకారమవుతుందని” రాంచందర్ రావు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి‌‌: కిషన్ రెడ్డి

ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ”తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు అనేక రకాల ఉద్యమాలు చేశారు. వీధుల్లో తెలంగాణ నినాదం చేస్తున్న హైస్కూల్ పిల్లలను ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తుపాకులతో కాల్చి చంపించింది. ఆ సమయంలో కేంద్రంలో ఇందిరా గాంధీ అధికారంలో ఉన్నారు. దాదాపు 320 మంది ప్రాణ త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మలి దశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంతమంది ఆత్మ బలిదానం చేసుకున్న ఉద్యమం చరిత్రలో లేదు. తెలంగాణ పోరాటంలో 4 కోట్ల మంది ముందుకొచ్చి కొట్లాడారు. మలి దశ ఉద్యమం సమయంలో దిల్లీలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్ధాక్షిణ్యంగా అణిచివేసింది. దిల్లీలో యాది రెడ్డి అనే తెలంగాణ విద్యార్థి పార్లమెంటు దగ్గర బలిదానం చేసుకున్నాడు. దీంతో ఉద్యమం దేశవ్యాప్తంగా మార్మోగింది. తన చావుకు కాంగ్రెస్, సోనియా గాంధీ కారణమని లేఖ రాసి మరీ ఆత్మ బలిదానం చేసుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ కలిసి పార్లమెంటులో తెలంగాణ కోసం గొంతెత్తారు. అప్పట్లో ఒక్క తెలంగాణ నుంచి ఒక్క బిజెపి ఎంపీ కూడా లేరు. కానీ దేశంలోని బిజెపి ఎంపీలంతా తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని నిలదీసి తెలంగాణకు మద్దతు పలికారు. సుష్మా స్వరాజ్ నేతృత్వంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు బిజెపి పోరాడింది. దిల్లీలో కూడా భారీ ఉద్యమం చేస్తే అప్పటి కాంగ్రెస్ టియర్ గ్యాస్, లాఠీచార్జ్ చేసింది. చిన్న రాష్ట్రాలు వస్తే అభివృద్ధి జరుగుతుందని నమ్మిన పార్టీ బిజెపి. అందుకే తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికింది. కాంగ్రెస్ అప్పట్లో తెలంగాణ ఉద్యమం విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరించింది. ఒక వైపు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి.. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ బిల్లును ఆపేందుకు పార్లమెంటులో మిర్చి పౌడర్ చల్లుతూ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. తెలంగాణను తీసుకొచ్చింది కాంగ్రెస్ కానే కాదు.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెచ్చుకున్నారు. 

మోదీ నేతృత్వంలో 12 సంవత్సరాల్లో తెలంగాణ కోసం రూ.13 లక్షల కోట్ల నిధులను అందించింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పి.. బంగారు కుటుంబాన్ని పెంచిపోషించారు. తీవ్ర అవినీతి, అహంకారంతో కుటుంబ సభ్యులందరికీ దోచిపెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కూడా తెలంగాణలో ఎలాంటి మార్పు లేదు. అదే విధంగా అవినీతి, అక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ కు అడ్డాగా మార్చారు. తెలంగాణ నుంచి వందల కోట్లను రేవంత్ రెడ్డి తీసుకెళ్లి.. కాంగ్రెస్ అధిష్టానానికి ముట్టజెప్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణను లూటీ చేస్తోంది. ఒకప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ దివాళా దిశగా తీసుకెళ్లారు. ” అని అన్నారు.